ఐసీసీ చైర్మన్‌గా శశాంక్ మనోహర్ ఎన్నిక

Thu,May 12, 2016 11:50 AM

Shashank Manohar elected unopposed as independent ICC Chairman

హైదరాబాద్ : అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొత్త చైర్మన్ గా శశాంక్ మనోహర్ ఎన్నికయ్యారు. ఐసీసీ వ్యక్తిగత చైర్మన్ గా మనోహర్ ఏకపక్షంగా విజయం సాధించారు. క్రికెట్ భవిష్యత్తును మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు అందరితో కలిసి పనిచేయనున్నట్లు ఆయన తెలిపారు. క్రికెట్‌కు ఘనమై, సంపన్నమైన చరిత్ర ఉందన్నారు. రెండు రోజుల క్రితమే బీసీసీఐ అధ్యక్ష పదవికి శశాంక్ మనోహర్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

ఠాకూర్‌కే బీసీసీఐ పగ్గాలు!
బీసీసీఐ అధ్యక్షునిగా శశాంక్ మనోహర్ తప్పుకోవడంతో ఇప్పుడు ఈ స్థానాన్ని భర్తీ చేసేదెవరన్నదానిపై ఆసక్తి నెలకొన్నది. అయితే, బాస్‌గా దాదాపు అనురాగ్ ఠాకూర్ పేరు ఖరారైనట్లేనన్నది బీసీసీఐ వర్గాల సమాచారం. సుప్రీం కోర్టు నియమిత జస్టిస్ లోధా కమిటీ చేసిన ప్రతిపాదనలను అమలు చేసే విషయంలో ప్రస్తుతం బీసీసీఐ తంటాలు పడుతున్న నేపథ్యంలో అర్ధంతరంగా మనోహర్ తప్పుకున్నాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బోర్డు అత్యున్నత పదవిని చేపట్టే సామర్ధ్యం బోర్డు కార్యదర్శిగా వ్యవహరిస్తున్న అనురాగ్ ఠాకూర్‌కే ఉందన్నది బోర్డు సభ్యుల వాదన. ఠాకూర్ కూడా బీసీసీఐ చీఫ్‌గా ఉండేందుకు అత్యంత ఉత్సాహంతో ఉన్నాడు.

ఈ నేపథ్యంలో బోర్డులో తనకు పూర్తి మద్దతు లభించేలా కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ ద్వారా లాబీ చేయించేందుకు బీజేపీ ఎంపీ కూడా అయిన ఠాకూర్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తున్నది. గతంలో ఢిల్లీ క్రికెట్ సంఘం చీఫ్ బాధ్యతలు నిర్వర్తించిన జైట్లీకి బీసీసీఐ వ్యవహారాలపై పూర్తి పట్టు ఉంది. మరికొన్ని రోజుల్లో జైట్లీతో ఠాకూర్ భేటీ కానున్నాడు. కేంద్ర మంత్రితో అన్ని విషయాలు చర్చించి ఠాకూర్ నిర్ణయాన్ని ప్రకటించనున్నాడు అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఒకవేళ 41ఏండ్ల ఠాకూర్‌కు ఈ పదవి దక్కితే, చిన్నవయసులోనే బీసీసీఐ అధ్యక్షునిగా ఎన్నికైన ఘనత అతనికి దక్కుతుంది. కాగా, ఇలా ఇక ముంబై క్రికెట్ సంఘం చీఫ్ శరద్ పవార్, మహారాష్ట్ర క్రికెట్ సంఘం అధ్యక్షుడు అజయ్ షిర్కేలు కూడా బీసీసీఐ అధ్యక్ష రేసులో ఉన్నారన్న వార్తలు వినిపిస్తున్నా, ఈ ఇద్దరికీ ఆ పదవిపై అంతగా ఆసక్తి లేదట. ఇక బాస్‌గా రేసులో ఉన్న మరో కీలక వ్యక్తి, ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లాకు కార్యదర్శి పదవి దక్కే అవకాశమున్నట్లు సమాచారం.

అయితే, కార్యదర్శి పోస్టుకు భారత మాజీ కెప్టెన్, క్యాబ్ చీఫ్ సౌరవ్ గంగూలీ కూడా ఆసక్తి కనబరుస్తున్నాడన్న పుకార్లు ఉన్నా, అతను ఈ పదవికి అర్హుడు కాకపోవచ్చు. ఎందుకంటే కార్యదర్శిగా ఎన్నికయ్యే వ్యక్తి ఏడాదిలో కనీసం రెండుసార్లు బోర్డు ఏజీఎమ్‌కు హాజరవ్వాల్సి ఉంటుంది. కానీ, గంగూలీ ఇప్పటిదాకా ఒకేఒకసారి ఏజీఎమ్‌లో పాల్గొన్నాడు. దీంతో శుక్లాకే కార్యదర్శి అయ్యే అవకాశాలెక్కువగా ఉన్నాయి. ఏదేమైనా.. మరో వారంరోజుల్లో జరుగనున్న బీసీసీఐ అత్యవసర ఏజీఎమ్ తర్వాత బాస్ ఎవరన్నది తేలిపోనుంది.

3187
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles