ఇదేం టీమ్ సెలక్షన్.. గంగూలీ సీరియస్!

Wed,July 18, 2018 02:55 PM

Saurav Ganguly slams final team selection

లీడ్స్: ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ఓటమి తర్వాత టీమిండియా తుది జట్టు ఎంపికపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశాడు. మూడో వన్డే ముగిసిన తర్వాత బ్రాడ్‌కాస్ట్ చానెల్ లైవ్ షోలో మ్యాచ్‌ను దాదా విశ్లేషించాడు. కేఎల్ రాహుల్‌ను నాలుగోస్థానంలో నిలకడగా ఆడించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పాడు. కచ్చితంగా నాలుగోస్థానంలో రాహులే ఉండాలి. టాప్ 4 ఎప్పుడైనా టీమ్‌లోని బెస్ట్ ప్లేయర్స్ అయి ఉండాలి. రాహుల్ దగ్గరికి వెళ్లి అతనితో మాట్లాడండి. నీకు 15 మ్యాచ్‌లు అవకాశం ఇస్తున్నా. వెళ్లి ఆడు అని చెప్పాలి అని గంగూలీ చెప్పాడు.

గత మూడేళ్లలో టాప్ 3లోని బ్యాట్స్‌మన్ హాఫ్ సెంచరీ చేయలేకపోతే టీమిండియా కనీసం 150 అంతకన్నా ఎక్కువ స్కోర్లను చేజ్ చేయలేకపోయింది. దీనినే దాదా ప్రస్తావించాడు. టాప్ 3పై ఎక్కువగా ఆధారపడటం చాలా పెద్ద సమస్య అని గంగూలీ అన్నాడు. దీనిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలి అని చెప్పాడు. మూడో వన్డేలో నాలుగోస్థానంలో దినేష్ కార్తీక్ బ్యాటింగ్ చేశాడు. అతడు 22 బంతుల్లో 21 పరుగులు చేశాడు. అయితే కార్తీక్‌ను లోయర్‌ఆర్డర్‌లో పంపించాలని దాదా సూచించాడు. ధోనీ, రైనా, కార్తీక్.. 5, 6, 7 స్థానాలకు సరిపోతారు. ఇండియా నంబర్ 4కు ఓ ప్లేయర్‌ను చూడాలి. ఈ విషయంలో ఇద్దరు ప్లేయర్స్‌ను టీమ్ విస్మరిస్తున్నది. కావాలని కాకపోయినా అది పొరపాటు కావచ్చు. రాహుల్ లేదా రహానేను నంబర్ 4లో నిలకడగా ఆడించాలి. లేదంటే రోహిత్, కోహ్లిలపై చాలా ఒత్తిడి పడుతుంది అని గంగూలీ అభిప్రాయపడ్డాడు.

సౌతాఫ్రికాలో ఆరు వన్డేల్లో కోహ్లి మూడు సెంచరీలు చేశాడు కాబట్టి ఇండియా గెలిచిందని, కోహ్లి ఆడకపోతే కష్టమవుతున్నదని అతనన్నాడు. ఇక మూడో వన్డేకు ఉమేష్ యాదవ్‌ను పక్కన పెట్టడాన్ని కూడా దాదా తప్పుబట్టాడు. అటు ఇంగ్లండ్ ఆటతీరును అతను కొనియాడాడు. ఇండియా మరీ చెత్తగా బౌలింగ్ చేసిందని, ఇంగ్లండ్ బౌలర్లు అద్భుతంగా రాణించారని గంగూలీ అన్నాడు. మొత్తంగా ధావన్, రోహిత్, కోహ్లి బాగా ఆడితే టీమంతా అద్భుతంగా కనిపిస్తుంది.. లేదంటే లేదు అన్నట్లుగా పరిస్థితి మారిందని ఈ మాజీ కెప్టెన్ స్పష్టంచేశాడు.

2315
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS