క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మరో భారత క్రికెటర్

Tue,July 17, 2018 07:08 PM

న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్ మహ్మద్ కైఫ్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఐదు రోజుల తరువాత మరో భారత బౌలర్ ఆటకు గుడ్‌బై చెప్పాడు. ఢిల్లీ పేస్ బౌలర్ పర్వీందర్ అవానా తాజాగా అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినట్లు ట్విటర్ వేదికగా వెల్లడించాడు. పర్వీందర్ చివరిసారిగా 2016 నవంబర్‌లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడాడు. అవానా త్వరలోనే 32వ పుట్టినరోజును జరుపుకోనున్నాడు.


ఈ సందర్భంగా ట్విటర్‌లో సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌కు సంబంధించిన లేఖను పోస్ట్ చేశారు. టీమిండియా, దేశవాళీ క్రికెట్లో ఢిల్లీ(డీడీసీఏ)కి ప్రాతినిధ్యం వహించడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. నా స్థానంలో యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చేందుకు ఇదే సరైన సమయం అని అనుకుంటున్నాను. నా నైపుణ్యాలను ప్రదర్శించేందుకు అవకాశం ఇచ్చి, ప్రోత్సహించిన డీడీసీఏ సెలక్టర్లకు, సీనియర్లకు కృతజ్ఞతలు చెబుతున్నాను. ఎల్లవేళలా నాకు మద్దతుగా నిలిచిన, క్రికెట్ జర్నీలో భాగమైన ప్రతిఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని ట్విటర్‌లో వ్యాఖ్యానించాడు.

అవానా ఢిల్లీకి 9ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించాడు. 2012లో సొంతగడ్డపై ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో రెండు టీ20 మ్యాచ్‌లను ఆడాడు. కానీ వికెట్లు తీయడంలో విఫలమయ్యాడు. 2012-2014 మధ్య ఐపీఎల్‌లో 3 సీజన్ల పాటు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ఆడాడు. ఢిల్లీ పేసర్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ల 62 మ్యాచ్‌ల్లో 29.23 సగటుతో 191 వికెట్ల పడగొట్టాడు. ఢిల్లీ తరఫున ఆడిన క్రికెటర్లు ఆశీష్ నెహ్రా, సుమిత్ నర్వాల్, ప్రదీప్ సంగ్వాన్, ఇషాంత్ శర్మకు సోషల్‌మీడియాలో థ్యాంక్స్ చెప్పాడు.


7606
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles