ఢిల్లీ ఢమాల్

Tue,April 24, 2018 01:11 AM

Punjab Beat Delhi By 4 Runs

-అయ్యర్ ఒంటరి పోరాటం వృథా..
-పంజాబ్ చేతిలో ఢిల్లీ ఓటమి

వేదిక మారినా ఢిల్లీ తలరాత మారడం లేదు. పరాయి గడ్డపై పరాజయాలు చవిచూసిన ఢిల్లీకి సొంతగడ్డపై కూడా ఆశాభంగం ఎదురైంది. ఫిరోజ్‌షా కోట్లాలో గెలుపు జెండా ఎగిరెద్దామనుకున్న గంభీర్‌సేన ఆశలకు పంజాబ్ గండికొట్టింది. ప్రత్యర్థి పంజాబ్‌ను కట్టడి చేశామని సంబురపడ్డ ఢిల్లీ లక్ష్యఛేదనలో బోల్తా పడింది. సహచరులు విఫలమైన వేళ శ్రేయాస్ అయ్యర్ ఒంటరి పోరాటం ఢిల్లీని గెలుపు బాట పట్టించలేకపోయింది. ఆరు మ్యాచ్‌ల్లో ఐదు ఓటములు ఎదుర్కొన్న ఢిల్లీ..ఆఖరి స్థానంలో కొనసాగుతున్నది.

ఢిల్లీ: ఉత్కంఠ ఊపేసింది. ఢిల్లీ డేర్‌డెవిల్స్, కింగ్స్‌లెవన్ పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ ఆసాంతం అభిమానులను కట్టిపడేసింది. గెలుపు దోబూచులాడిన మ్యాచ్‌లో పంజాబ్‌ను అదృష్టం వరించగా, దురదృష్ట ఢిల్లీ మరో ఓటమిని ఖాతాలో వేసుకుంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీపై 4 పరుగుల తేడాతో పంజాబ్ ఉత్కంఠ విజయం సాధించింది. పంజాబ్ నిర్దేశించిన 144 పరుగుల లక్ష్యఛేదనలో ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 139 పరుగులు చేసింది. అయ్యర్(57), తెవాటియా(24) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చలేదు. రాజ్‌పుత్(2/23), టై(2/25), ముజీబుర్(2/25) రాణించారు. తొలుత ప్లంకెట్(3/17), బౌల్ట్(2/21), అవేశ్‌ఖాన్(2/36) ధాటికి పంజాబ్ 20 ఓవర్లలో 143/8 స్కోరు చేసింది. రాజ్‌పుత్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.

ఢిల్లీ పడుతూ లేస్తూ: స్వల్ప లక్ష్యఛేదనలో ఢిల్లీ ఇన్నింగ్స్ పడుతూలేస్తూ సాగింది. ఈ సీజన్‌లో ఢిల్లీకి తొలి మ్యాచ్ ఆడుతున్న పృథ్వీషా(22) తనదైన దూకుడు ప్రదర్శించాడు. తనకు దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందామనుకున్న తరుణంలో భారీ షాట్ ఆడబోయిన షా క్లీన్‌బౌల్డ్ అయి తొలి వికెట్‌గా నిష్క్రమించాడు. మరోవైపు ఓ ఫోర్, సిక్స్‌తో జోరుమీద కనిపించిన మ్యాక్స్‌వెల్(12)కూడా రాజ్‌పుత్‌కు వికెట్ ఇచ్చుకున్నాడు. పరుగు వ్యవధిలో కెప్టెన్ గంభీర్(4) కూడా ఔట్ కావడంతో ఢిల్లీ 42 పరుగులకే మూడు కీలక వికెట్లు చేజార్చుకుంది. ఓవైపు వికెట్లు పడుతున్నా అయ్యర్(45 బంతుల్లో 57, 5 ఫోర్లు, సిక్స్) తన ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. పంజాబ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టేందుకు ప్రయత్నించాడు. కానీ మరో ఎండ్ నుంచి సహకారం కరువైంది. సీజన్‌లో మంచి ఫామ్‌మీదున్న రిషబ్ పంత్(4) ఢిల్లీ అభిమానుల ఆశలను వమ్ము చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆల్‌రౌండర్ క్రిస్టియన్(6) కూడా తేలిపోయాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా..వెనుకకు తగ్గని అయ్యర్.. రాహుల్ తెవాటియా(24తో కలిసి ఇన్నింగ్స్‌ను గాడిలో పడేశారు. స్రాన్ బౌలింగ్‌లో ఓసారి ఔటయ్యే అవకాశం తప్పించుకున్న అయ్యర్..కీలక ఇన్నింగ్స్‌కు తెరతీశాడు. స్రాన్ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్లో ఓ సిక్స్, ఫోర్‌తో అలరించిన తెవాటియాతో పాటు ప్లంకెట్(0) వెంటవెంటనే ఔటయ్యారు. అయ్యర్ ఆఖరి వరకు పోరాడినా లాభం లేకపోయింది. ఆఖరి ఓవర్లో విజయానికి 17 పరుగులు అవసరమైన దశలో అయ్యర్ ఓ ఫోర్, సిక్స్‌తో విజృంభించినా ఢిల్లీని గెలుపు తీరాలకు చేర్చలేకపోయాడు.
Liam-Plunkett
ప్లంకెట్ సూపర్: లియామ్ ప్లంకెట్ అరంగేట్రం మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. ఢిల్లీ తరఫున బరిలోకి దిగిన తొలి మ్యాచ్‌లో ప్లంకెట్(4-0-17-3) మూడు వికెట్లతో పంజాబ్ పతనంలో కీలకమయ్యాడు. ప్లంకెట్‌కు తోడు బౌల్ట్(2/21), అవేశ్‌ఖాన్(2/36) ధాటికి పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. పంజాబ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. గేల్ స్థానంలో జట్టులోకొచ్చిన ఆరోన్ ఫించ్(2) తీవ్రంగా నిరాశపరిచాడు. మరోవైపు వచ్చిరావడంతోనే కేఎల్ రాహుల్(23) జతగా మయాంక్ అగర్వాల్(21) వరుస బౌండరీలతో చెలరేగాడు. తానేం తక్కువ కాదన్నట్లు ఫామ్‌మీదున్న రాహుల్ బ్యాటు ఝులిపించడంతో పంజాబ్ ఇన్నింగ్స్ జోరు అందుకుంది. అయితే ఐదో ఓవర్లో స్కూప్ షాట్ ఆడబోయిన రాహుల్..ప్లంకెట్‌కు వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో పవర్‌ప్లే ముగిసే సరికి పంజాబ్ రెండు వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. రాహుల్‌ను అనుసరిస్తూ అగర్వాల్ కూడా ప్లంకెట్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ కావడంతో పంజాబ్ కష్టాల్లో కూరుకుపోయింది. ఆ తర్వాత క్రీజులోకొచ్చిన యువరాజ్‌సింగ్(14) మరోమారు విఫలమయ్యాడు. ఈ క్రమంలో కరుణ్ నాయర్(34), డేవిడ్ మిల్లర్(26) సమయోచిత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. వీరిద్దరు కలిసి ఐదో వికెట్‌కు 31 పరుగులు జోడించారు.అప్పటికే రెండు సార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న మిల్లర్ కూడా ఔట్ కావడంతో పంజాబ్‌ను ఆదుకునే వారు కరువయ్యారు. బౌల్ట్ వేసిన చివరి ఓవర్లో అశ్విన్, అండ్రూ టై(3) నిష్క్రమించడంతో పంజాబ్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.
IPL

స్కోరుబోర్డు

పంజాబ్: రాహుల్(సి)అవేశ్(బి)ప్లంకెట్ 23, ఫించ్(సి)అయ్యర్(బి)అవేశ్ 2, అగర్వాల్(బి)ప్లంకెట్ 21, నాయర్(సి)అయ్యర్(బి)ప్లంకెట్ 34, యువరాజ్‌సింగ్(సి)రిషబ్(బి)అవేశ్ 14, మిల్లర్(సి)ప్లంకెట్(బి)క్రిస్టియన్ 26, అశ్విన్(సి)తెవాటియా(బి)బౌల్ట్ 6, టై(బి)బౌల్ట్ 3, స్రాన్ 0 నాటౌట్; ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం: 20 ఓవర్లలో 143/8; వికెట్ల పతనం: 1-6, 2-42, 3-60, 4-85, 5-116, 6-127, 7-140, 8-143; బౌలింగ్: బౌల్ట్ 3-0-21-2, అవేవ్‌ఖాన్ 4-0-36-2, ప్లంకెట్ 4-0-17-3, క్రిస్టియన్ 3-0-17-1, అమిత్‌మిశ్రా 4-0-33-0, మ్యాక్స్‌వెల్ 1-0-4-0, తెవాటియా 1-0-6-0.

ఢిల్లీ: పృథ్వీషా (బి)రాజ్‌పుత్ 22, గంభీర్(సి)ఫించ్(బి)టై 4, మ్యాక్స్‌వెల్(సి)టై(బి)రాజ్‌పుత్ 12, అయ్యర్ (సి)ఫించ్(బి)ముజీబ్ 57, రిషబ్ (బి)ముజీబ్ 4, క్రిస్టియన్(రనౌట్) 6, తెవాటియా(సి)రాహుల్(బి)టై 24, ప్లంకెట్(సి)నాయర్(బి)స్రాన్ 0, అమిత్‌మిశ్రా 1 నాటౌట్; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 20 ఓవర్లలో 139/8; వికెట్ల పతనం: 1-25, 2-41, 3-42, 4-61, 5-76, 6-123, 7-124, 8-139; బౌలింగ్: రాజ్‌పుత్ 4-0-23-2, స్రాన్ 4-0-45-1, టై 4-0-25-2, అశ్విన్ 4-0-19-0, ముజీబుర్ 4-0-25-2.

2136
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles