అలాంటి పిచ్ వ‌ద్ద‌ని ముందే చెప్పా!

Mon,February 27, 2017 01:02 PM

Pune Pitch Curator blames BCCI Pitch committee for Dry Pitch

పుణె: బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫ‌ర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) పిచ్ క‌మిటీపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశాడు పుణెలోని మ‌హారాష్ట్ర క్రికెట్ అసోసియేష‌న్ పిచ్ క్యూరేట‌ర్ పాండురంగ సాల్గావ్‌క‌ర్‌. ఇలాంటి డ్రై పిచ్ వ‌ద్ద‌ని తాను ముందే హెచ్చ‌రించినా.. పిచ్ క‌మిటీ స‌భ్యులు ప‌ట్టించుకోలేద‌ని అత‌ని ఆరోపించాడు. అంత‌ర్జాతీయ మ్యాచ్‌లు జ‌రిగే స‌మ‌యంలో తాము కేవ‌లం స‌హాయ‌కులుగా మాత్రమే ప‌నికొస్తామ‌ని, పిచ్ క‌మిటీ ఏం చెబితే అదే చేయాల్సి ఉంటుంద‌ని అత‌ను అన్నాడు. ఆస్ట్రేలియాతో జ‌రిగిన తొలి టెస్ట్‌లో ఈ పిచ్‌పై టీమిండియా బోల్తా ప‌డిన విష‌యం తెలిసిందే. బంతి గింగిరాలు తిరిగిన ఈ పిచ్‌పై అనుభ‌వం లేని ఆసీస్ స్పిన్న‌ర్ ఓకీఫ్ ఏకంగా 12 వికెట్లు తీశాడు. నిజానికి మ్యాచ్‌కు ముందే ఈ పిచ్‌ను చూసి స్పిన్ దిగ్గ‌జం షేన్ వార్న్‌, గ‌వాస్క‌ర్‌, సంజ‌య్ మంజ్రేక‌ర్ ఆశ్చ‌ర్య‌పోయారు.

పిచ్ క‌మిటీ స‌భ్యుల‌కు ఇలాంటి పిచ్ వ‌ద్ద‌ని ఎంత న‌చ్చ‌జెప్పాల‌ని చూసినా వాళ్లు విన‌లేద‌ని, చివ‌రికి అది కోహ్లి సేన కొంపే ముంచింద‌ని పాండురంగ అన్నాడు. అత‌ను క‌మిటీ స‌భ్యుల పేర్లు చెప్ప‌క‌పోయినా.. క‌మిటీ చీఫ్ ద‌ల్జీత్‌సింగ్‌, వెస్ట్‌జోన్ హెడ్ ధీర‌జ్ ప‌ర్సానా మ్యాచ్‌కు ముందు పిచ్‌ను ప‌రిశీలించిన‌ట్లు తెలిసింది. పూర్తి స్పిన్ పిచ్ త‌యారుచేయాల‌ని టీమిండియా మేనేజ్‌మెంట్ నుంచే ఆదేశాలు వ‌చ్చాయ‌న్న పుకార్లు కూడా ఉన్నాయి. అయితే ఆ విష‌యం త‌న‌కు తెలియ‌ద‌ని పాండురంగ చెప్పాడు. టీమ్ నుంచి ఎవ‌రూ త‌న‌ను క‌ల‌వ‌లేద‌ని, సీనియ‌ర్ క్యూరేట‌ర్ల‌ను క‌లిసి చెప్పి ఉండొచ్చ‌ని అత‌ను తెలిపాడు. పుణెలో జ‌రిగిన తొలి టెస్టులోనే ఇలాంటి ఫ‌లితం రావ‌డం త‌న‌కు అసంతృప్తి క‌లిగించింద‌ని పాండురంగ అన్నాడు.

3623
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles