గెస్ట్ కామెంటేటర్‌గా ధోనీ

Tue,November 5, 2019 03:53 PM

న్యూఢిల్లీ: భారత్‌లో తొలిసారి డే-నైట్ టెస్టు మ్యాచ్‌కు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యమివ్వనుంది. ఈ మ్యాచ్‌ను చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించాలని బీసీసీఐతో పాటు మ్యాచ్ ప్రధాన ప్రసారదారు స్టార్‌స్పోర్ట్స్ భావిస్తున్నాయి. టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్లను టెస్టుకు ఆహ్వానించి భారత టెస్టు చరిత్రలోని అపూర్వ ఘట్టాలను పంచుకునేలా కొత్తగా ఏర్పాట్లు చేయాలని యోచిస్తున్నాయి. మాజీ ఆటగాళ్ల మర్చిపోలేని అనుభూతులను స్టేడియంలోని బిగ్‌స్క్రీన్లపై ప్రసారం చేయనున్నారు. మాజీ టెస్టు సారథులను ఈ చరిత్రాత్మక టెస్టుకు ఆహ్వానించే ప్రతిపాదనను స్టార్ యాజమాన్యం బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ముందుంచిందని తెలిసింది. 2001లో ఆసీస్‌తో మ్యాచ్‌లో చిరస్మరణీయమైన విజయాన్ని అందించిన వీవీఎస్‌ లక్ష్మణ్‌, రాహుల్‌ ద్రవిడ్‌లతో పాటు ఆ విజయంలో భాగస్వామ్యం అయిన వారికి కూడా ప్రత్యేక ఆహ్వానాలు పంపనున్నారు. ఈ నేపథ్యంలో టెస్టు తొలి రెండు రోజుల్లో వీరంతా స్టేడియంలో సందడి చేయనున్నారు. స్టేడియంలో ఉన్న ప్రేక్షకుల కోసం ఆడియో కామెంటరీ అందించేందుకు స్టార్‌ సిద్ధమవుతోంది.


వన్డే ప్రపంచకప్ ముగిసినప్పటి నుంచి భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. బంగ్లాతో డే-నైట్ టెస్టుకు ధోనీని గెస్ట్ కామెంటేటర్‌గా ఆహ్వానించాలని స్టార్ ప్రయత్నిస్తోంది. బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ధోనీని ఒప్పించగలిగితే కామెంటరీ బాక్స్‌లో మహీని చూసే అవకాశం అభిమానులకు కలుగుతుంది. నవంబర్ 22న భారత్ గడ్డపై తొలి డే-నైట్ టెస్టు మ్యాచ్ ఆరంభమవుతుంది.

రాత్రి పూట మంచు ప్రభావం, స్పిన్నర్లకు బంతిపై పట్టు చిక్కకపోవడం, లైట్ల వెలుతురులో బంతి సరిగ్గా కనిపించకపోవడం, గులాబీ బంతి నాణ్యత అనుకున్న స్థాయిలో లేకపోవడంతో త్వరగా మెత్తబడటం ఇలాంటి కారణాల వల్ల ఇన్నాళ్లు డే అండ్ నైట్ టెస్టులకు దూరంగా ఉంటూ వస్తున్న టీమ్‌ఇండియా ఇక మైదానంలో ఈ సవాళ్లను ఎలా అధిగమిస్తుందో వేచి చూడాలి!

972
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles