మారని ఆట.. మళ్లీ తొలి రౌండ్‌లోనే..

Tue,November 5, 2019 04:43 PM

పుజౌ(చైనా): భారత స్టార్ షట్లర్, ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధుకు షాక్. తన సుధీర్ఘ బ్యాడ్మింటన్ కెరీర్‌లో ఎంతో మంది స్టార్ క్రీడాకారిణులను మట్టికరిపించిన తెలుగమ్మాయి తన కన్నా తక్కువ ర్యాంకు ప్లేయర్ చేతిలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. పేలవ ఆటతీరుతో మరో ప్రతిష్టాత్మక టోర్నీలో పతకం లేకుండానే ఇంటిముఖం పట్టింది. చైనా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేస్తుందని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది.


మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఆరో సీడ్ సింధు 13-21, 21-18, 19-21తో పాయ్ యు(చైనీస్ తైపీ) చేతిలో ఓటమిచవిచూసింది. చైనా, కొరియా, డెన్మార్క్ టోర్నీల్లో తొలి పోరులోనే నిష్క్రమించిన వరల్డ్ ఆరో ర్యాంకు సింధు 74 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన తొలి పోరులో ప్రత్యర్థి ముందు తేలిపోయింది. అంతర్జాతీయ టోర్నీల్లో అంతగా అనుభువంలేని పాయ్ యు విజయం కోసం అద్భుతంగా పోరాడింది. తన ముందు కఠిన ప్రత్యర్థి సింధు ఉన్నప్పటికీ గట్టిపోటీనిచ్చింది. తొలి సెట్‌ను సులువుగా కైవసం చేసుకున్న పాయ్‌కు రెండో సెట్‌లో ఎదురుదెబ్బ తగిలింది. మధ్యలో పుంజుకున్న సింధు 21-18తో సెట్‌ను గెలిచి రేసులోకి వచ్చింది. ఐతే నిర్ణయాత్మక మూడో సెట్‌ను కసితో ఆడిన పాయ్.. సింధుపై ఆధిపత్యం ప్రదర్శించి సెట్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.

సింధు ఇప్పటికే గత మూడు టోర్నీలు చైనా(బీడబ్ల్యూఎఫ్ సూపర్ 1000), కొరియా, డెన్మార్క్ ఓపెన్లలో మొదటి రౌండ్లలోనే వెనుదిరిగిన విషయం తెలిసిందే. ఫ్రెంచ్ ఓపెన్‌లో కొంచెం మెరుగైన ప్రదర్శన చేసింది. గత ఆగస్టులో వరల్డ్ ఛాంపియన్‌షిప్ టైటిల్ నెగ్గిన విషయం తెలిసిందే.

990
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles