ధవిన్‌షో

Fri,May 11, 2018 01:16 AM

SRH Beat DD By 9 Wickets To Qualify For Playoffs

-ప్లే ఆఫ్‌లో హైదరాబాద్
-చెలరేగిన శిఖర్, విలియమ్సన్
-ఢిల్లీ నాకౌట్ ఆశలు గల్లంతు..
-రిషబ్ వీరోచిత సెంచరీ వృథా
అటు రిషబ్ పంత్ (63 బంతుల్లో 128 నాటౌట్; 15 ఫోర్లు, 7 సిక్సర్లు).. ఇటు ధవన్ (50 బంతుల్లో 92 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్సర్లు), విలియమ్సన్ (53 బంతుల్లో 83 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు).. అతనేమో సెంచరీ బాదేశాడు.. ఈ ఇద్దరు కలిసి ఒకటిన్నర సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. మొన్నటి వరకు బౌలింగ్‌తో.. ఇప్పుడు బ్యాటింగ్‌తో.. నిన్నటి వరకు విలియమ్సన్ ఒక్కడే.. కానీ ఇప్పుడు ధవన్ కూడా తోడయ్యాడు. జట్టు ఆటగాళ్ల ప్రదర్శనలో మార్పులు చోటు చేసుకుంటున్నా.. సన్‌రైజర్స్ విజయాల్లో మాత్రం తేడా రావడం లేదు. ఎవరో వస్తారు ఏదో చేస్తారని అనుకోకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని అద్భుతంగా ఒడిసిపట్టుకుంటున్న హైదరాబాద్.. వరుసగా ఆరో విజయాన్ని నమోదు చేసింది. మన బౌలర్లు ఫర్వాలేదనిపించిన చోట.. ఢిల్లీ బౌలింగ్ తేలిపోయింది. మనం భారీ స్కోరును అడ్డుకున్న చోట.. ప్రత్యర్థులు పరుగులు నిరోధించలేకపోయారు. ఫలితంగా కచ్చితంగా గెలువాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ ఢమాల్ కాగా.. సన్‌రైజర్స్ దర్జాగా ప్లే ఆఫ్ బెర్త్‌ను మరింత పటిష్టం చేసుకుంది..!

న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జైత్రయాత్ర కొనసాగుతూనే ఉన్నది. ఎలాంటి ప్రత్యర్థి ఎదురైనా... ఎప్పటిలాగే తమ జోరును కొనసాగిస్తూ వరుస విజయాలతో హోరెత్తిస్తున్నది. తాజాగా ఆల్‌రౌండ్ షోతో అదురగొడుతూ.. గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లోనూ 9 వికెట్ల తేడాతో ఢిల్లీపై గెలిచింది. దీంతో 9 విజయాలతో 18 పాయింట్లతో టాప్‌లోకి దూసుకెళ్లింది. ముందుగా ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 187 పరుగులు చేసింది. రిషబ్ స్ఫూర్తిదాయకంగా ఆడినా.. మిగతా సహచరులు సహకారం అందించడంలో విఫలమయ్యారు. తర్వాత హైదరాబాద్ 18.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 191 పరుగులు చేసింది. శిఖర్, విలియమ్సన్ రెండో వికెట్‌కు అజేయంగా 17 ఓవర్లలో 176 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించి జట్టుకు విలువైన విజయాన్ని అందించారు. ధవన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

అతనొచ్చాకే..

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ ఇన్నింగ్స్ సాధారణంగానే మొదలైంది. ఓపెనర్లు పృథ్వీ షా (9), జాసన్ రాయ్ (11) నాలుగో ఓవర్ చివరి రెండు బంతులకు ఔటయ్యారు. ఈ రెండు వికెట్లను షకీబ్ (2/27) పడగొట్టాడు. 5 ఓవర్లు ముగిసేసరికి జట్టు స్కోరు 23/2. రన్‌రేట్ 4.6 లోపే. ఐదో ఓవర్‌లోనే క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ ఇన్నింగ్స్ చివరి బంతి వరకు ఉన్నాడు. ఎదుర్కొన్న రెండో బంతి నుంచే పరుగుల ప్రవాహం మొదలుపెట్టిన ఈ ఢిల్లీ కుర్రాడు.. చివర్లో ఏకంగా సునామీ సృష్టించాడు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (3), మ్యాక్స్‌వెల్ (9) నిరాశపర్చినా.. హర్షల్ పటేల్ (17 బంతుల్లో 12; 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించాడు.

వామ్మో పంత్..

వాస్తవానికి రిషబ్ పరుగుల తుఫాన్ ఆరో ఓవర్ నుంచే మొదలైంది. కౌల్ వేసిన ఈ ఓవర్‌లో వరుసగా మూడు ఫోర్లు బాది 15 పరుగులు రాబట్టాడు. ఇక్కడి నుంచి మొదలైన జోరు చివరి వరకు సాగింది. అయితే అవతలి వైపునున్న శ్రేయాస్‌ను లేని పరుగు కోసం పిలిచి రనౌట్ చేయడంతో మూడో వికెట్‌కు 22 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక షకీబ్, అఫ్ఘాన్ స్పిన్ గన్ రషీద్ పరుగులు నిరోధించడంతో తొలి 10 ఓవర్లలో ఢిల్లీ స్కోరు 52/3. రన్‌రేట్ కూడా 5.2లోపుగానే ఉంది. కానీ 11వ ఓవర్ నుంచి రిషబ్ విధ్వంసం మరో మెట్టు ఎక్కింది. తిరుగులేని టైమింగ్‌తో అలవోకగా బంతిని స్టాండ్స్‌లోకి పంపిస్తూ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చూపెట్టాడు. ఊచకోత కోశాడు. 11వ ఓవర్ రెండో బంతిని సిక్స్‌గా మలిచి ఆ తర్వాత మరో ఫోర్‌తో 14 పరుగులు రాబట్టాడు. రషీద్ వేసిన 12వ ఓవర్‌లో మరో మూడు ఫోర్లు. ఆ తర్వాత సందీప్ బౌలింగ్‌లో సిక్స్, ఫోర్‌తో మూడు ఓవర్లలోనే 42 పరుగులు జోడించాడు. హర్షల్ పటేల్ సమన్వయం చూపినా.. సన్ ఫీల్డర్ల సూపర్ త్రోకు అతని ఇన్నింగ్స్ ముగిసింది. ఈ ఇద్దరి మధ్య నాలుగో వికెట్‌కు 55 పరుగులు జతయ్యాయి.

షకీబ్ వేసిన 15వ ఓవర్‌లో సిక్స్, ఫోర్ బాది రాబోయే సునామీకి హెచ్చరికలు పంపాడు. 16 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 120/4. రిషబ్ స్కోరు 45 బంతుల్లో 69 పరుగులు. సెంచరీ చేయాలన్న కసో లేక సెలెక్టర్లకు గుర్తు చేయాలన్న తపనోగానీ 17వ ఓవర్ నుంచి అతని బ్యాట్ పెను ఉప్పెనను సృష్టించింది. రషీద్, భువనేశ్వర్ వరుస ఓవర్లలో రెండు సిక్స్‌లు, మూడు ఫోర్లు బాదడంతో 97 పరుగుల్లోకి వచ్చేశాడు. 19వ ఓవర్ తొలి బంతిని బౌండరీ లైన్ ధాటించి ఐపీఎల్‌లో తొలి సెంచరీ ( 56 బంతుల్లో) మార్క్‌ను అందుకున్నాడు. భువనేశ్వర్ వేసిన చివరి ఓవర్ మొదటి బంతికి మ్యాక్స్‌వెల్ ఔటైనా.. తర్వాతి ఐదు బంతుల్లో రిషబ్.. 4, 4, 6, 6, 6తో 26 పరుగులు దంచాడు. మొదటి 50 పరుగులకు 36 బంతులు తీసుకున్న రిషబ్.. తర్వాతి ఫీఫ్టీని 20 బంతుల్లోనే కొట్టేశాడు. మ్యాక్స్‌తో కలిసి ఐదో వికెట్‌కు 31 బంతుల్లో 63 పరుగులు జోడించాడు. చివరి 10 ఓవర్లలో ఢిల్లీ 135 పరుగులు చేయడం విశేషం.

ఇద్దరూ ఇద్దరే..

కండ్ల ముందు భారీ లక్ష్యం ఉన్నా.. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో ఎలాంటి తడబాటు కనబడలేదు. రెండో ఓవర్‌లో హేల్స్ (14) ఔటైనా.. ధవన్, విలియమ్సన్ వీరోచితంగా ముందుకెళ్లారు. ఓవర్‌కు ఓ ఫోర్ చొప్పున కొడుతూ వెళ్లారు. బౌల్ట్‌కు తొలి సిక్సర్ రుచి చూపెట్టిన ధవన్ పవర్‌ప్లేలో జట్టు స్కోరును 57/1కు చేర్చాడు. స్పిన్నర్ల రాకతో శిఖర్ బ్యాట్ మరోసారి విజృంభించింది. మిశ్రా, శంకర్‌ను లక్ష్యంగా చేసుకుని భారీ షాట్లు బాదేయడంతో రన్‌రేట్ 10కి పైగా నమోదైంది. ఈ ఇద్దరి సమన్వయంతో తొలి 10 ఓవర్లలో రైజర్స్ వికెట్ నష్టానికి 91 పరుగులు చేసింది. తర్వాతి ఓవర్‌లో మిశ్రా బంతిని విలియమ్సన్ స్టాండ్స్‌లోకి పంపి 100 పరుగులను ధాటించాడు. 28 బంతుల్లో అర్ధసెంచరీ చేసిన ధవన్ నదీమ్ వేసిన 12వ ఓవర్‌లో రెండు సిక్సర్లు కొట్టి మరింత జోరు చూపెట్టాడు.

కొద్దిసేపటికే విలియమ్సన్ కూడా 38 బంతుల్లో ఫీఫ్టీ మార్క్‌ను అందుకున్నాడు. ఈ ఇద్దరు ఓవర్‌కు ఒకటి, రెండు ఫోర్లు బాదడంతో 11 నుంచి 15 ఓవర్ల మధ్య 61 పరుగులు సమకూరాయి. ఈ క్రమంలో ధనవ్ స్కోరు 38 బంతుల్లో 75 పరుగులకు చేరింది. ఇక చివరి 30 బంతుల్లో 36 పరుగులు అవసరమైన దశలో విలియమ్సన్ రేసులోకొచ్చాడు. ఫ్లంకెట్ బంతిని స్టాండ్స్‌లోకి పంపి 12 పరుగులు రాబట్టాడు. దీంతో విజయసమీకరణం 24 బంతుల్లో 24గా మారింది. వికెట్ల మధ్య వేగంగా పరుగులు తీస్తూ, అవసరమైనప్పుడల్లా బంతిని బౌండరీలైన్ ధాటిస్తూ వరుసగా 6,10, 11 పరుగులు చేసి మరో 7 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని ఖాయం చేసుకుంది. చివరి 8.5 ఓవర్లలో సన్‌రైజర్స్ 100 పరుగులు చేసింది.

Rishabh-Pant

పంత్ ఫటాఫట్

కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలంటారు. రిషబ్ పంత్ చేసింది చేసింది కూడా అదే. ఈ సీజన్‌లో అత్యంత బలమైన బౌలింగ్ లైనప్ ఉన్న సన్‌రైజర్స్‌ను చితక్కొట్టాడు. అదేదో సినిమాలో అన్నట్టుగా.. శివమణి డ్రమ్స్ కొట్టినట్లు..జాకిర్ హుస్సేన్ తబలా వాయించినట్టు కొట్టుడే కొట్టుడు..ఈ యువ కెరటం విరుచుకుపడిన తీరు ఆద్యంతం అద్భుతమే. కౌల్ బౌలింగ్‌లో హ్యాట్రిక్ ఫోర్‌తో మొదలుపెట్టి, భువనేశ్వర్ బౌలింగ్‌లో హ్యాట్రిక్ సిక్సర్లతో ఫినిష్ చేశాడు. రషీద్, షకీబ్ వంటి స్పిన్ ఎటాక్‌ను ఆటాడుకున్నాడు. ఇతడు బాదిన సిక్సర్లకు స్పీడో మీటర్ వణికిపోయి ఉంటుంది. ఇతని బ్యాట్ నుంచి బుల్లెట్‌లా దూసుకొచ్చిన ఫోర్లకు బౌండరీ లైన్ బెంబేలెత్తిపోయి ఉంటుంది. అందుకే శతకం సలామ్ కొట్టింది. క్రీజులో అడుగు పెట్టినప్పుడు ఉన్న స్టామినా, ఇన్నింగ్స్ పూర్తయ్యే వరకు ఏ మాత్రం చెక్కుచెదురలేదు. ఢిల్లీ ఇన్నింగ్స్ మొత్తంలో 28 బౌండరీలు నమోదవగా, అందులో పంత్ 22 బాదాడంటే ఒక్కడే ఎంతటి విధ్వంసం చేశాడో అర్థం చేసుకోవచ్చు.

రికార్డులు కొత్తేమీ కాదు: రిషబ్ అంటే రికార్డులే. అతనికి అవేమీ కొత్త కాదు. బంగ్లాదేశ్‌లో జరిగిన 2016 అండర్-19 ప్రపంచకప్‌లో నేపాల్‌పై 18 బంతుల్లోనే అర్ధశతకం బాది రికార్డు నమోదు చేశాడు. ఆ తర్వాతి మ్యాచ్‌లో నమీబియాపై శతకంతో రెచ్చిపోయాడు. సెంచరీ బాదిన రోజే ఢిల్లీ డేర్‌డెవిల్స్ పంత్‌ను రూ.1.9కోట్లకు కొనడం విశేషం. రంజీట్రోఫీలో మహారాష్ట్రపై ట్రిపుల్ సెంచరీ బాది అతి చిన్న వయసులో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. 2016-17 సీజన్ ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో జార్ఖండ్‌పై 48 బంతుల్లోనే సెంచరీ చేసి అదుర్స్ అనిపించాడు. తాజాగా ఐపీఎల్‌లో అతి పిన్న వయసులోనే సెంచరీ సాధించిన రెండో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఇతని కంటే ముందు మనీశ్‌పాండే 2009లో 19 ఏండ్ల 253 రోజుల్లో సెంచరీ చేయగా, పంత్ 20 ఏండ్ల 218 రోజుల్లో శతకం బాదాడు.

స్కోరు బోర్డు

ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి) ధవన్ (బి) షకీబ్ 9, రాయ్ (సి) గోస్వామి (బి) షకీబ్ 11, శ్రేయాస్ రనౌట్ 3, రిషబ్ పంత్ నాటౌట్ 128, హర్షల్ రనౌట్ 24, మ్యాక్స్‌వెల్ (సి) హేల్స్ (బి) భువనేశ్వర్ 9, శంకర్ నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు: 3, మొత్తం: 20 ఓవర్లలో 187/5.వికెట్లపతనం: 1-21, 2-21, 3-43, 4-98, 5-161.బౌలింగ్: భువనేశ్వర్ 4-0-51-1, సందీప్ 4-0-24-0, షకీబ్ 4-0-27-2, సిద్ధార్థ్ కౌల్ 4-0-48-0, రషీద్ ఖాన్ 4-0-35-0.

సన్‌రైజర్స్ హైదరాబాద్: హేల్స్ ఎల్బీ (బి) పటేల్ 14, ధవన్ నాటౌట్ 92, విలియమ్సన్ నాటౌట్ 83, ఎక్స్‌ట్రాలు: 2, మొత్తం: 18.5 ఓవర్లలో 191/1. వికెట్లపతనం: 1-15 బౌలింగ్: బౌల్ట్ 3.5-0-43-0, పటేల్ 4-0-32-1, నదీమ్ 2-0-22-0, ఫ్లంకెట్ 4-0-41-0, మిశ్రా 3-0-29-0, శంకర్ 1-0-14-0, మ్యాక్స్‌వెల్ 1-0-9-0.
ipl-table

6008
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles