చెన్నై..కాస్కో

Sat,May 26, 2018 12:44 AM

-ఫైనల్లో సన్ రైజర్స్ హైదరాబాద్
-రషీద్ ఆల్‌రౌండ్ షో..
-క్వాలిఫయర్-2లో కోల్‌కతాపై గెలుపు

వారెవ్వా.. హైదరాబాద్ మళ్లీ బౌలింగ్‌తో మ్యాజిక్ చేసింది.. లీగ్ దశలో అతి తక్కువ స్కోర్లను కాపాడుకున్న ఘనతను మరోసారి చూపెడుతూ పరుగుల వేటలో పటిష్టమైన కోల్‌కతాకు కళ్లెం వేసింది. రషీద్, షకీబ్ స్పిన్ మాయాజాలం.. స్లాగ్ ఓవర్లలో కౌల్, బ్రాత్‌వైట్‌ల సమిష్టితంత్రం.. వెరసి క్వాలిఫయర్-2లో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న విలియమ్సన్ బృందం.. టైటిల్ పోరు కోసం చెన్నై.. కాస్కో అంటూ సవాలు విసిరింది..! ఎన్నడూ లేని విధంగా రషీద్ బ్యాట్‌తోనూ దుమ్మురేపడంతో భారీ స్కోరు సాధించిన సన్.. దాన్ని కాపాడుకోవడంలోనూ అంతే దీటుగా పోరాడింది..! అటు బౌలింగ్, ఇటు బౌలింగ్‌లో విఫలమైన కోల్‌కతా సొంతగడ్డపై నిరాశజనక ఫలితంతో ఐపీఎల్ నుంచి నిష్క్రమించింది.

కోల్‌కతా: నైట్‌రైడర్స్ లక్ష్యం 20 ఓవర్లలో 175.. ఆరంభంలో నరైన్ (13 బంతుల్లో 26; 4 ఫోర్లు, 1 సిక్స్), క్రిస్ లిన్ (31 బంతుల్లో 48; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) బాది వదలడంతో ఓ దశలో జట్టు స్కోరు 10 ఓవర్లలో 93/2.. రన్‌రేట్ కూడా 9.30. ఇక కేకేఆర్ గెలువాలంటే 60 బంతుల్లో 82 పరుగులు కావాలి.. చేతిలో 8 వికెట్లున్నాయి. కాబట్టి మ్యాచ్ దాదాపుగా కోల్‌కతా చేతిలోనే ఉంది. కానీ.. అప్పుడే తొలి ఓవర్ వేసేందుకు రషీద్ (3/19) బౌలింగ్‌కు వచ్చాడు.. తొలి బంతికే ఉతప్ప (2) ఔట్.. తర్వాతి ఓవర్‌లో కార్తీక్ (8).. ఆ వెంటనే క్రిస్‌లిన్.. జస్ట్ 14 బంతుల వ్యవధి.. 15 పరుగుల తేడాతో మూడు కీలక వికెట్లు.. ఇక క్రీజులో మిగిలిన ఏకైక హిట్టర్ రస్సెల్ (3).. విలియమ్సన్ వ్యూహం మార్చాడు.. షార్ట్ లెగ్‌లో ఫీల్డర్‌ను పెట్టి వల పన్నాడు.. రషీద్ వేసిన గూగ్లీని బలంగా బాదే క్రమంలో రస్సెల్ బ్యాట్ ఎడ్జ్‌ను తాకిన బంతి స్లిప్‌లో ధవన్ చేతిలోకి వెళ్లింది... అంతే మ్యాచ్ హైదరాబాద్ వైపు మొగ్గింది. చివర్లో గిల్ (20 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్స్), చావ్లా (12), మావి (6) పోరాటం చేసినా పరుగుల వేటలో కార్తీక్‌సేన వెనుకబడిపోయింది. దీంతో వచ్చిన రెండో అవకాశాన్ని రెండు చేతులతో ఒడిసిపట్టుకున్న హైదరాబాద్.. శుక్రవారం జరిగిన క్వాలిఫయర్-2లో 14 పరుగుల తేడాతో కోల్‌కతాపై గెలిచి.. ఫైనల్లోకి దూసుకెళ్లింది. లక్ష్య ఛేదనలో సన్ బౌలర్లపై విరుచుకుపడ్డ నరైన్ వేగంగా పరుగులు సాధించి ఔటైనా.. క్రిస్ లిన్ యాంకర్ పాత్రతో అదురగొట్టాడు. కొత్త కుర్రాడు అహ్మద్, భువీ లైన్ మిస్ కావడంతో ఈ ఇద్దరు కలిసి రెండు ఓవర్లలో 4, 6, 4, 6, 4, 4తో 32 పరుగులు రాబట్టారు. కానీ నాలుగో ఓవర్‌లో నరైన్ ఔట్‌కావడంతో తొలి వికెట్‌కు 40 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. లిన్ కుదురుగా ఆడినా.. రానా (16 బంతుల్లో 22; 1 ఫోరు, 2 సిక్సర్లు) రెండు సిక్సర్లు బాది వెనుదిరిగాడు. రెండో వికెట్‌కు 47 పరుగులు నమోదయ్యాయి. పవర్‌ప్లేలో 11 రన్‌రేట్‌తో 67 పరుగులు చేసిన కేకేఆర్ 10 ఓవర్లలో 93 పరుగులకు చేరింది. బ్రాత్‌వైట్, కౌల్ చెరో 2 వికెట్లు తీశారు. రషీద్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఆదివారం జరిగే ఫైనల్లో హైదరాబాద్.. చెన్నై సూపర్‌కింగ్స్‌తో తలపడుతుంది.


మోస్తరు ఆరంభం

టాస్ ఓడిన హైదరాబాద్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 174 పరుగులు చేసింది. సాహా (27 బంతుల్లో 35; 5 ఫోర్లు), ధవన్ (24 బంతుల్లో 34; 4 ఫోర్లు, 1 సిక్స్), రషీద్ ఖాన్ (10 బంతుల్లో 34; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) దంచికొట్టారు. కృష్ణ బంతిని లాంగాన్‌లో భారీ సిక్సర్‌గా మలిచిన శిఖర్.. మూడో ఓవర్‌లో మరో రెండు ఫోర్లు బాదగా, తర్వాతి ఓవర్‌లో సాహా కూడా తనవంతుగా రెండు ఫోర్లు కొట్టాడు. దీంతో పవర్‌ప్లేలో సన్ 45 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో ఈడెన్‌లో చేసిన అతి తక్కువ పవర్‌ప్లే స్కోరు ఇది. నిలకడగా సాగుతున్న హైదరాబాద్‌కు 8వ ఓవర్‌లో కుల్దీప్ (2/29) డబుల్ ఝలక్ ఇచ్చాడు. జస్ట్ ఐదు బంతుల తేడాలో ధవన్, విలియమ్సన్ (3)ను ఔట్ చేసి షాకిచ్చాడు. ధవన్‌తో తొలి వికెట్‌కు 56 పరుగులు జోడించిన సాహా.. షకీబ్ (24 బంతుల్లో 28; 4 ఫోర్లు)తో కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించే బాధ్యతను తీసుకున్నాడు. కుల్దీప్ వేసిన 10 ఓవర్‌లో రెండు ఫోర్లు కొట్టి స్కోరును 79/2కు చేర్చాడు. రన్‌రేట్ 7.9 మాత్రమే. ఈ దశలో బౌలింగ్‌కు వచ్చిన చావ్లా.. ఓ గూగ్లీతో సాహాను బోల్తా కొట్టించాడు. మూడో వికెట్‌కు 2.4 ఓవర్లలో 24 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. దీపక్ హుడా (19 బంతుల్లో 19; 1 సిక్స్), షకీబ్ సింగిల్స్‌కు పరిమితంకావడంతో 15 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ 113/3కు చేరింది.

SRH1

రషీద్ తడాఖా..

చివరి ఓవర్లలో కోల్‌కతా బౌలింగ్‌కు రషీద్ ఖాన్ బ్యాట్‌కు మధ్య హోరాహోరీ సమరం సాగింది. 16వ ఓవర్ తొలి బంతికి షకీబ్ అనూహ్యంగా రనౌట్‌కాగా, తర్వాతి ఓవర్ (17వ)లో హుడా కూడా వెనుదిరిగాడు. ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు 29 పరుగులు జత చేశారు. బ్రాత్‌వైట్ (8) వచ్చి రావడంతోనే లాంగాన్‌లో భారీ సిక్స్ కొట్టినా.. 17.5వ ఓవర్‌లో వికెట్ సమర్పించుకున్నాడు. క్రీజులోకి వచ్చిన రషీద్ తొలి బంతినే బౌండరీ లైన్ దాటించాడు. కానీ 19వ ఓవర్‌లో మావి తొలి బంతికే యూసుఫ్ వికెట్ తీసి కోల్‌కతాకు ఆనందాన్నిచ్చాడు. అప్పటికి హైదరాబాద్ స్కోరు 138/6. ఈ ఓవర్‌లో డీప్ పాయింట్, డీప్ కవర్స్‌లో రెండు సిక్సర్లు కొట్టిన రషీద్.. కృష్ణ వేసిన చివరి ఓవర్‌లో రెండు ఫోర్లు, మరో రెండు సిక్సర్లు బాదేశాడు. ఎనిమిదో వికెట్‌కు భువనేశ్వర్ (5 నాటౌట్)తో కలిసి అజేయంగా 11 బంతుల్లో 36 పరుగులు జోడించి హైదరాబాద్‌కు భారీ స్కోరు అందించాడు.


స్కోరు బోర్డు

సన్‌రైజర్స్ హైదరాబాద్: సాహా (స్టంప్) కార్తీక్ (బి) చావ్లా 35, ధవన్ ఎల్బీ (బి) కుల్దీప్ 34, విలియమ్సన్ (సి) కార్తీక్ (బి) కుల్దీప్ 3, షకీబ్ రనౌట్ 28, హుడా (సి) చావ్లా (బి) నరైన్ 19, యూసుఫ్ (సి) చావ్లా (బి) మావి 3, బ్రాత్‌వైట్ రనౌట్ 8, రషీద్ నాటౌట్ 34, భువనేశ్వర్ నాటౌట్ 5, ఎక్స్‌ట్రాలు: 5, మొత్తం: 20 ఓవర్లలో 174/7. వికెట్లపతనం: 1-56, 2-60, 3-84, 4-113, 5-124, 6-134, 7-138. బౌలింగ్: శివమ్ మావి 4-0-33-1, ప్రసిద్ధ్ కృష్ణ 4-0-56-0, రస్సెల్ 1-0-9-0, నరైన్ 4-0-24-1, చావ్లా 3-0-22-1, కుల్దీప్ 4-0-29-2.


కోల్‌కతా నైట్‌రైడర్స్: క్రిస్‌లిన్ ఎల్బీ (బి) రషీద్ 48, నరైన్ (సి) బ్రాత్‌వైట్ (బి) కౌల్ 26, రానా రనౌట్ 22, ఉతప్ప (బి) రషీద్ 2, కార్తీక్ (బి) షకీబ్ 8, గిల్ (సి) రషీద్ (బి) బ్రాత్‌వైట్ 30, రస్సెల్ (సి) ధవన్ (బి) రషీద్ 3, చావ్లా (బి) కౌల్ 12, మావి (సి) రషీద్ (బి) బ్రాత్‌వైట్ 6, కుల్దీప్ నాటౌట్ 0, కృష్ణ నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు: 3, మొత్తం: 20 ఓవర్లలో 160/9. వికెట్లపతనం: 1-40, 2-87, 3-93, 4-108, 5-108, 6-118, 7-145, 8-160, 9-160. బౌలింగ్: భువనేశ్వర్ 4-0-38-0, అహ్మద్ 3-0-38-0, కౌల్ 4-0-32-2, రషీద్ 4-0-19-3, బ్రాత్‌వైట్ 2-0-15-2, షకీబ్ 3-0-16-1.

3655
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles