ఎవరూ గుర్తించని సంజు శాంసన్ అరుదైన రికార్డ్!

Mon,April 16, 2018 03:39 PM

Sanju Samson creates a rare record in IPL which went unnoticed

బెంగళూరు: ఆదివారం బెంగళూరు బౌలర్లను చితకబాదుతూ సంజు శాంసన్ ఆడిన సంచలన ఇన్నింగ్స్ ఐపీఎల్ బెస్ట్ ఇన్నింగ్స్‌లో ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మ్యాచ్‌లో అతడు కేవలం 45 బంతుల్లో 92 పరుగులు చేశాడు. కోహ్లి, డివిలియర్స్‌లాంటి దిగ్గజ ఆటగాళ్లు బెంగళూరు టీమ్‌లో ఉన్నా.. వాళ్లను మరిపించే ఇన్నింగ్స్ ఆడాడు శాంసన్. ఈ క్రమంలో అతనో అరుదైన రికార్డు సాధించినా.. దానిని చాలా మంది గుర్తించలేకపోయారు. శాంసన్ ఐపీఎల్‌లో ఓ రికార్డును బద్ధలు కొట్టాడు. ఇన్నాళ్లూ నితీశ్ రాణా పేరు మీదున్న రికార్డును శాంసన్ బీట్ చేశాడు. ఒక్క ఫోర్ కూడా కొట్టకుండా ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు అది. గతంలో ముంబై టీమ్ తరఫున ఆడిన రాణా.. కింగ్స్ పంజాబ్ టీమ్‌పై 34 బంతుల్లో 62 పరుగులు చేశాడు. అందులో ఒక్క ఫోర్ కూడా లేదు. ఇప్పటివరకు ఐపీఎల్ అతనిదే ఈ రికార్డు.

అయితే శాంసన్ దానిని బద్ధలు కొట్టాడు. ఒక్క ఫోర్ కూడా లేకుండా శాంసన్ 65 పరుగులు చేసి రాణాను వెనక్కి నెట్టేశాడు. 65 పరుగుల దగ్గర కూడా మరో సిక్సర్ కొట్టి 71 పరుగులకు చేరుకున్నాడు. ఆ తర్వాతి బంతికే తన ఇన్నింగ్స్‌లో తొలి ఫోర్ కొట్టాడు. మొత్తంగా శాంసన్ ఇన్నింగ్స్‌లో పది సిక్సర్లు, రెండు ఫోర్లు ఉన్నాయి. బెంగళూరు బౌలర్ ఉమేష్ యాదవ్ వేసిన చివరి ఓవర్లోనూ రెండు సిక్సర్లు బాది రాజస్థాన్ స్కోరును 217 పరుగులకు చేర్చాడు. ఐపీఎల్‌లో ఓ ఇన్నింగ్స్‌లో వందలోపు పరుగులు చేసిన వారిలో అత్యధిక సిక్సర్లు బాదిన రెండో బ్యాట్స్‌మన్ శాంసన్. ఈ లిస్ట్‌లో ఆండ్రీ రసెల్ 11 సిక్సర్లతో తొలి స్థానంలో ఉన్నాడు. చెన్నైపై అతను 88 పరుగులు చేశాడు.

3735
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles