పంత్ షో

Mon,March 25, 2019 12:49 AM

Mumbai Indians vs Delhi Capitals Defeat Mumbai Indians By 37 Runs

- ముంబైపై ఢిల్లీ విజయం
- రాణించిన ధవన్, ఇంగ్రామ్
- యువరాజ్ అర్ధసెంచరీ వృథా
- 700 ముంబై, ఢిల్లీ మధ్య పోరు ఐపీఎల్‌లో 700వ మ్యాచ్‌గా నమోదైంది.


ముంబై: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పేరుతో పాటు అదృష్టాన్ని కూడా తోడు తెచ్చుకున్నది. కొత్త ఆటగాళ్లతో సరికొత్త ప్రణాళికలతో బరిలోకి దిగి.. ఐపీఎల్-12లో బోణీ చేసింది. రిషబ్ పంత్ (27 బంతుల్లో 78 నాటౌట్; 7 ఫోర్లు, 7 సిక్సర్లు) సూపర్ షో చూపెట్టగా ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో 37 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌పై గెలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 6 వికెట్లకు 213 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆరంభంలో ముంబై బౌలర్లు చెలరేగడంతో 14 బంతుల తేడాలో పృథ్వీ షా (7), శ్రేయాస్ అయ్యర్ (16) వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. 29/2 స్కోరు వద్ద ధవన్ (36 బంతుల్లో 43; 4 ఫోర్లు, 1 సిక్స్)కు జతకలిసిన ఇంగ్రామ్ (32 బంతుల్లో 47; 7 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. సహచరుడికి సమన్వయం అందిస్తూనే కృనాల్, హార్దిక్, మెక్లీంగన్‌ను లక్ష్యంగా చేసుకుని భారీ షాట్లు కొట్టాడు. దీంతో పవర్‌ప్లేలో 45/2 స్కోరుతో ఉన్న ఢిల్లీ 10 ఓవర్లు ముగిసేసరికి 82/2కు చేరింది. కృనాల్ వేసిన 11వ ఓవర్‌లో వరుసగా మూడు ఫోర్లు బాదిన ఇంగ్రామ్.. 13వ ఓవర్‌లో మరో రెండు ఫోర్లు కొట్టి కటింగ్‌కు వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో మూడో వికెట్‌కు 83 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇంగ్రామ్ ఔట్‌తో బరిలోకి వచ్చిన రిషబ్.. తన పవర్‌లిఫ్టింగ్ షాట్లతో మ్యాచ్‌ను మరో దశకు తీసుకెళ్లాడు. 15వ ఓవర్‌లో 4, 4, 6తో 17 పరుగులు రాబట్టాడు. 16వ ఓవర్ (హార్దిక్) తొలి బంతికి ధవన్ ఔటైనా.. పంత్ చివరి మూడు బంతులను 6, 4, 6గా మల్చడంతో దెబ్బకు 18 పరుగులు వచ్చాయి. తర్వాత నాలుగు బంతుల తేడాలో పాల్ (3), అక్షర్ పటేల్ (4) నిష్క్రమించినా.. పంత్ 18 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేశాడు. బుమ్రా (18వ ) ఓవర్‌లో ఓ సిక్స్, ఫోర్‌తో 15 పరుగులు సాధించాడు. సలామ్ వేసిన 19వ ఓవర్‌లో 6, 6, 4తో 21 పరుగులు, ఆఖరి ఓవర్‌లో మరో రెండు సిక్సర్లతో 16 పరుగులు పిండుకున్నాడు. రిషబ్.. చివరి 7 ఓవర్లలో 101 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో టెవాటియా (9 నాటౌట్)తో ఏడో వికెట్‌కు 48 పరుగులు జత చేశాడు.

యువీ ఒక్కడే..

214 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై 19.2 ఓవర్లలో 176 పరుగులకే పరిమితమైంది. యువరాజ్ సింగ్ (35 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్. మూడో ఓవర్‌లో డికాక్.. బౌల్ట్ బౌలింగ్‌లో ఓ సిక్స్, రెండు ఫోర్లు బాదినా.. తర్వాతి ఓవర్‌లో రోహిత్ (14) ఔట్ కావడంతో ముంబైకి శుభారంభం దక్కలేదు. బౌల్ట్, ఇషాంత్, రబడ రెండు వైపుల నుంచి ముప్పేటా దాడి చేయడంతో ముంబై బ్యాట్స్‌మెన్ ఒత్తిడికి లోనయ్యారు. ఆరో ఓవర్‌లో ఐదు బంతుల తేడాతో సూర్యకుమార్ (2), డికాక్ ఔట్‌య్యారు. పవర్‌ప్లేలో ముంబై 46 పరుగులకే 3 వికెట్ల చేజార్చుకుంది. జరిగిన నష్టాన్ని పూడ్చే బాధ్యత తీసుకున్న యువరాజ్, పొలార్డ్ (21) వికెట్లను కాపాడుకుంటూ సింగిల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేశారు. తర్వాతి మూడు ఓవర్ల (7-9)లో 23 పరుగులు వచ్చినా.. అక్షర్ పటేల్ వేసిన 10వ ఓవర్‌లో యువీ 4, 4, 6, 4తో 20 పరుగులు పిండుకున్నాడు. ఈ ఓవర్ ముగిసేసరికి 89 పరుగులకు చేరిన ముంబైకి తర్వాతి రెండు ఓవర్లలో కోలుకోలేని దెబ్బ తగిలింది. నాలుగు బంతుల తేడాలో పొలార్డ్, హార్దిక్ పాండ్యా (0) వెనుదిరగడంతో స్కోరు 95/4గా మారింది. పొలా ర్డ్, యువీ నాలుగో వికెట్‌కు 50 పరుగులు జోడించారు. కొత్తగా వచ్చిన కృనాల్ ఉన్నంతసేపు వేగంగా ఆడాడు. ఇషాంత్ 14వ ఓవర్‌లో రెండు ఫోర్లు, ఓ సిక్స్‌తో 15 పరుగులు, తర్వాతి ఓవర్‌లో మరో రెండు బౌండరీలు బాదినా.. ఆఖరి బంతిని భారీ షాట్‌గా మల్చే ప్రయత్నంలో ఔటయ్యాడు. ఆరో వికెట్‌కు 39 పరుగుల భాగస్వామ్యం ము గిసింది. కటింగ్ (3) తొందరగా ఔటైనా.. యువీ రెండు సిక్సర్లతో చెలరేగాడు. కానీ 12 బంతు ల్లో 46 పరగులు చేయాల్సి న దశలో భారీ షాట్‌కు ప్రయత్నించి ఔట్‌కావడం తో ముం బై లక్ష్య ఛేదనలో వెనుక బడింది.

ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా (సి) డికాక్ (బి) మెక్లీంగన్ 7, ధవన్ (సి) సూర్యకుమార్ (బి) హార్దిక్ 43, అయ్యర్ (సి) పొలార్డ్ (బి) మెక్లీంగన్ 16, ఇంగ్రామ్ (సి) హార్దిక్ (బి) కటింగ్ 47, రిషబ్ నాటౌట్ 78, పాల్ (సి) డికాక్ (బి) మెక్లీంగన్ 3, అక్షర్ (సి) సలామ్ (బి) బుమ్రా 4, టెవాటియా నాటౌట్ 9, ఎక్స్‌ట్రాలు: 6, మొత్తం: 20 ఓవర్లలో 213/6.వికెట్లపతనం: 1-10, 2-29, 3-112, 4-131, 5-157, 6-165. బౌలింగ్: రసిక్ సలామ్ 4-0-42-0, మెక్లీంగన్ 4-0-40-3, బుమ్రా 4-0-40-1, హార్దిక్ 4-0-41-1, కృనాల్ 2-0-21-0, కటింగ్ 2-0-27-1.

ముంబై ఇండియన్స్: రోహిత్ (సి) టెవాటియా (బి) శర్మ 14, డికాక్ (సి) బౌల్ట్ (బి) శర్మ 27, సూర్యకుమార్ రనౌట్ 2, యువరాజ్ (సి) టెవాటియా (బి) రబడ 53, పొలార్డ్ (సి) టెవాటియా (బి) పాల్ 21, హార్దిక్ (సి అండ్ బి) పటేల్ 0, కృనాల్ (సి) టెవాటియా (బి) బౌల్ట్ 32, కటింగ్ (సి) పంత్ (బి) రబడ 3, మెక్లీంగన్ (స్టంప్) పంత్ (బి) టెవాటియా 10, రసిక్ సలామ్ నాటౌట్ 0, బుమ్రా అబ్సెంట్ హర్ట్, ఎక్స్‌ట్రాలు: 9, మొత్తం: 19.2 ఓవర్లలో 176 ఆలౌట్. వికెట్లపతనం: 1-33, 2-27, 3-45, 4-95, 5-95, 6-134, 7-153, 8-170, 9-176.బౌలింగ్: బౌల్ట్ 4-0-42-1, ఇషాంత్ శర్మ 4-0-34-2, రబడ 4-0-23-2, టెవాటియా 1.2-0-12-1, పాల్ 3-0-21-1, అక్షర్ పటేల్ 3-0-42-1.

128
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles