రోహిత్ శ‌త‌కం వృథా.. సిడ్నీ వన్డేలో ఆసీస్ గెలుపు

Sat,January 12, 2019 04:01 PM

Rohit Ton in Vain as Australia Win by 34 Runs

సిడ్నీ: టెస్టు సిరీస్‌ను కోల్పోయిన ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు.. వన్డే సిరీస్‌ను గెలుపుతో ఆరంభించింది. సిడ్నీ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్‌పై ఆసీస్ విజయం సాధించింది. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ(133: 129 బంతుల్లో 10ఫోర్లు, 6సిక్సర్లు) సెంచరీ చేసినా టీమిండియాకు ఓటమి తప్పలేదు. 289 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ లక్ష్య ఛేదనలో 50 ఓవర్లలో 9 వికెట్లకు 254 పరుగులే చేసింది. దీంతో ఆసీస్ 34 పరుగుల తేడాతో గెలుపొందింది. మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో కంగారూలు ఆధిక్యం సాధించారు. ఆసీస్ బౌలర్లలో రిచర్డ్‌సన్(4/26) సంచలన ప్రదర్శన చేశాడు. ఒకే ఓవర్లో విరాట్ కోహ్లీ(3), అంబటి రాయుడుల(0)ను పెవిలియన్ పంపి సత్తాచాటాడు.

ఛేదనను చెత్తగా ఆరంభించిన భారత్‌ను లక్ష్యానికి చేరువగా తీసుకొచ్చింది రోహితే. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న జట్టును రోహిత్‌తో పాటు ధోనీ మాత్రమే ఆదుకున్నారు. బెహ్న్రెడార్ఫ్ వేసిన తొలి ఓవ‌ర్ ఆఖ‌రి బంతికి ధావ‌న్ ఎల్బీగా వెనుదిరిగాడు. నాలుగో ఓవర్ వేసిన రిచర్డ్‌సన్ బౌలింగ్‌లో స్టాయినీస్‌కు క్యాచ్ ఇచ్చి విరాట్ వెనుదిరిగాడు. ఈ దశలో క్రీజలోకి వచ్చిన రాయుడు అదే ఓవర్‌లో ఎదుర్కొన్న రెండో బంతికే ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. స్వల్ప వ్యవధిలోనే.. ఒకే ఓవర్లో రెండు కీల‌క వికెట్లు చేజార్చుకొని ఒత్తిడిలో ప‌డింది. భారత్ చిత్తుచిత్తుగా ఓడిపోకుండా అడ్డుకున్నది మాత్రం రోహిత్, ధోనీనే. రోహిత్‌కు సహకారం అందిస్తూ ధోనీ 93 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు.

బెహ్న్రెడార్ఫ్ బౌలింగ్‌లో వెనుదిరిగిన ధోనీ.. రోహిత్‌తో కలిసి 137 పరుగులు జోడించాడు. జ‌ట్టును పటిష్ఠస్థితిలో నిలిపిన తర్వాత రోహిత్ దూకుడు పెంచాడు. 62 బంతుల్లో హాఫ్‌సెంచరీ పూర్తి చేసిన రోహిత్.. 110 బంతులో సెంచరీ చేశాడు. వన్డే కెరీర్‌లో అత‌నికిది 22వ సెంచరీ. శ‌త‌కం త‌ర్వాత‌ సాధించాల్సిన రన్‌రేట్ ఎక్కువగా ఉండటంతో కొద్దిసేపు మెరుపులు మెరిపించాడు. స్టాయినీస్ వేసిన 44వ ఓవర్లో వరుసగా సిక్స్, ఫోర్ బాది 12 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాతి ఓవర్ మొదటి బంతికే భారీ సిక్సర్ బాదేందుకు ప్రయత్నించిన జడేజా డీప్‌బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో షాన్ మార్ష్ చేతికి చిక్కాడు. స్టాయినీస్ వేసిన ఆ తర్వాతి ఓవర్లోనే రోహిత్ వెనుదిరగడంతో భారత్ ఓటమి ఖాయమైంది. ఆసీస్ బౌలింగ్‌ను అంచనావేయడంలో ఇబ్బందిపడ్డ రాయుడు, దినేశ్ కార్తీక్(12) నిరాశపరిచారు.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 288 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా(59), షాన్ మార్ష్(54), హాండ్స్‌కాంబ్(73) అర్ధశతకాలతో రాణించడంతో ఆసీస్ భారీ స్కోరు చేయగలిగింది. ఆఖర్లో ఆల్‌రౌండర్ స్టాయినీస్(47 నాటౌట్) విజృంభించడంతో అలవోకగా 250 పరుగుల మార్క్ దాటింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్(2/66), కుల్దీప్ యాదవ్(2/54), జడేజా ఒక వికెట్ తీశారు.

4945
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles