లార్డ్స్‌లో బిగ్‌ఫైట్‌.. ఆసీస్‌తో కివీస్‌ అమీతుమీ

Sat,June 29, 2019 04:08 PM

New Zealand, Australia as both sides have an eye on the semi-finals

లండన్: వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య సమరానికి రంగం సిద్ధమైంది. బిగ్‌ఫైట్‌కు ప్ర‌తిష్టాత్మ‌క లార్డ్స్ క్రికెట్ మైదానం వేదిక కానుంది. ఇప్పటికే సెమీ ఫైన‌ల్‌ చేరిన డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా.. సెమీస్ బెర్తుకు ఒక్క‌ విజయం దూరంలో ఉన్న న్యూజిలాండ్‌ శనివారం ఇక్కడ తలపడనున్నాయి. 2015 ప్రపంచకప్ ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓటమికి బదులు తీర్చుకోవాలని కివీస్ ఉవ్విళ్లూరుతుంటే.. విశ్వసమరంలో తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని కంగారూలు భావిస్తున్నారు. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఒక్క విజయం సాధించినా న్యూజిలాండ్ సెమీస్‌కు చేరే అవకాశం ఉన్నప్పటికీ.. ఆసీస్‌ను మట్టికరిపించే నాకౌట్‌లో అడుగుపెట్టాలని కివీస్‌ భావిస్తోంది.


కంగారూల‌కు ఎదురుందా..!

విశ్వసమరం అంటేనే అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించే ఆసీస్ ఆటగాళ్లు ఈసారి కూడా అదే ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. ప్రస్తుత టోర్నీలో అత్యధిక పరుగుల, వికెట్ల వీరుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నది కూడా కంగారూలే. ఓపెనర్లు వార్నర్ (500), ఫించ్ (496) పరుగుల వరద పారిస్తున్నారు. వీరిద్దరూ ప్రతీ మ్యాచ్‌లోనూ చెలరేగిపోతుండటంతో కంగారూలకు ఎదురులేకుండా పోయింది. ఆ తర్వాత ఖవాజ, స్మిత్, మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, కారీతో ఆసీస్ బ్యాటింగ్ శత్రు దుర్భేద్యంగా కనిపిస్తున్నది. బౌలింగ్‌లో జోరుమీదున్న స్టార్క్, బెరెన్‌డార్ఫ్, కమ్మిన్స్‌ను న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.


ఓపెనర్ల పేలవ ఫామ్‌..!

న్యూజిలాండ్‌కు ఓపెనర్ల పేలవ ఫామ్‌ పెద్ద సమస్యగా మారింది. హార్డ్‌హిట్ట‌ర్లు గప్టిల్, మున్రో కనీసం పది ఓవర్లైనా నిలవడం లేదు. ఆదుకుంటారనుకున్న ఓపెనర్లు గప్టిల్, మన్రో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతుండటంతో కివీస్‌కు మంచి ఆరంభాలు లభించడం లేదు. మిడిలార్డర్‌లో విలియమ్సన్ జట్టు భారాన్ని మోస్తుండగా.. టేలర్ ఫర్వాలేదనిపిస్తున్నాడు. లాథమ్ కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు. ఆల్‌రౌండర్లు నీషమ్, గ్రాండ్‌హోమ్ అంచనాలకు మించి రాణిస్తుండటం బ్లాక్ క్యాప్స్‌కు సానుకూలాంశం. బౌలింగ్‌లో బౌల్ట్, ఫెర్గూసన్, సౌథీ మంచి టచ్‌లో ఉన్నారు.

సాయంత్రం 6 గంట‌ల‌ నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..2388
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles