చేజేతులా ఓడిన హైదరాబాద్

Mon,April 15, 2019 03:09 AM

-22 బంతుల్లో 8 వికెట్లు తీసిన అయ్యర్ సేన
-ఢిల్లీ.. బౌలింగ్ షో

15 ఓవర్లలో హైదరాబాద్ స్కోరు 100/2. గెలువాలంటే 30 బంతుల్లో 56 పరుగులు చేయాలి. వార్నర్ ఇంకా క్రీజులోనే ఉన్నాడు కాబట్టి విజయం సన్‌రైజర్స్ వైపే ఉంది. కానీ ఇక్కడే ఢిల్లీ బౌలర్లు అద్భుతం చేశారు. కేవలం 22 బంతుల్లో 8 వికెట్లు పడగొట్టి హైదరాబాద్‌ను ముంచేశారు. రబడ (4/22), మోరిస్ (3/22), పాల్ (3/17).. ముప్పేటా చేసిన దాడికి బెంబేలెత్తిన సన్.. కేవలం 15 పరుగులే చేసి ఘోర ఓటమిని మూటగట్టుకుంది. అప్పటివరకు వార్నర్ (47 బంతుల్లో 51; 3 ఫోర్లు, 1 సిక్స్), బెయిర్‌స్టో (31 బంతుల్లో 41; 5 ఫోర్లు, 1 సిక్స్) చేసిన పోరాటం..
చూపెట్టిన శ్రమ బూడిదలో పోసిన పన్నీరైంది.

హైదరాబాద్: సీజన్ ప్రారంభంలో హ్యాట్రిక్ విజయాలతో అదరగొట్టిన సన్‌రైజర్స్ .. ఆ తర్వాత గాడితప్పి వరుసగా మూడో మ్యాచ్‌లోనూ పరాజయం పాలైంది. ఆదివారం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 39 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడింది. మొదట బౌలర్లు చెలరేగి ఢిల్లీని కట్టడి చేసినా.. ఆ తర్వాత లక్ష్య ఛేదనలో బ్యాట్స్‌మెన్ చేతులెత్తేయడంతో ఓటమి తప్పలేదు. మున్రో (24 బంతుల్లో 40; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (40 బంతుల్లో 45; 5 ఫోర్లు) రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. రైజర్స్ బౌలర్లలో ఖలీల్ (3/30), భువనేశ్వర్ (2/33) ఆకట్టుకున్నారు. అనంతరం లక్ష్య ఛేదనలో రైజర్స్ 18.5 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌటై వరుసగా మూడో ఓటమి మూటగట్టుకుంది. వార్నర్ (47 బంతుల్లో 51; 3 ఫోర్లు, 1 సిక్స్), బెయిర్‌స్టో (31 బంతుల్ల 41; 5 ఫోర్లు, 1 సిక్స్) పోరాడటంతో ఒక దశలో 101/2తో పటిష్టంగా కనిపించిన సన్‌రైజర్స్ ఆ తర్వాత 15 పరుగుల వ్యవధిలో 8 వికెట్లు కోల్పోయి అనూహ్య ఓటమి మూటగట్టుకుంది. అత్యధిక వికెట్ల వీరుడు (రబడ).. పరుగుల ధీరుడి (వార్నర్) మధ్య జరిగిన పోరులో.. బౌలర్‌దే పైచేయి అయింది. కిమో పాల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

ఆ ఇద్దరు మినహా..

సరైజర్స్ హైదరాబాద్ విజయ లక్ష్యం 156. వార్నర్, బెయిర్‌స్టో, విలియమ్సన్‌తో కూడిన లైనప్‌కు ఇదో లెక్కా అనిపించింది. కానీ బౌలర్లకు సహకరిస్తున్న పిచ్‌పై ఛేజింగ్ అంత సజావుగా సాగలేదు. వార్నర్ ఆరంభం నుంచే తన శైలికి భిన్నంగా ఆచితూచి ఆడితే.. మరో ఎండ్‌లో బెయిర్‌స్టో చక్కటి షాట్లతో అలరించాడు. దీంతో పవర్ ప్లే ముగిసేసరికి రైజర్స్ వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. ఆ తర్వాత కూడా వీరి జోరు కొనసాగడంతో రైజర్స్ సునాయసంగా గెలుస్తుందనిపించింది. తొలి వికెట్‌కు 72 పరుగులు జోడించాక బెయిర్‌స్టో ఔటయ్యాడు. కాసేపటికే మిడాఫ్‌లో రబడ పట్టిన అద్భుత క్యాచ్‌కు విలియమ్సన్ (3) పెవిలియన్ బాటపట్టాడు. దీంతో రైజర్స్ కష్టాల్లో పడింది. ఈ మ్యాచ్‌తో ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఆంధ్ర రంజీ ఆటగాడు రికీ భుయ్ (7) ఉన్నంత సేపు ఇబ్బంది పడి చివరకు పాల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. విజయానికి 24 బంతుల్లో 52 పరుగులు చేయాల్సిన దశలో రబడ వరుస బంతుల్లో వార్నర్, విజయ్ శంకర్ (1)ను డగౌట్‌కు పంపడంతో రైజర్స్ ఓటమి ముందే ఖాయమైంది. చివర్లో హుడా (3), రషీద్ ఖాన్ (0), అభిషేక్ శర్మ (2)ను మోరిస్ ఒకే ఓవర్‌లో వెనక్కి పంపితే.. రబడా వరుస బంతుల్లో భువనేశ్వర్ (2), ఖలీల్ (0)ను ఔట్ చేసి రైజర్స్ ఇన్నింగ్స్ ముగించాడు.
warner

కట్టిపడేసిన బౌలర్లు

ఇప్పటికే బలంగా ఉన్న టాపార్డర్‌కు కెప్టెన్ విలియమ్సన్ తోడవడంతో.. టాస్ గెలిచిన సన్‌రైజర్స్ ఛేదనకు మొగ్గుచూపి ఢిల్లీని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. సీజన్ ఆరంభం నుంచి బెంచ్‌కే పరిమితమైన లెఫ్టార్మ్ సీమర్ ఖలీల్ అహ్మద్ తొలిసారి బరిలో దిగి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించాడు. ప్రపంచ కప్ టీమ్ సెలెక్షన్‌కు ఒక్కరోజు ముందు తన స్వింగ్‌తో చెలరేగిపోయాడు. ఓపెనర్లు పృథ్వీ షా (4), శిఖర్ ధవన్ (7)ను వరుస ఓవర్లలో పెవిలియన్ పంపాడు. దీంతో ఢిల్లీ 20 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయినా మున్రో మెరుపులు మెరిపించడంతో పవర్‌ప్లే ముగిసేసరికి ఢిల్లీ 51/2తో నిలిచింది. సందీప్ ఓవర్‌లో రెండు ఫోర్లు బాదిన మున్రో.. ఖలీల్ బౌలింగ్‌లో మూడు ఫోర్లు, ఓ సిక్స్ దంచాడు. అభిషేక్ శర్మ ఓవర్‌లో ఓ సిక్సర్ కొట్టిన అతడు మరుసటి బంతికే కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత యువ జోడీ శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (23) ఆచితూచి ఆడటంతో స్కోరు వేగం తగ్గింది. అడపా దడపా బౌండ్రీలు బాదిన ఈ జోడీ 12వ ఓవర్లో స్కోరును వంద దాటించింది. రైజర్స్ బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో వీరిద్దరి చేతులు కట్టేయడంతో భారీ షాట్లు కరువయ్యాయి. మూడు ఓవర్ల పాటు ఒక్క బౌండ్రీ కూడా రాకపోవడంతో అసహనానికి గురైన శ్రేయస్.. భువీ వేసిన బౌన్సర్‌కు దొరికిపోతే, పంత్.. ఖలీల్‌కు వికెట్ సమర్పించుకున్నాడు. కెప్టెన్సీ భారం తగ్గడంతో భువీ బౌలింగ్‌లో మునుపటి వాడి కనిపించింది. భారీ షాట్లతో మురిపిస్తాడనుకున్న మోరిస్ (4) కూడా ప్రభావం చూపలేకపోయాడు. చివర్లో కిమో పాల్ (7) అండగా అక్షర్ (14 నాటౌట్) విలువైన పరుగులు జోడించి ఢిల్లీకి గౌరవప్రద స్కోరు అందించాడు. నబీ గైర్హాజరీలో ఓ బౌలర్ తగ్గడంతో విజయ్ శంకర్‌పై నమ్మకం ఉంచని విలియమ్సన్.. దీపక్ హుడా, అభిషేక్ శర్మతో కూడా బౌలింగ్ చేయించడం విశేషం.

స్కోరు బోర్డు

ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా (సి) బెయిర్‌స్టో, (బి) ఖలీల్ 4, ధవన్ (సి) భువనేశ్వర్ (బి) ఖలీల్ 7, మున్రో (సి) బెయిర్‌స్టో (బి) అభిషేక్ 40, శ్రేయస్ (సి) బెయిర్‌స్టో (బి) భువనేశ్వర్ 45, పంత్ (సి) హుడా (బి) ఖలీల్ 23, మోరిస్ (బి) రషీద్ 4, అక్షర్ (నాటౌట్) 14, పాల్ (ఎల్బీ) భువనేశ్వర్ 7, రబడ (నాటౌట్) 2, ఎక్స్‌ట్రాలు: 9, మొత్తం: 20 ఓవర్లలో 155/7. వికెట్ల పతనం: 1-11, 2-20, 3-69, 4-125, 5-127, 6-133, 7-152, బౌలింగ్: భువనేశ్వర్ 4-0-33-2, ఖలీల్ 4-0-30-3, సందీప్ 4-0-30-0, దీపక్ 1-0-8-0, అభిషేక్ 1-0-10-1, శంకర్ 2-0-17-0, రషీద్ 4-0-22-1.
సన్‌రైజర్స్ హైదరాబాద్: వార్నర్ (సి) శ్రేయస్ (బి) రబడ 51, బెయిర్‌స్టో (సి) రబడ (బి) పాల్ 41, విలియమ్సన్ (సి) రబడ (బి) పాల్ 3, రికీ భుయ్ (సి) అక్షర్ (బి) పాల్ 7, విజయ్ శంకర్ (సి) పంత్, (బి) రబడ 1, హుడా (బి) మోరిస్ 3, అభిషేక్ (సి) పాల్, (బి) మోరిస్ 2, రషీద్ (సి) పాల్ (బి) మోరిస్ 0, భువనేశ్వర్ (సి అండ్ బి) రబడ 2, సందీప్ (నాటౌట్) 1, ఖలీల్ (బి) రబడ 0, ఎక్స్‌ట్రాలు: 5, మొత్తం: 18.5 ఓవర్లలో 116 ఆలౌట్. వికెట్ల పతనం: 1-72, 2-78, 3-101, 4-106, 5-106, 6-110, 7-110, 8-112, 9-116, 10-116. బౌలింగ్: ఇషాంత్ 3-0-19-0, రబడ 3.5-0-22-4, మోరిస్ 3-0-22-3, అక్షర్ 2-0-23-0, పాల్ 4-0-17-3, మిశ్రా 3-0-13-0.

6781
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles