
సెయింట్ లూసియా: క్రికెట్ ఫీల్డ్‌లో స్లెడ్జింగ్ సాధారణమే. మ్యాచ్ గెలవడానికి ప్రత్యర్థి ప్లేయర్స్‌ను మానసికంగా దెబ్బతీయడంలో భాగమే ఇది. ఆస్ట్రేలియా ప్లేయర్స్ ప్రపంచానికి నేర్పిన విద్య. అయితే ఒక్కోసారి ఇవి కాస్త శృతి మించుతుంటాయి. తాజాగా ఇంగ్లండ్, వెస్టిండీస్ మూడో టెస్ట్ మ్యాచ్‌లోనూ అదే జరిగింది. మూడో రోజు ఆట సందర్భంగా ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్‌పై వెస్టిండీస్ బౌలర్ షానన్ గాబ్రియెల్ నోరు పారేసుకున్నాడు. దీంతో అంపైర్లు అతనికి ఫీల్డ్‌లోనే వార్నింగ్ ఇచ్చారు. గాబ్రియెల్ ఏమన్నాడో తెలియలేదుగానీ.. అతనికి రూట్ గట్టిగా సమాధానమిస్తున్న వీడియో మాత్రం ఇప్పుడు వైరల్‌గా మారింది. గే అయితే తప్పేమీ లేదు అని రూట్ అనడం ఆ వీడియోలో వినిపించింది. ఈ ఘటనపై రోజు ముగిసిన తర్వాత రూట్ స్పందించాడు. అయితే గాబ్రియెల్ ఏమన్నాడో చెప్పకపోయినా.. అతడు తన వ్యాఖ్యలకు చింతిస్తాడని మాత్రం రూట్ చెప్పాడు. ఫీల్డ్‌లో ఇలాంటివి సహజమే అని, వాటిని ఫీల్డ్‌కే పరిమితం చేయాలని అతను అన్నాడు. ఇది టెస్ట్ క్రికెట్. అతను ఈ మ్యాచ్ గెలవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. అతనో మంచి మనిషి. హార్డ్ వర్క్ చేస్తాడు అని రూట్ అన్నాడు. ఈ ఘటనపై అంపైర్లకు కూడా రూట్ ఫిర్యాదు చేయలేదు. దీనిపై వెస్టిండీస్ కోచ్ రిచర్డ్ పైబస్ స్పందించాడు. గాబ్రియెల్ ఏమన్నాడో తెలియదుగానీ.. తప్పు చేసినట్లు తెలిస్తే మాత్రం చర్యలు తీసుకుంటామని అతను చెప్పాడు.