యూఎస్ ఓపెన్ విజేత రఫెల్ నాదల్

Mon,September 9, 2019 09:58 AM

Nadal Wins 19th Grand Slam Title After 5-Set Thriller

న్యూయార్క్: స్టార్ టెన్నిస్ ప్లేయర్, స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ కెరీర్‌లో 19వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. ఆదివారం అర్ధరాత్రి జరిగిన యూఎస్ ఓపెన్ తుది సమరంలో అద్భుత ప్రదర్శన చేశాడు. ఐదుసెట్ల పోరులో హోరాహోరీగా సాగిన పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ నాదల్ 7-5, 6-3, 5-7, 4-6, 6-4తో డానిల్ మెద్వదేవ్‌పై విజయం సాధించాడు. ఫురుషుల విభాగంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో అగ్రస్థానంలో ఉన్న ఫెదరర్(20)ను అందుకోవడానికి ఒక్క విజయం దూరంలో నిలిచాడు 33ఏండ్ల రఫెల్. యూఎస్ ఓపెన్‌లో రఫాకిది నాలుగోది కావడం విశేషం. యూఎస్ ఓపెన్‌లో రఫెల్ ఫైనల్ ఆడటం ఇది ఐదోసారి కాగా.. గతంలో మూడు సార్లు 2017, 2013, 2010లో విజేతగా నిలిచాడు. 2011లో రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. కెరీర్‌లో రఫెల్ మొత్తం 84 టైటిల్స్ నెగ్గగా.. అందులో 21 హార్డ్‌కోర్టులో గెలిచాడు.

4 గంటల 50 నిమిషాలు..

తుదిపోరు ఏకంగా సుమారు 5 గంటల పాటు సాగింది. టైటిల్‌పోరులో రష్యా క్రీడాకారుడు, ఐదోసీడ్ మెద్వెదేవ్ రెండో సీడ్ నాదల్‌కు గట్టిపోటీనిచ్చాడు. నాదల్ ఐదు.. మెద్వెదేవ్ 14 ఏస్‌లను సంధించారు. నాదల్ 62.. మెద్వదేవ్ 75 విన్నర్లు కొట్టాడు. మ్యాచ్‌లో అనవసర తప్పిదాలు చేసిన రష్యా ప్లేయర్ మూల్యం చెల్లించుకున్నాడు. నాదల్ 46 తప్పిదాలు చేయగా.. డానిల్ 57 తప్పులు చేశాడు. కొన్నేండ్లుగా కఠోర సాధన చేస్తూ.. అన్ని టోర్నీల్లోనూ సత్తాచాటుతూ వస్తున్న మెద్వెదేవ్‌కు గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలవాలన్న కోరిక నెరవేరలేదు.

తొలి రెండు సెట్లను 7-5, 6-3తో గెలుచుకున్న నాదల్‌కు తర్వాతి సెట్లలో రష్యా యువకెరటం డానిల్ భారీ షాకిచ్చాడు. ఒత్తిడిలోనూ గట్టిగా పుంజుకొని ఏకంగా మూడు, నాలుగుసెట్లను 5-7, 4-6తో సొంతం చేసుకున్నాడు. అంచనాలకు అనుగుణంగానే మ్యాచ్ ఆద్యంతం రసవత్తరంగా సాగింది. ఐతే నిర్ణయాత్మక ఐదో సెట్‌లో గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో అపారఅనుభవం కలిగిన నాదల్ 6-4తో పైచేయి సాధించాడు. దిగ్గజ యోధుడికి సమానంగా పోరాడిన మెద్వెదేవ్ పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎంతో పట్టుదలతో, అంకితభావంతో అద్భుత పోరాటం చేశావని కొనియాడుతున్నారు. మ్యాచ్ అనంతరం అతని దగ్గరి నుంచి అభిమానులు ఆటోగ్రాఫ్ లు తీసుకునేందుకు ఎగబడ్డారు. అంతిమంగా అభిమానుల మనసు గెలుచుకున్నాడు.


నాదల్ గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు-19

ఆస్ట్రేలియా ఓపెన్ (2009),
ఫ్రెంచ్ ఓపెన్ (2005, 2006, 2007, 2008, 2010, 2011, 2012, 2013, 2014, 2017, 2018, 2019),
వింబుల్డన్ (2008, 2010),
యూఎస్ ఓపెన్ (2010, 2013, 2017, 2019)









1602
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles