రషీద్ విధ్వంసం..కోల్‌కతా లక్ష్యం 175

Fri,May 25, 2018 09:00 PM

కోల్‌కతా: ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న క్వాలిఫయర్-2 పోరులో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ తడబడింది. కోల్‌కతా స్పిన్నర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సన్‌రైజర్స్ భారీ భాగస్వామ్యాలు నెలకొల్పే అవకాశాన్ని చేజార్చుకుంది. స్పిన్ సంచలనం కుల్దీప్ యాదవ్(2/29) విజృంభించడంతో సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 174 పరుగులు చేసింది. ఆరంభంలో వృద్ధిమాన్ సాహా( 35: 27 బంతుల్లో 5ఫోర్లు), శిఖర్ ధావన్(34: 24 బంతుల్లో 4ఫోర్లు, సిక్స్).. ఆఖర్లో బౌలర్ రషీద్ ఖాన్(34 నాటౌట్: 10 బంతుల్లో 2ఫోర్లు, 4సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి ఆకట్టుకున్నాడు. చప్పగా సాగుతున్న ఇన్నింగ్స్‌కి ఒక్కసారిగా ఊపు తీసుకొచ్చి అందరి అభినందనలు అందుకున్నాడు.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు ఆరంభంలో మంచి శుభారంభం లభించింది. తొలి ఓవర్ నుంచే ఓపెనర్లు శిఖర్ ధావన్, వృద్ధిమాన్ సాహా దూకుడుగా ఆడారు. వీలుచిక్కినప్పుడల్లా చెత్త బంతులను బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డు పరుగులెత్తించారు. పవర్‌ప్లే ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 45/0. నిలకడగా ఆడుతున్న సన్‌రైజర్స్‌ను కుల్దీప్ మాయ చేశాడు. 8వ ఓవర్ తొలి బంతికి ఓపెనర్ శిఖర్ ను ఎల్బీగా పెవిలియన్ పంపిన కుల్దీప్.. అదే ఓవర్ ఐదో బంతికి సూపర్ ఫామ్‌లో ఉన్న కేన్ విలియమ్సన్(3)ను ఔట్ చేసి భారీ దెబ్బకొట్టాడు. దీంతో సన్‌రైజర్స్‌పై ఒత్తిడి పెరిగింది. 9 ఓవర్లకు స్కోరు 69/2. కీలక మ్యాచ్‌లో ప్రధాన ఆటగాళ్లు చెత్తషాట్లు ఆడి తక్కువ స్కోరుకే పరిమితమయ్యారు.


10 ఓవర్ల నుంచి సన్‌రైజర్స్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఆరంభం నుంచి ధాటిగా ఆడుతున్న సాహా కీపర్ దినేశ్ కార్తీక్ చేతిలో స్టంపౌటయ్యాడు. మరోవైపు స్పిన్నర్లను ఎదుర్కొని అడపాదడపా బౌండరీలు బాదుతున్న షకిబ్ రనౌట్‌గా వెనుదిరగడంతో స్కోరు వేగం తగ్గింది. ఆ తరువాత దీపక్ హుడా(19), యూసుఫ్ పఠాన్(3), కార్లోస్ బ్రాత్‌వైట్(8) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరినా.. ఆఖర్లో రషీద్ ఖాన్ మెరుపులు మెరిపించడంతో సన్‌రైజర్స్ 170 పరుగుల మార్క్ దాటింది.

5177
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles