300 : గ్రాండ్ స్లామ్ టెన్నిస్ చరిత్రలో ఫెదరర్ మైలురాయి

Sat,January 23, 2016 10:30 AM

Roger Federer Wins 300 Matches In Grand Slams

హైదరాబాద్ : టెన్నిస్‌లో ఎన్నో ఘనతలను అందుకున్న స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ మరో అరుదైన రికార్డును లిఖించాడు. ఇప్పటికే అత్యధిక మేజర్ టైటిళ్లు సాధించిన ఆటగానిగా నీరాజనాలందుకుంటున్న ఈ రాకెట్ రారాజు ఇప్పుడు గ్రాండ్‌స్లామ్ మ్యాచుల్లో ట్రిపుల్ సెంచరీ కొట్టాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో శుక్రవారం జరిగిన మూడోరౌండ్లో బల్గేరియా ఆటగాడు గ్రిగోర్ దిమిత్రోవ్‌ను ఓడించిన ఫెదరర్ కెరీర్‌లో 300వ గ్రాండ్‌స్లామ్ మ్యాచ్ విజయాన్ని నమోదుచేసుకున్నాడు. దీంతో, పురుషుల టెన్నిస్‌లో ఈ ఘనత సాధించిన తొలి ఆటగానిగా రికార్డుకెక్కిన ఫెదరర్.. ఓవరాల్‌గా అత్యధిక గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌లు నెగ్గిన మహిళా దిగ్గజం మార్టినా నవ్రతిలోవా (306) రికార్డుకు కేవలం ఆరు మ్యాచ్‌ల దూరంలో నిలిచాడు.

వయసు పెరుగుతున్నా, వన్నె తరగని ఆటతీరుతో ఆకట్టుకుంటున్న పదిహేడు గ్రాండ్‌స్లామ్‌ల వీరుడు రోజర్ ఫెదరర్ కెరీర్‌లో ఐదో ఆస్ట్రేలియన్ ఓపెన్ సాధించే దిశగా దూసుకెళుతున్నాడు. శుక్రవారం రాడ్‌లేవర్ ఎరీనాలో జరిగిన పురుషుల సింగిల్స్ మూడోరౌండ్లో మూడోసీడ్ ఫెదరర్ 6-4, 3-6, 6-1, 6-4తో బల్గేరియా నంబర్‌వన్ గ్రిగోర్ దిమిత్రోవ్‌ను ఓడించాడు. ఈ క్రమంలో తన గ్రాండ్‌స్లామ్ కెరీర్‌లో 300వ విజయాన్ని సాధించాడు. గతేడాది ఓవరాల్‌గా 1000 మ్యాచ్‌ల విక్టరీ ఫీట్‌ను నమోదుచేసిన ఫెదరర్..ఈ సీజన్ ఆరంభంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌ల విజయాన్ని అందుకోవడం విశేషం. గతేడాది ఇక్కడ ఇటలీ ఆటగాడు ఆండ్రియా సెప్పీ చేతిలో ఓడి మూడోరౌండ్లోనే వెనుదిరిగిన ఫెదరర్, ఈసారి మాత్రం గత పొరపాట్లకు అవకాశమివ్వలేదు. మ్యాచ్‌లో దిమిత్రోవ్ సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్‌చేసిన ఫెదరర్ భారీసర్వీసులు, బలమైన ఫోర్‌హ్యాండ్ షాట్లతో అలరించాడు. ప్రీక్వార్టర్స్‌లో బెల్జియంకు చెందిన 15వ సీడ్ డేవిడ్ గోఫిన్‌తో ఫెదరర్ తలపడనున్నాడు.

2271
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles