
న్యూఢిల్లీ:కరీబియన్ ఆల్‌రౌండర్, కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్ స్పిన్నర్ సునీల్ నరైన్ ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘనత అందుకున్నాడు. ఐపీఎల్ హిస్టరీలో 100 వికెట్లు తీసిన మూడో విదేశీ బౌలర్(అంటే తొలి విదేశీ స్పిన్నర్)గా అతడు రికార్డు జాబితాలో చేరాడు. మొత్తంగా ఈ మార్క్‌ను అందుకున్న పదకొండో బౌలర్‌గా అతడు నిలిచాడు. టోర్నమెంట్లో గత కొన్నేళ్లుగా కోల్‌కతా తరఫున ఆడుతూ నిలకడగా రాణిస్తున్న ఆటగాళ్లలో నరైన్ ఒకడు.
నేటి(మంగళవారం) వరకు నరైన్ కన్నా ముందు లసిత్ మలింగ(154), అమిత్ మిశ్రా(134), పియూశ్ చావ్లా(130), హర్భజన్‌సింగ్(129), డ్వేన్ బ్రావో(123), భువనేశ్వర్ కుమార్(115), ఆశీష్ నెహ్రా(106), అశ్విన్(104), సునీల్ నరైన్(102), జహీర్ ఖాన్(102) ఈ మార్క్‌ను దాటిన వారిలో ఉన్నారు.
సోమవారం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో మ్యాచ్‌లో వెస్టిండీస్ స్టార్ ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో 12వ ఓవర్లో క్రిస్‌మోరీస్‌ను ఔట్ చేయడంతో ఐపీఎల్ కెరీర్లో వందో వికెట్‌ను సాధించాడు. నరైన్ సోమవారం మ్యాచ్‌లో మూడు ఓవర్లు వేసి కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.
ఐపీఎల్లో ఇప్పటి వరకు 86 మ్యాచ్‌లు ఆడిన నరైన్ 2113 పరుగులు చేయడంతో పాటు 102 వికెట్లు తీశాడు. ఇందులో ఒక మ్యాచ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన కూడా ఉండటం విశేషం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన నరైన్ తన కెరీర్లో 17 బంతుల్లో వేగవంతమైన అర్ధశతకం పూర్తి చేశాడు.