బట్లర్ మోత

Wed,May 9, 2018 01:04 AM

Rajasthan Royals beat Kings XI Punjab by 15 runs

పంజాబ్‌పై రాజస్థాన్ గెలుపు రాహుల్ ఒంటరి పోరాటం వృథా
ఐపీఎల్‌లో మ్యాచ్‌లు ముగుస్తున్నకొద్ది ప్లే ఆఫ్ రేసు మరింత రసవత్తరంగా మారుతున్నది. లీగ్ ఆరంభం నుంచి వరుస పరాజయాలతో చతికిలపడ్డ రాజస్థాన్ రాయల్స్ చివర్లో పుంజుకుంది. బట్లర్ పరుగుల మోతకు తోడు బౌలర్ల సమయోచిత ప్రదర్శనతో తమకంటే మెరుగైన ప్రత్యర్థి పంజాబ్‌ను కట్టడి చేసింది. దీంతో ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకుని మిగతా సమీకరణాలపై ప్రభావం చూపెట్టింది. మరోవైపు బ్యాటింగ్ వైఫల్యంతో ఇబ్బందిపడ్డ పంజాబ్.. ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించలేక నాకౌట్ బెర్త్ కోసం మరికొంత కాలం వేచి చూడాల్సిన పరిస్థితిని కొని తెచ్చుకున్నది.

జైపూర్: ఓవైపు బట్లర్ (58 బంతుల్లో 82; 9 ఫోర్లు, 1 సిక్స్), మరోవైపు పంజాబ్ ఆటగాడు కేఎల్ రాహుల్ (70 బంతుల్లో 95 నాటౌట్; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగుల మోత మోగించిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఆరంభం నుంచే పక్కా ప్రణాళికలతో ఆడిన రహానే బృందం బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ అదురగొట్టింది. దీంతో మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో పంజాబ్‌ను ఓడించింది. టాస్ గెలిచి రాజస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 158 పరుగులు చేసింది. తర్వాత పంజాబ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 143 పరుగులకే పరిమితమైంది. రాహుల్ స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్ ఆడినా మిగతా సహచరులలో ఒక్కరు కూడా సహకారం అందించలేకపోయారు. ఇన్నింగ్స్ మొత్తంలో 7 మంది సింగిల్ డిజిట్‌కే పరిమితంకావడంతో కింగ్స్‌కు మూల్యం తప్పలేదు. బట్లర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

బట్లర్ మోత.: రాజస్థాన్ ఓపెనర్లలో రహానే (9) విఫలమైనా.. బట్లర్ ఓ ఎండ్‌లో స్థిరంగా ఆడాడు. వరుస బౌండరీలతో ఆరంభం నుంచే దూకుడుగా ఆడటంతో రన్‌రేట్ 10 పరుగులకు పైగా నమోదైంది. నాలుగో ఓవర్‌లో రహానేను టై ఔట్ చేయడంతో తొలి వికెట్‌కు 37 పరుగులు నమోదయ్యాయి. వన్‌డౌన్‌లో గౌతమ్ (8) ఫర్వాలేదనిపించినా ఎక్కువసేపు క్రీజులో నిలువడలేకపోయాడు. పవర్‌ప్లేలో రాజస్థాన్ వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది. ఏడో ఓవర్‌లో గౌతమ్ ఔట్‌కావడంతో శామ్సన్ (18 బంతుల్లో 22; 1 ఫోర్, 1 సిక్స్) క్రీజులోకి వచ్చాడు. బట్లర్ యధావిధిగా మోత మోగించగా, శామ్సన్ సింగిల్స్‌తో అతనికి చక్కని సహకారం అందించాడు. స్టోయినిస్ (1/15), అశ్విన్, ముజీబ్ (2/21) పరుగులు నిరోధించే ప్రయత్నం చేసినా.. బట్లర్ 27 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు.

ఈ క్రమంలో 10 ఓవర్లలో ఆర్‌ఆర్ స్కోరు 82/2కు చేరింది. 13వ ఓవర్‌లో శామ్సన్ ఓ సిక్స్, ఫోర్ బాది తర్వాతి ఓవర్‌లోనే వెనుదిరిగాడు. దీంతో మూడో వికెట్‌కు 53 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. కానీ 11 బంతుల తర్వాత బట్లర్ కూడా వెనుదిరగడంతో రాజస్థాన్ ఇన్నింగ్స్ కుదుపునకు లోనైంది. స్లాగ్ ఓవర్లలో లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేసిన రాజస్థాన్ పరుగులు నిరోధించడంతో పాటు బిన్నీ (11)లాంటి హిట్టర్‌ను కట్టడి చేసింది. ఆఖరి ఓవర్‌లో టై (4/34) మూడు బంతుల తేడాలో స్టోక్స్ (14), ఆర్చర్ (0)ను ఔట్ చేశాడు. దీంతో చివరి మూడు ఓవర్లలో 25 పరుగులే వచ్చాయి. ఓవరాల్‌గా చివరి 10 ఓవర్లలో 76 పరుగులే చేయడంతో రాజస్థాన్ స్కోరు 200 ధాటలేకపోయింది.

kl-rahul
రాహుల్ మినహా: లక్ష్యం చిన్నదే అయినా.. పంజాబ్ ఇన్నింగ్స్‌కు ఆరంభంలో ఎదురుదెబ్బ తగిలింది. మూడో ఓవర్ తొలి రెండు బంతులకు డేంజర్ మ్యాన్ గేల్ (1), అశ్విన్ (0)ను ఔట్ చేసి గౌతమ్ (2/12) షాకిచ్చాడు. ఇక నాలుగు ఓవర్‌లో కరణ్ నాయర్ (3)ను ఆర్చర్ వెనక్కి పంపాడు. కేవలం 10 బంతుల వ్యవధిలో 5 పరుగుల తేడాలో మూడు వికెట్లు పడటంతో పంజాబ్ రన్‌రేట్ దారుణంగా పడిపోయింది. సహచరుల వైఫల్యాన్ని చూసిన రాహుల్, నాథ్ (9)తో కలిసి ఆచితూచి ఆడి పవర్‌ప్లేలో పంజాబ్ స్కోరును 33/3కి చేర్చాడు. ఫీల్డింగ్ విస్తరించిన తర్వాత స్పిన్నర్ సోధీ (1/14) చేతికి బంతినిచ్చిన రహానే పరుగులు బాగా నిరోధించాడు. 6 నుంచి 10 ఓవర్లలో మధ్య 30 పరుగులే చేయడంతో పాటు నాథ్ వికెట్‌ను కోల్పోయిన పంజాబ్ సగం ఆట పూర్తయ్యేసరికి 4 వికెట్లకు 45 పరుగులు చేసింది. అడపాదడపా రాహుల్ ఫోర్లు బాదినా.. మిడిలార్డర్‌లో వచ్చిన ఏ ఒక్కరూ నిలువలేకపోయారు. అంచనాలు పెట్టుకున్న మనోజ్ తివారీ (7) మరోసారి నిరాశపర్చగా, 14వ ఓవర్‌లో బిన్నీ విసిరిన త్రోకు అక్షర్ పటేల్ (9) అనూహ్యంగా రనౌటయ్యాడు.

ఒంటరిగా పోరాడిన రాహుల్ 48 బంతుల్లో ఫీఫ్టీ మార్క్‌ను అందుకున్నాడు. ఈ సీజన్‌లో అతనికి ఇది నాలుగో అర్ధసెంచరీ. రాహుల్‌తో జతకలిసిన స్టోయినిస్ (11) నెమ్మదిగా ఆడటంతో 15 ఓవర్లలో పంజాబ్ 92/6 స్కోరు చేసింది. భారీ షాట్లు కొట్టే అవకాశం ఇవ్వకుండా రాజస్థాన్ బౌలర్లందరూ మంచి సమన్వయంతో బౌలింగ్ చేయడంతో ఓవర్‌కు 6 పరుగులే వచ్చాయి. ఇక 24 బంతుల్లో 61 పరుగులు చేయాల్సిన దశలో ఆర్చర్ 17వ ఓవర్‌లో 4 పరుగులే ఇచ్చాడు. ఉనాద్కట్ వేసిన 18వ ఓవర్‌లో 9 పరుగులు ఇచ్చాడు. దీంతో చివరి 12 బంతుల్లో పంజాబ్ విజయానికి 48 పరుగులు అవసరమయ్యాయి. ఆర్చర్ బౌలింగ్‌లో వరుసగా మూడు ఫోర్లతో 16 పరుగులు పిండుకున్నాడు. ఆఖరి ఆరు బంతుల్లో 32 పరుగులకుగానూ ఉనాద్కట్ బంతిని గాల్లోకి లేపి స్టోయినిస్ వెనుదిరిగాడు. దీంతో ఏడో వికెట్‌కు 46 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాతి ఐదు బంతుల్లో రాహుల్.. ఓ సిక్స్, రెండు ఫోర్లు బాదినా ప్రయోజనం లేకపోయింది.

స్కోరు బోర్డు

రాజస్థాన్ రాయల్స్: రహానే (సి) నాథ్ (బి) టై 9, బట్లర్ (స్టంప్) రాహుల్ (బి) ముజీబ్ 82, గౌతమ్ (సి) తివారీ (బి) స్టోయినిస్ 8, శామ్సన్ (సి) తివారీ (బి) ముజీబ్ 22, స్టోక్స్ (సి) అశ్విన్ (బి) టై 14, బిన్నీ రనౌట్ 11, లోమ్రోర్ నాటౌట్ 9, ఆర్చర్ (సి) తివారీ (బి) టై 0, ఉనాద్కట్ (సి) నాయర్ (బి) టై 0, ఎక్స్‌ట్రాలు: 3, మొత్తం: 20 ఓవర్లలో 158/8. వికెట్లపతనం; 1-37, 2-64, 3-117, 4-132, 5-147, 6-152, 7-153, 8-158. బౌలింగ్: స్టోయినిస్ 2-0-15-1, అక్షర్ 3-0-24-0, శర్మ 3-0-29-0, టై 4-0-34-4, అశ్విన్ 4-0-34-0, ముజీబ్ 4-0-21-2.

కింగ్స్ లెవన్ పంజాబ్: రాహుల్ నాటౌట్ 95, గేల్ (స్టంప్) బట్లర్ (బి) గౌతమ్ 1, అశ్విన్ (బి) గౌతమ్ 0, కరణ్ నాయర్ (సి) ఉనాద్కట్ (బి) ఆర్చర్ 3, నాథ్ (సి) గౌతమ్ (బి) సోధీ 9, తివారీ (సి) రహానే (బి) స్టోక్స్ 7, అక్షర్ పటేల్ రనౌట్ 9, స్టోయినిస్ (సి) గౌతమ్ (బి) ఉనాద్కట్ 11, టై నాటౌట్ 1, ఎక్స్‌ట్రాలు: 7, మొత్తం: 20 ఓవర్లలో 143/7. వికెట్లపతనం: 1-14, 2-14, 3-19, 4-45, 5-66, 6-81, 7-127.బౌలింగ్: గౌతమ్ 3-0-12-2, ఆర్చర్ 4-0-32-1, ఉనాద్కట్ 4-0-36-1, స్టోక్స్ 2-0-13-1, సోధీ 4-0-14-1, లోమ్రోర్ 2-0-19-0, అనురీత్ సింగ్1-0-12-0.
ipl-table

2363
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles