డివిలీయర్స్ ధమాకా

Sun,April 22, 2018 01:04 AM

Royal Challengers Bangalore beat Delhi Daredevils by 6 wickets

-39 బంతుల్లో 90 నాటౌట్
-ఢిల్లీపై బెంగళూరు అద్భుత విజయం

బెంగళూరు: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మళ్లీ గెలుపు బాట పట్టింది. సొంతగడ్డ చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను చిత్తుచేస్తూ బెంగళూరు విజయదుందుభి మోగించింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 6 వికెట్ల తేడాతో ఢిల్లీపై ఘనవిజయం సాధించింది. ఢిల్లీ నిర్దేశించిన 175 పరుగుల లక్ష్యాన్ని కోహ్లీసేన 17.6 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. డివిలీయర్స్(39 బంతుల్లో 90 నాటౌట్, 10ఫోర్లు, 5 సిక్స్‌లు) సూపర్ ఇన్నింగ్స్‌తో అలరించాడు. సహచరుల సహకారం కరువైన వేళ.. కండ్లు చెదిరే క్రికెట్ షాట్లతో జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని కట్టబెట్టాడు. తన ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 5 సిక్స్‌లతో చెలరేగిన డివిలీయర్స్..ఢిల్లీ బౌలర్లను ఉతికి ఆరేశాడు. తొలుత పంత్(85), అయ్యర్(52) అర్ధసెంచరీలతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 174/5 స్కోరు చేసింది. అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించిన డివిలీయర్స్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.

బెంగళూరు అలవోకగా: లక్ష్యఛేదనలో బెంగళూరు మొదట్లో తడబడింది. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడిన మనన్ వోహ్రా(2) ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ఔటయ్యాడు. వోహ్రాను అనుసరిస్తూ డికాక్(18) రనౌట్ కావడంతో బెంగళూరు 29 పరుగులకే ఓపెనర్లను కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ కోహ్లీ(30), డివిలీయర్స్(90 నాటౌట్) పసలేని ఢిల్లీ బౌలింగ్‌ను ఉతికి ఆరేశారు. నాలుగు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి కోహ్లీ తప్పించుకున్నాడు. మరోవైపు డివిలీయర్స్ వచ్చి రావడంతోనే ఢిల్లీ బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. బౌండరీతో ఖాతా తెరిచిన డివిలీయర్స్..నదీమ్ వేసిన ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లతో అలరించాడు. తెవాటియా బౌలింగ్‌లో ఏబీ కొట్టిన సిక్సర్ స్టేడియం పై అంచుకు తాకి కింద పడటం మ్యాచ్‌లో హైలెట్‌గా నిలిచింది. సాఫీగా సాగుతున్న క్రమంలో బౌల్ట్ కండ్లు చెదిరే క్యాచ్‌తో కోహ్లీ నిష్క్రమించాడు. ఓవైపు సహచరుడు ఔటైనా వెనుకకు తగ్గని డివిలీయర్స్ తనదైన శైలిలో దూకుడు కొనసాగిస్తూ బౌండరీలతో హోరెత్తించాడు. ఏ ఒక్క బౌలర్‌ను విడిచిపెట్టకుండా ఈ బెంగళూరు విధ్వంసక క్రికెటర్ ఆడిన షాట్లకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. 24 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న డివిలీయర్స్.. అదే జోరును కొనసాగిస్తూ అద్భుతమైన షాట్లతో అలరించి జట్టు గెలుపులో కీలక భూమిక పోషించాడు. బౌల్ట్(1/33), మ్యాక్స్‌వెల్(1/13), హర్షల్ పటేల్(1/33) ఒక్కో వికెట్ తీశారు.

పంత్ ఫటాఫట్: ఆశలు లేని స్థితి నుంచి ఆధిపత్యం వైపు నిలిపాడు ఢిల్లీ డాషింగ్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్. మొదట టాస్ గెలిచిన బెంగళూరు..లక్ష్యఛేదన వైపే మొగ్గుచూపింది. ఉమేశ్ యాదవ్(1/27), చాహల్(2/22) కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆదిలో పరుగుల కోసం ఆపసోపాలు పడ్డ ఢిల్లీ..పంత్(48 బంతుల్లో 85, 6 ఫోర్లు, 7 సిక్స్‌లు), శ్రేయాస్ అయ్యర్(31 బంతుల్లో 52, 4ఫోర్లు, 3సిక్స్‌లు) అర్ధసెంచరీలతో నిర్ణీత 20 ఓవర్లలో 174/5 స్కోరు చేసింది. బెంగళూరు బౌలర్లు పక్కా ప్రణాళికతో బరిలోకి దిగడంతో ఢిల్లీకి పరుగుల రాక కష్టతరమైంది. ఉమేశ్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో కెప్టెన్ గంభీర్(3) తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకొచ్చిన శ్రేయాస్ అయ్యర్ క్రీజులో నిలదొక్కుకోవడానికి సమయం తీసుకున్నాడు. మరోవైపు తన తొలి మ్యాచ్‌లో మినహాయిస్తే అంతగా ఆకట్టుకోని రాయ్..చాహల్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో పవర్‌ప్లే ముగిసేసరికి ఢిల్లీ 2/28 స్కోరు చేసింది. ఈ సీజన్‌లో ఢిల్లీకి ఇదే అత్యల్ప స్కోరు. అయ్యర్‌తో జత కలిసిన పంత్ ఇన్నింగ్స్‌ను గాడిలో పడేశారు. అనవసర షాట్లకు పోకుండా చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ వీరిద్దరు స్కోరుబోర్డుకు కీలక పరుగులు జోడించారు. క్రీజులో కుదురుకున్నాక అయ్యర్ గేర్ మార్చాడు.

సుందర్ బౌలింగ్‌లో వరుస బంతుల్లో రెండు సిక్స్‌లతో అయ్యర్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అదే జోరులో షాట్ ఆడబోయిన అయ్యర్.. సిరాజ్ చేతికి చిక్కడంతో మూడో వికెట్‌కు 75 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. మ్యాక్స్‌వెల్(4) మరోమారు నిరాశపరిచినా..రాహుల్ తెవాటియా(13నాటౌట్)తో కలిసి పంత్ ఇన్నింగ్స్ గతినే మార్చేశాడు. తాను ఎదుర్కొన్న ప్రతి బౌలర్‌ను లక్ష్యంగా చేసుకున్న పంత్ కండ్లు చెదిరే షాట్లతో చిన్నస్వామి స్టేడియాన్ని హోరెత్తించాడు. భారీ షాట్లకు వైవిధ్యాన్ని జోడిస్తూ ఈ ఢిల్లీ డాషర్ కొట్టిన కొట్టుడుకు పరుగులు వెల్లువెత్తాయి. బౌండరీతో అర్ధసెంచరీ మార్క్ అందుకున్న పంత్..మరింత దూకుడు పెంచాడు. మరోవైపు తెవాటియా కూడా బ్యాటు ఝులిపించడంతో ఢిల్లీ స్కోరుబోర్డు ఊపందుకుంది. వోక్స్ వేసిన బౌలింగ్‌లో రెండు ఫోర్లు, భారీ సిక్స్‌తో అలరించిన పంత్..తెవాటియాతో 20 బంతుల్లోనే అర్ధసెంచరీ భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆ మరుసటి ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించిన పంత్..డివిలీయర్స్ క్యాచ్‌తో నిష్క్రమించాడు. ఆఖరి ఐదు ఓవర్లలో తెవాటియాతో కలిసి పంత్ వీరవీహారం చేయడంతో ఢిల్లీకి 71 పరుగులు జతకలిశాయి.

సంక్షిప్త స్కోర్లు: ఢిల్లీ: 20 ఓవర్లలో 174/5(రిషబ్ పంత్ 85, అయ్యర్ 52, చాహల్ 2/22, అండర్సన్ 1/10), బెంగళూరు: 17.6 ఓవర్లలో 176/4(డివిలీయర్స్ 90 నాటౌట్, కోహ్లీ 30, మ్యాక్స్‌వెల్ 1/13, బౌల్ట్ 1/33)

2961
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles