ముంబై మురిసెన్

Thu,April 4, 2019 01:38 AM

Mumbai won the match by 37 runs against Chennai

-చెన్నైపై 37 పరుగుల తేడాతో గెలుపు
-సూర్యకుమార్ అర్ధసెంచరీ
-చెలరేగిన పాండ్యా బ్రదర్స్
ఐపీఎల్‌లో రెండు అత్యంత విజయవంతమైన రెండు చాంపియన్ జట్ల బిగ్‌ఫైట్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌కి షాక్. వరుస విజయాలతో ఊపుమీదున్న ధోనీ గ్యాంగ్‌కు ముంబై ఇండియన్స్ పగ్గాలు వేసింది. స్టార్లు అందుబాటులో ఉన్నా.. ఇన్నాళ్లూ గెలుపు కోసం ముఖం వాచిపోయి ఉన్న రోహిత్‌సేన ఎట్టకేలకు జూలు విదిల్చింది. బౌలర్లు సమిష్టిగా రాణించి బలమైన ప్రత్యర్థిని కట్టడి చేసి భారీ లక్ష్యాన్ని అద్భుతంగా కాపాడుకున్నారు. మరోవైపు భారీ హిట్టర్లు లేకపోవడంతో దారుణంగా దెబ్బతిన్న చెన్నై ఏ దశలోనూ లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించలేదు. ఒక్క జాదవ్ మినహా.. మిగతా వారు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో ఈ సీజన్‌లో తొలి ఓటమిని మూటగట్టుకుంది.

ముంబై: సొంతగడ్డపై ముంబై ఇండియన్స్ చెలరేగిపోయింది. ఆల్‌రౌండ్ షోతో అదరగొడుతూ.. పటిష్ఠమైన చెన్నైకి చెక్ పెట్టిం ది. అటు బ్యాటిం గ్, ఇటు బౌలింగ్‌లో హార్దిక్ పాండ్యా (8 బంతుల్లో 25 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స ర్లు; 3/20) సం చలన ప్రదర్శన చూపెట్టడంతో.. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ముంబై 37 పరుగుల తేడాతో చెన్నైపై గెలిచింది. ఈ సీజన్‌లో రోహిత్‌సేనకు ఇది రెండో విజయం. ముంబై నిర్దేశించిన 171 పరుగుల లక్ష్య ఛేదనలో చెన్నై 20 ఓవర్లలో 8 వికెట్లకు 133 పరుగులే చేసింది. కేదార్ జాదవ్ (54 బంతుల్లో 58; 8 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్

బౌలింగ్ అదుర్స్..

ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన బెహ్రెన్‌డార్ఫ్ ఇన్నింగ్స్ నాలుగో బంతికే రాయుడు (0)ను డకౌట్ చేయగా, మరో ఐదు బంతుల తర్వాత వాట్సన్ (5) కూడా పెవిలియన్‌కు చేరుకున్నాడు. రెండు ఓవర్లు కూడా ముగియకముందే 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన చెన్నైని ఆదుకునే బాధ్యత రైనా (16), జాదవ్ తీసుకున్నారు. అనుకున్నట్లుగానే చెరో సిక్సర్‌తో టచ్‌లోకి వచ్చారు. కానీ ఐదో ఓవర్‌లో బెహ్రెన్‌డార్ఫ్ మళ్లీ షాకిచ్చాడు. వరుసగా రెండు ఫోర్లు ఇచ్చి రైనాను ఔట్ చేయడంతో మూడో వికెట్‌కు 27 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. జాదవ్‌తో జతకలిసిన కెప్టెన్ ధోనీ (12) నిలకడగా ఆడాడు. బుమ్రా వేసిన ఏడో ఓవర్‌లో జాదవ్ మూడు ఫోర్లు బాది 15 పరుగులు రాబట్టాడు. తర్వాతి మూడు ఓవర్లలో 17 పరుగులే వచ్చాయి.


దీంతో పవర్‌ప్లేలో 34/3 స్కోరుతో ఉన్న చెన్నై తొలి 10 ఓవర్లలో 66/3కి చేరింది. ఈ దశలో హార్దిక్, కృనాల్ మరింత కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగుల వేగం మందగించింది. తర్వాతి నాలుగు ఓవర్ల్లలో 21 పరుగులే రావడంతో చేయాల్సిన రన్‌రేట్ బాగా పెరిగిపోయింది. దీనికితోడు 15వ ఓవర్‌లో హార్దిక్ డబుల్ ఝలక్ ఇచ్చాడు. నాలుగు బంతుల తేడాలో ధోనీ, జడేజా (1)ను పెవిలియన్‌కు పంపాడు.46 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసిన జాదవ్.. మహీతో నాలుగో వికెట్‌కు 54 పరుగులు జోడించాడు. 18 బంతుల్లో 63 పరుగులు కావాల్సిన దశలో మలింగ.. ఐదు బంతుల తేడాలో జాదవ్, బ్రావో (8)ను ఔట్ చేయడంతో చెన్నై విజయానికి దూరమైంది. చివరి 12 బంతుల్లో 56 పరుగులకుగాను శార్దూల్ (12 నాటౌట్) ఓ సిక్స్, ఫోర్ బాదినా ప్రయోజనం లేకపోయింది.

ఆఖర్లో జోరు..

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లకు 170 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (43 బంతుల్లో 59; 8 ఫోర్లు, 1 సిక్స్), కృనాల్ పాండ్యా (32 బంతుల్లో 42; 5 ఫోర్లు, 1 సిక్స్), పొలార్డ్ (7 బంతుల్లో 17 నాటౌట్; 2 సిక్సర్లు) దంచికొట్టారు. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన ముంబైకి సరైన ఆరంభం లభించలేదు. మూడో ఓవర్‌లో డికాక్ (4) ఔటయ్యాడు. అయితే కెప్టెన్ రోహిత్ (13) ఉన్నాడనే భరోసాతో బ్యాటింగ్ చేసిన సూర్యకుమార్ నాలుగో ఓవర్‌లో మూడు ఫోర్లు బాది 16, తర్వాతి ఓవర్‌లో మరో మూడు ఫోర్లతో 14 పరుగులు రాబట్టడంతో ఇన్నింగ్స్ కుదుటపడింది. పవర్‌ప్లే ముగిసేసరికి ముంబై 40/1 స్కోరు చేసింది. ఎనిమిదో ఓవర్‌లో ఛేంజ్ బౌలర్‌గా వచ్చిన జడేజా రోహిత్‌ను ఔట్ చేయగా, మరో 8 బంతుల తర్వాత యువరాజ్ (4)ను తాహిర్ పెవిలియన్‌కు పంపించాడు.

ఓవరాల్‌గా ముంబై 50 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో వచ్చిన కృనాల్ మెరుగ్గా ఆడాడు. రెండో ఎండ్‌లో సూర్యకుమార్ కూడా స్థిరత్వాన్ని చూపడంతో ఇన్నింగ్స్ సాఫీగా సాగింది. వీరిద్దరు ఓవర్‌కు ఒకటి, రెండు చొప్పున బౌండరీలు బాదడంతో రన్‌రేట్ ఆరుకుపైగా నమోదైంది. 13వ ఓవర్‌లో కృనాల్ ఇచ్చిన క్యాచ్‌ను మిడాఫ్‌లో మొహిత్ జారవిడిచాడు. 13, 14 ఓవర్లలో కేవలం 8 పరుగులే వచ్చాయి. తాహిర్ వేసిన 15వ ఓవర్‌లో కృనాల్ లాంగాన్‌లో భారీ సిక్సర్ సంధించాడు. ఆఖరి బంతికి డైరెక్ట్ త్రోకు రనౌట్ నుంచి బయటపడ్డాడు. 11 నుంచి 15 ఓవర్ల మధ్య 36 పరుగులు సమకూరాయి. 17వ ఓవర్‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన కృనాల్ మూడో బంతికి ఔటయ్యాడు. దీంతో నాలుగో వికెట్‌కు 62 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఐదో బంతిని స్టాండ్స్‌లోకి పంపిన సూర్యకుమార్ 38 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. 18వ ఓవర్‌లో భారీ హిట్టింగ్‌కు ప్రయత్నించిన సూర్యకుమార్ ఆఖరి బంతికి ఔటైనా.. హార్దిక్, పొలార్డ్ పవర్ హిట్టింగ్ చేశారు. 19వ ఓవర్‌లో చెరో సిక్సర్‌తో 16 పరుగులు పిండుకున్నారు. ఆఖరి ఓవర్‌లో హార్దిక్ 6, 6, 4, 6తో 29 పరుగులు రాబట్టాడు. ఈ ఇద్దరి మధ్య ఆరో వికెట్‌కు 13 బంతుల్లో 45 పరుగులు జతయ్యాయి. ఓవరాల్‌గా తొలి 10 ఓవర్లలో 57 పరుగులే చేసిన ముంబై చివరి 10 ఓవర్లలో 113 పరుగులు సాధించి పోటీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

స్కోరు బోర్డు

ముంబై : డికాక్ (సి) జాదవ్ (బి) చాహర్ 4, రోహిత్ (సి) ధోనీ (బి) జడేజా 13, సూర్యకుమార్ (సి) జడేజా (బి) బ్రేవో 59, యువరాజ్ (సి) రాయుడు (బి) తాహిర్ 4, కృనా (సి) జడేజా (బి) శర్మ 42, హార్దిక్ నాటౌట్ 25, పొలార్డ్ నాటౌట్ 17, ఎక్స్‌ట్రాలు: 6, మొత్తం: 20 ఓవర్లలో 170/5. వికెట్లపతనం: 1-8, 2-45, 3-50, 4-112, 5-125. బౌలింగ్: దీపక్ చాహర్ 3-0-21-1, ఠాకూర్ 4-0-37-0, మొహిత్ శర్మ 3-0-27-1, తాహిర్ 4-0-25-1, జడేజా 2-0-10-1, బ్రేవో 4-0-49-1.

చెన్నై : వాట్సన్ (సి) పొలార్డ్ (బి) మలింగ 5, రాయుడు (సి) డికాక్ (బి) బెహ్రెన్‌డార్ఫ్ 0, రైనా (సి) పొలార్డ్ (బి) బెహ్రెన్‌డార్ఫ్ 16, జాదవ్ (సి) డికాక్ (బి) మలింగ 58, ధోనీ (సి) యాదవ్ (బి) హార్దిక్ 12, జడేజా (సి) డికాక్ (బి) హార్దిక్ 1, బ్రావో (సి) డికాక్ (బి) మలింగ 8, దీపక్ చాహర్ (సి) బుమ్రా (బి) హార్దిక్ 7, ఠాకూర్ నాటౌట్ 12, మొహిత్ నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు: 14, మొత్తం: 20 ఓవర్లలో 133/8. వికెట్లపతనం: 1-1, 2-6, 3-33, 4-87, 5-89, 6-108, 7-115, 8-122. బౌలింగ్: బెహ్రెన్‌డార్ఫ్ 4-0-22-2, మలింగ 4-0-34-3, హార్దిక్ 4-0-20-3, బుమ్రా 4-0-27-0, రాహుల్ చాహర్ 2-0-11-0, కృనాల్ 2-0-12-0.

3932
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles