మారిన్ గండాన్ని గట్టెక్కని సింధు.. సిల్వర్‌తోనే సరి

Sun,August 5, 2018 02:36 PM

PV Sindhu lost to Carolina Marin World Badminton Championship

నాన్‌జింగ్: పీవీ సింధు గోల్డెన్ చాన్స్‌ను మరోసారి మిస్ చేసుకుంది. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ గెలిచే అవకాశాన్ని తృటిలో చేజార్చుకుంది. ఒలింపిక్స్ ఫైనల్లో సింధు స్వర్ణం గెలవకుండా అడ్డుపడిన కరోలినా మారిన్ ఈసారి కూడా ఫైనల్లో ఆమెను ఓడించింది. ఇప్పటివరకు బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో మూడు పతకాలు గెలిచిన సింధుకు.. స్వర్ణం గెలవాలన్న కల కలగానే మిగిపోయింది. ఇప్పటివరకు ఏ ఇండియన్ షట్లర్ గోల్డ్ మెడల్ గెలవలేదు. ఫైనల్లో సింధుపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన మారిన్.. 21-19, 21-10 తేడాతో సునాయాసంగా గెలిచింది. తొలి గేమ్‌లో ఒక దశలో 14-9 ఆధిక్యంలోకి దూసుకెళ్లిన సింధు.. తర్వాత వెనుకబడిపోయింది. మారిన్ ఒక్కసారిగా దూకుడు పెంచడంతో వరుసగా పాయింట్లు సమర్పించుకుంది.

మ్యాచ్ మొదట్లోనే మారిన్ 3-0 లీడ్‌లోకి దూసుకెళ్లగా.. తర్వాత కోలుకున్న సింధు.. 14-9 వరకు స్కోరును తీసుకెళ్లగలిగింది. ఈ దశలో మారిన్ వరుసగా ఆరు పాయింట్లు సాధించగా సింధు కేవలం ఒక్క పాయింటే గెలిచింది. దీంతో స్కోరు 15-15తో సమమైంది. అప్పటి నుంచి ఆ గేమ్ హోరాహోరీగా సాగింది. చివరికి మారిన్ 21-19తో గెలిచి తొలి గేమ్‌ను ఎగురేసుకుపోయింది. ఇక రెండో గేమ్‌లో అయితే మారిన్ ధాటికి సింధు నిలవలేకపోయింది. అప్పటికే కాస్త అలసిపోయినట్లుగా కనిపించిన ఆమె.. ఏమాత్రం ఫైట్ ఇవ్వలేకపోయింది. దీంతో రెండో గేమ్‌ను 21-10తో గెలిచి మారిన్ గోల్డ్ మెడల్‌ను సొంతం చేసుకుంది.

1567
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles