రాజస్థాన్ చేతిలో హైదరాబాద్ ఓటమి

Sun,April 28, 2019 02:44 AM


-రైజర్స్.. అయ్యో!
-మనీశ్ పాండే పోరాటం వృథా
ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే నాలుగింట మూడు మ్యాచ్‌లు నెగ్గాల్సిన కీలక దశలో సన్‌రైజర్స్ హైదరాబాద్ నిరాశ పరిచింది. మిగిలిన ప్రత్యర్థులతో పోలిస్తే ఒకింత బలహీనంగా కనిపిస్తున్న రాజస్థాన్ రాయల్స్ చేతిలో పరాజయం పాలై నాకౌట్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇక ముందడుగు వేయాలంటే మిగిలిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గాల్సిన పరిస్థితి కొనితెచ్చుకుంది.

జైపూర్: ఉప్పల్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై సన్‌రైజర్స్ విజయం సాధిస్తే.. ఆ ఓటమికి రాయల్స్ సొంతగడ్డపై బదులు తీర్చుకుంది. శనివారం ఇక్కడి సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 160 పరుగులు చేసింది. మనీశ్ పాండే (36 బంతుల్లో 61; 9 ఫోర్లు) వరుసగా రెండో అర్ధసెంచరీతో ఆకట్టుకుంటే.. వార్నర్ (32 బంతుల్లో 37) ఫర్వాలేదనిపించాడు. రాయల్స్ బౌలర్లలో ఉనాద్కట్, థామస్, గోపాల్, అరోన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. వార్నర్ వరుసగా ఆడిన మూడో ఐపీఎల్ సీజన్‌లోనూ 600 పరుగులు పూర్తి చేయడం విశేషం. అనంతరం లక్ష్య ఛేదనలో ఓపెనర్లు లివింగ్‌స్టోన్ (26 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), రహానే (34 బంతుల్లో 39; 4 ఫోర్లు, 1 సిక్స్)తో పాటు సంజూ శాంసన్ (32 బంతుల్లో 48 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) అదరగొట్టడంతో రాయల్స్ 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. ఉనాద్కట్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

ఓపెనింగ్ అదుర్స్

లక్ష్య ఛేదనలో రాయల్స్ ఇన్నింగ్స్ మెరుపులతో మొదలైంది. భువనేశ్వర్ బౌలింగ్‌లో రహానే 3 ఫోర్లు కొడితే.. సిద్ధార్థ్ కౌల్‌ను లివింగ్‌స్టోన్ బెంబేలెత్తించాడు. కౌల్ వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లో 4,6,4,6తో 20 పరుగులు పిండుకున్నాడు. ఫలితంగా పవర్‌ప్లే ముగిసేసరికి రాజస్థాన్ వికెట్ నష్టపోకుండా 60 పరుగులు చేసింది. మిస్టరీ స్పిన్నర్ రషీద్‌ఖాన్‌ను కూడా ఈ జోడీ వదిలిపెట్టలేదు. అఫ్ఘాన్ స్పిన్నర్ బౌలింగ్‌లో రహానే సిక్సర్ బాదితే.. లివింగ్‌స్టోన్ 6,4 కొట్టాడు. తొలి వికెట్‌కు 78 పరుగులు జోడించాక ఎట్టకేలకు రషీద్.. లివింగ్‌స్టోన్‌ను ఔట్ చేసి రైజర్స్‌కు కాస్త ఉపశమనం కల్పించాడు. కాసేపటికే రహానే కూడా వెనుదిరిగినా.. కెప్టెన్ స్మిత్ (22)తో కలిసి శాంసన్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. విజయానికి 13 పరుగులు కావాల్సిన దశలో స్మిత్ ఔటైనా.. టర్నర్ (3 నాటౌట్)తో కలిసి సంజూ మిగతా పని పూర్తి చేశాడు.

పాండే ఔటయ్యాక పేకమేడలా..

సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌ను రెండు రకాలుగా చెప్పుకోవాలి. పాండే ఔట్ కాక ముందు.. ఆ తర్వాత అని. చెన్నై సూపర్‌కింగ్స్‌పై చక్కటి ఇన్నింగ్స్‌తో ఫామ్‌లోకి వచ్చిన పాండే ఈ మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగించాడు. దూకుడుకు మారుపేరైన డేవిడ్ వార్నర్ తన శైలికి భిన్నంగా నెమ్మదిగా ఆడుతుంటే.. పాండే మాత్రం చక్కటి క్రికెటింగ్ షాట్లతో అలరించాడు. భారీ షాట్లకు పోకుండా టైమింగ్‌పైనే దృష్టిపెట్టిన అతడు ఫీల్డర్ల మధ్య నుంచి కొలతేసి కొట్టినట్లు బౌండ్రీలు రాబట్టాడు. ఆరంభంలోనే కెప్టెన్ విలియమ్సన్ (13) వికెట్ కోల్పోయినా.. వీరిద్దరూ ఆ లోటు కనిపించకుండా చెలరేగారు. రాజస్థాన్ ఫీల్డింగ్ పేలవంగా సాగడం కూడా వీరికి కలిసొచ్చింది. గోపాల్ బౌలింగ్‌లో రెండు ఫోర్లు కొట్టిన మనీశ్.. పరాగ్‌కు అదే శిక్ష వేసి 27 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో 12 ఓవర్లు ముగిసేసరికి రైజర్స్ 103/1తో నిలిచింది. చేతిలో 9 వికెట్లు ఉండటంతో భారీ స్కోరు ఖాయమే అనిపించినా.. మరుసటి బంతికే స్మిత్ పట్టిన సూపర్ క్యాచ్‌కు వార్నర్ వెనుదిరిగాడు.

దీంతో రెండో వికెట్‌కు 75 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. డేవిడ్ ఇన్నింగ్స్‌లో ఒక్క ఫోర్ కూడా లేకపోవడం గమనార్హం. కాసేపటికే పాండే కూడా ఔటవడంతో రైజర్స్ ఇన్నింగ్స్ స్వరూపమే మారిపోయింది. విజయ్ శంకర్ (8) పెద్దగా ప్రభావం చూపలేకపోగా.. పఠాన్‌ను పక్కన పెట్టి అవకాశమిచ్చిన హుడా (0) ఎదుర్కొన్న తొలి బంతికే ఔటై నిరాశపరిచాడు. సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడిన సాహా (5) విఫలంకాగా.. ఆదుకుంటాడనుకున్న షకీబ్ (9) చేతులెత్తేశాడు. భువనేశ్వర్ (1) ఇలా వచ్చి అలా వెళ్లాడు. ఆరుగురు బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. 44 పరుగుల వ్యవధిలో ఏడు వికెట్లు కోల్పోయిన రైజర్స్.. చివరి రెండు బంతులకు రషీద్ ఖాన్ (17 నాటౌట్) 4,6 కొట్టడంతో గౌరవప్రద స్కోరు చేయగలిగింది.

స్కోరు బోర్డు

సన్‌రైజర్స్ హైదరాబాద్: వార్నర్ (సి) స్మిత్ (బి) థామస్ 37, విలియమ్సన్ (బి) గోపాల్ 13, పాండే (స్టంప్డ్) శాంసన్ (బి) గోపాల్ 61, శంకర్ (సి) ఉనాద్కట్ (బి) అరోన్ 8, షకీబ్ (సి) గోపాల్ (బి) ఉనాద్కట్ 9, హుడా (సి అండ్ బి) ఉనాద్కట్ 0, సాహా (సి) శాంసన్ (బి) థామస్ 5, రషీద్ (నాటౌట్) 17, భువనేశ్వర్ (సి) ఉనాద్కట్ (బి) అరోన్ 1, కౌల్ (నాటౌట్) 0, ఎక్స్‌ట్రాలు: 9, మొత్తం: 20 ఓవర్లలో 160/8. వికెట్ల పతనం: 1-28, 2-103, 3-121, 4-125, 5-127, 6-137, 7-137, 8-147, బౌలింగ్: అరోన్ 4-0-36-2, థామస్ 4-0-28-2, గోపాల్ 4-0-30-2, ఉనాద్కట్ 4-0-26-2, పరాగ్ 3-0-24-0, బిన్నీ 1-0-10-0.

రాజస్థాన్ రాయల్స్: రహానే (సి) వార్నర్ (బి) షకీబ్ 39, లివింగ్ స్టోన్ (సి) సాహా (బి) రషీద్ 44, శాంసన్ (నాటౌట్) 48, స్మిత్ (సి) కౌల్ (బి) ఖలీల్ 22, టర్నర్ (నాటౌట్) 3, ఎక్స్‌ట్రాలు: 5 మొత్తం: 19.1 ఓవర్లలో 161/3. వికెట్ల పతనం: 1-78, 2-93, 3-148, బౌలింగ్: భువనేశ్వర్ 4-0-22-0, షకీబ్ 3.1-0-26-1, రషీద్ 4-0-30-1, ఖలీల్ 4-0-33-1, కౌల్ 4-0-48-0.

ipl-table

ipl-runs-wickets

3407
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles