
ముంబై: వరల్డ్‌కప్‌కు ముందు ఆస్ట్రేలియాతో తన చివరి వన్డే సిరీస్ ఆడబోతున్నది టీమిండియా. ఈ సిరీస్ కోసం టీమ్‌లో కీలక మార్పులు చేయాలని సెలక్టర్లు భావిస్తున్నారు. కొన్ని ప్రయోగాలకు కూడా సిద్ధమవుతున్నారు. కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వడం, రిజర్వ్ ప్లేయర్స్‌కు అవకాశం ఇవ్వాలన్నది సెలక్టర్ల ఉద్దేశంగా కనిపిస్తున్నది. మే 30న ప్రారంభం కాబోయే వరల్డ్‌కప్ కోసం ఏప్రిల్ 23లోపు టీమ్‌ను ప్రకటించాల్సి ఉంది. దీంతో సెలక్టర్లు ఈ చివరి వన్డే సిరీస్‌ను ప్రయోగాల కోసం ఉపయోగించుకోనున్నారు. ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్ కోసం అత్యుత్తమ టీమ్‌ను బరిలోకి దించే అవకాశాలు కనిపించడం లేదు. న్యూజిలాండ్‌తో జరిగిన చివరి రెండు వన్డేలు, మూడు టీ20లకు కోహ్లికి రెస్ట్ ఇవ్వడంతో కెప్టెన్సీ చేపట్టిన రోహిత్‌శర్మకు కూడా ఆస్ట్రేలియాతో సిరీస్‌లో విశ్రాంతి ఇవ్వాలని సెలక్టర్లు భావిస్తున్నారు. కోహ్లి కూడా పూర్తి ఐదు వన్డేల సిరీస్‌కు ఉంటాడా లేదా అన్నది కూడా అనుమానమే.వీళ్ల స్థానంలో కేఎల్ రాహుల్, అజింక్య రహానేలను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. అటు దినేష్ కార్తీక్, రిషబ్ పంత్‌లకు మరింత మ్యాచ్ ప్రాక్టీస్ ఇవ్వాలని సెలక్టర్లు భావిస్తున్నారు. పేస్ బౌలర్లనూ ఇలాగే రొటేట్ చేయాలన్నది కమిటీ ఆలోచనగా కనిపిస్తున్నది. బుమ్రా, భువనేశ్వర్, షమిలాంటి ఫ్రంట్‌లైన్ బౌలర్లను రొటేట్ చేయనున్నారు. టీమ్ ఎంపికకు సంబంధించి కెప్టెన్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రిలతో సెలక్టర్లు చర్చలు జరుపుతున్నారు. మరోవైపు వరల్డ్‌కప్‌కు ముందు మెగా టోర్నీ ఐపీఎల్ ఉండటం కూడా టీమ్‌ను ఆందోళనకు గురి చేస్తున్నది. అటు ఫ్రాంచైజీలు మాత్రం తమ కీలక ప్లేయర్స్‌కు విశ్రాంతి ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నాయి. దీంతో కీలకమైన ఆటగాళ్లకు ఆస్ట్రేలియా సిరీస్‌లోనే విశ్రాంతి ఇవ్వాలని సెలక్టర్లు చూస్తున్నారు.