ఆసియా కప్ ఫైనల్: భారత్‌తో మ్యాచ్.. బంగ్లా 222 ఆలౌట్

Fri,September 28, 2018 08:34 PM

Spinners keep Bangladesh to 222 despite Liton 121

దుబాయ్: ఆసియా కప్ ఫైనల్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ స్వల్ప స్కోరుకే ఆలౌటైంది. ఓపెనర్ లిటన్ దాస్(121: 117 బంతుల్లో 12ఫోర్లు, 2సిక్సర్లు) శతకంతో మెరుపులు మెరిపించడంతో 48.3 ఓవర్లలో బంగ్లా 222 పరుగులు మాత్రమే చేసింది. లిటన్ ఒంటరిపోరాటంతో బంగ్లా ఆమాత్రం స్కోరైనా చేసింది. మరో ఓపెనర్ మెహిదీ హసన్(32), సౌమ్య సర్కార్(33) మాత్రమే రాణించారు. మిగతా బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలమయ్యారు. అనవసరపు షాట్లు ఆడటం.. పరిస్థితులకు తగ్గట్లుగా నిలకడగా బ్యాటింగ్ చేయడంలో విఫలమవడంతో సులువుగా వికెట్లు చేజార్చుకున్నారు. కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు.

ఆరంభంలో ఓపెనర్ల దూకుడు చూస్తే బంగ్లా భారీ స్కోరు చేసేలా కనిపించింది. 20 ఓవర్ల వరకు ఓపెనర్లిద్దరూ వికెట్ పోకుండా జాగ్రత్తగా ఆడి రన్‌రేట్ 6కు తగ్గకుండా పరుగులు రాబట్టి మంచి శుభారంభం అందించారు. అయితే అదే జోరు ఆఖరి వరకు కొనసాగించడంలో చేతులెత్తేశారు. తొలి వికెట్‌కు బంగ్లా స్కోరు 120(20.5ఓవర్లలో). హసన్ ఔటవడంతో తరువాత వచ్చిన బ్యాట్స్‌మెన్ క్రమం తప్పకుండా పెవిలియన్ బాట పట్టారు. భారత బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్‌తో తెలివిగా బంతులేయడంతో.. అనవసర తప్పిదాలతో బంగ్లా మూల్యం చెల్లించుకుంది. లిటన్ పోరాడుతున్నా.. మరో ఎండ్‌లో క్రీజులో నిలబడి అతనికి సహకరిస్తూ భాగస్వామ్యం నెలకొల్పే ప్రయత్నం చేయలేదు.

మరోవైపు వికెట్ల వేటలో ఉన్న రోహిత్ సేన వచ్చిన అన్ని అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకుంది. బంగ్లా తిరిగి పుంజుకునే అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా బౌలింగ్ చేసి స్కోరు వేగానికి కళ్లెం వేసింది. బౌలింగ్, ఫీల్డింగ్‌లో టీమ్‌ఇండియా అత్యుత్తమ ప్రదర్శన చేసింది. మహేంద్రసింగ్ ధోనీ రెండు స్టంపౌట్లు చేసి కీలక ఆటగాళ్లను వెనక్కి పంపాడు. అందులో ఒకటి శతకవీరుడు లిటన్ దాస్‌ది కూడా ఉండటం విశేషం. పరుగులు తీసే క్రమంలో సమన్వయ లోపంతో ఆటగాళ్లు ఎక్కువగా రనౌటయ్యారు. కేదార్ జాదవ్(2) వికెట్ల ఖాతా తెరవగా.. కుల్దీప్ యాదవ్(3) బంగ్లాను భారీ దెబ్బకొట్టారు. బుమ్రా, చాహల్ చెరో వికెట్ తీసి ఫర్వాలేదనిపించారు.

2948
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles