ఐసీసీ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్.. పంత్

Tue,January 22, 2019 12:49 PM

దుబాయ్: టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఐసీసీ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును పంత్ గెలుచుకున్నాడు. 2018లో బ్యాట్స్‌మన్‌గా, వికెట్ కీపర్‌గా పంత్ అద్భుతంగా రాణించాడు. గతేడాది జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఈ అవార్డుల కోసం ఓటింగ్ నిర్వహించారు. ఈ కాలంలో పంత్ కొన్ని అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. గతేడాది 8 టెస్టులాడిన పంత్.. 537 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అంతేకాదు గతేడాది అతడు మొత్తం 40 క్యాచ్‌లు అందుకోవడంతోపాటు రెండు స్టంపింగ్స్ చేశాడు. మూడు వన్డేల్లో 41 పరుగులు, 8 టీ20ల్లో 114 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్ గడ్డపై సెంచరీ చేసిన తొలి భారత వికెట్ కీపర్‌గా పంత్ నిలిచాడు. ఇక ఆస్ట్రేలియాతో అడిలైడ్‌లో జరిగిన టెస్ట్‌లో 11 క్యాచ్‌లు అందుకొని ఒక మ్యాచ్‌లో అత్యధిక క్యాచ్‌ల రికార్డును కూడా సృష్టించాడు. ఆస్ట్రేలియాలో టెస్ట్ సెంచరీ చేసిన తొలి భారత వికెట్ కీపర్‌గా కూడా పంత్ నిలిచిన సంగతి తెలిసిందే.


ఇక ఐసీసీ టీ20 పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఆస్ట్రేలియా వన్డే కెప్టెన్ ఆరోన్ ఫించ్‌కు దక్కింది. గతేడాది జులైలో జింబాబ్వేపై 172 పరుగులతో వరల్డ్ రికార్డు సృష్టించిన ఇన్నింగ్స్‌కుగాను అతనికీ అవార్డు దక్కింది. ఆ ఇన్నింగ్స్‌లో ఫించ్ మొత్తం 16 ఫోర్లు, 10 సిక్స్‌లు కొట్టాడు. ఇంగ్లండ్‌పై 156 పరుగులు చేసిన ఫించ్.. తన రికార్డును తానే బద్దలు కొట్టడం విశేషం. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌కు ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు దక్కించుకున్నాడు. ఇక అంపైర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును శ్రీలంకకు చెందిన కుమార ధర్మసేన దక్కించుకున్నాడు. డేవిడ్ షెఫర్డ్ ట్రోఫీని అతడు గెలుచుకోవడం ఇది రెండోసారి. అటు ఇండియా అండర్ 19 వరల్డ్‌కప్ గెలవడాన్ని మూమెంట్ ఆఫ్ ద ఇయర్‌గా అభిమానులు ఎన్నుకున్నారు. ఈ మూమెంట్‌కు 48 శాతం ఓట్లు వచ్చాయి.
1740
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles