ముంబై మురిసెన్

Thu,May 17, 2018 01:27 AM

Mumbai Indians beat Kings XI Punjab by 3 runs

-ఉత్కంఠ పోరులో పంజాబ్‌పై విజయం
-మ్యాచ్‌ను తిప్పేసిన బుమ్రా
-రాహుల్ వీరోచిత పోరాటం వృథా
వారెవ్వా ఏం మ్యాచ్. బంతి బంతికి ఉత్కంఠ. మ్యాచ్‌కు వేదికైన వాంఖడే స్టేడియం హోరెత్తినవేళ. ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెడుతూ సాగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌నే విజయం వరించింది. గెలిస్తే గానీ లీగ్‌లో నిలదొక్కుకోలేని క్లిష్ట పరిస్థితుల్లో రోహిత్‌సేన సర్వశక్తులు ఒడ్డింది. సొంతగడ్డ వాంఖడే స్టేడియం వేదికగా పంజాబ్‌ను మట్టికరిపిస్తూ ముంబై జయకేతనం ఎగురవేసింది. కింగ్స్ పేసర్ అండ్రూ టై నాలుగు వికెట్లతో కట్టడిచేసినా..లోకేశ్ రాహుల్ మెరుపులు మెరిపించినా..దక్కిన ప్రతి అవకాశాన్ని ఒడిసిపట్టుకుంటూ ముంబై కసిగా పోరాడింది. అభిమానుల అండతో పంజాబ్‌ను చిత్తుచేస్తూ చిరస్మరణీయ విజయంతో కదంతొక్కి మూడో స్థానంలో నిలిచింది. మరోవైపు వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓటములతో పంజాబ్ ప్లేఆఫ్ అవకాశాలను క్లిష్టం చేసుకుంది.
mumbai-indians
ముంబై: పంజాబ్ విజయానికి ఆఖరి నాలుగు ఓవర్లలో 42 పరుగులు అవసరం. అప్పటికే క్రీజులో కుదురుకున్న రాహుల్, ఫించ్ జోరు చూస్తే పంజాబ్ గెలుపు నల్లేరుపై నడకే అనుకున్నారు. కానీ ఇక్కడే బుమ్రా మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఒకే ఓవర్లో ఫించ్, స్టోయినిస్‌ను ఔట్ చేసి పంజాబ్ గెలుపు ఆశలను తుంచేశాడు. మరుసటి ఓవర్‌కు దిగిన బెన్‌కట్టింగ్‌ను మూడు ఫోర్లతో దంచుతూ రాహుల్ విజయసమీకరణాన్ని మార్చాడు. మళ్లీ బౌలింగ్‌కు దిగిన మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ బుమ్రా ఈసారి రాహుల్‌ను పెవిలియన్ పంపి మ్యాచ్‌ను ముంబై వైపు మొగ్గెలా చేశాడు. ఆఖరి ఓవర్లో గెలుపునకు 17 పరుగులు కావాల్సిన క్రమంలో మెక్‌క్లీగన్ 13 పరుగులే ఇచ్చి ముంబైకి విజయాన్ని కట్టబెట్టాడు. ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ముంబై మూడు పరుగుల తేడాతో పంజాబ్‌పై గెలిచింది. ముంబై నిర్దేశించిన 187 పరుగుల లక్ష్యఛేదనలో పంజాబ్ 20 ఓవర్లలో 183/5 స్కోరు చేసింది. రాహుల్(60 బంతుల్లో 94, 10 ఫోర్లు, 3సిక్స్‌లు) అర్ధసెంచరీ వృథా అయ్యింది. బుమ్రా(3/15)కు మూడు వికెట్లు దక్కాయి. తొలుత పొల్లార్డ్(50), కృనాల్ పాండ్యా(32) రాణింపుతో ముంబై 20 ఓవర్లలో 186/8 స్కోరు చేసింది. అండ్రూ టై(4/16) నాలుగు వికెట్లతో అదరగొట్టాడు.

రాహుల్, ఫించ్ విజృంభణ: లక్ష్యఛేదనకు దిగిన పంజాబ్..ముంబై లాగే తొలి రెండు ఓవర్లు పరుగుల కోసం తడబడింది. హార్దిక్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో గేల్(18) సిక్స్, ఫోర్‌తో విరుచుకుపడితే..మంచి ఫామ్‌మీదున్న రాహుల్(27 నాటౌట్) రెండు ఫోర్లతో ఆకట్టుకోవడంతో 19 పరుగులు వచ్చాయి. అదే జోరులో కనిపించిన గేల్..మెక్‌క్లీగన్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో కట్టింగ్ క్యాచ్ ద్వారా తొలి వికెట్‌గా ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకొచ్చిన ఫించ్(14 నాటౌట్) రాహుల్ జతకలిశాడు. వీరిద్దరు కలిసి ముంబై బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ పరుగులు కొల్లగొట్టడంతో పవర్‌ప్లే అయిపోయేసరికి 57/1 స్కోరు చేసింది. వీలు చిక్కినప్పుడల్లా చెత్త బంతులను బౌండరీలకు తరలించిన రాహుల్..స్కోరుబోర్డుకు కీలక పరుగులు జతచేశాడు. ైస్ట్రెక్ రొటేట్ చేస్తూ సాగిన రాహుల్ ఈ క్రమంలో ఐపీఎల్‌లో 600 పరుగుల మార్క్ అందుకున్నాడు. మరోవైపు ఫించ్ కూడా చక్కని సహకారం అందించడంతో పంజాబ్ ఇన్నింగ్స్ ఛేదన సాఫీగా సాగింది. కృనాల్ బౌలింగ్‌లో సింగిల్‌తో ఈ సీజన్‌లో ఆరో అర్ధసెంచరీ నమోదు చేసుకున్న రాహుల్ చూడచక్కని షాట్లతో అలరించాడు. ముంబై కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఓవైపు సాధించాల్సిన లక్ష్యం అంతకంతకు పెరుగుతుండటంతో పంజాబ్‌పై ఒత్తిడి అంతకంతకు పెరుగుతూ పోయింది. ఆఖర్లో బుమ్రా మాయతో వెంటవెంటనే వికెట్లు కోల్పోయిన పంజాబ్..మ్యాచ్‌ను చేజార్చుకుంది.

టై సూపర్: తొలుత టాస్ గెలిచిన కింగ్స్ లెవెన్ పంజాబ్ కెప్టెన్ అశ్విన్..లక్ష్యఛేదన ఎంచుకున్నాడు. మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్ స్థానాల్లో యువరాజ్‌సింగ్, మనోజ్ తివారీ పంజాబ్ తుది జట్టులోకి రాగా, డుమినిని తప్పించిన ముంబై పొల్లార్డ్‌కు అవకాశమిచ్చింది. పొల్లార్డ్(50), కృనాల్‌పాండ్యా(32) బ్యాటింగ్‌తో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 186/8 స్కోరు చేసింది. అండ్రూ టై(4/16) నాలుగు వికెట్లతో అదరగొట్టాడు. తొలి రెండు ఓవర్లు తడబడ్డ ముంబై..మూడో ఓవర్లో పరుగుల వరద పారించింది. అంకిత్ రాజ్‌పుత్(1/46)ను నిర్దాక్షిణ్యంగా దునుమాడుతూ సూర్యకుమార్(27) రెండు ఫోర్లు, రెండు సిక్స్‌లతో 20 పరుగులు పిండుకున్నాడు. ఒక్కసారిగా ఊపులోకొచ్చిన ముంబైని ఆ మరుసటి ఓవర్లోనే అండ్రూ టై దెబ్బ తీశాడు. నకుల్ బంతితో లెవిస్(9)ను ఔట్ చేసి వికెట్ల ఖాతా తెరిచాడు. ఇషాన్ కిషన్(20) వచ్చి రావడంతోనే మోహిత్‌శర్మను లక్ష్యంగా చేసుకుంటూ వరుస బంతుల్లో ఓ ఫోర్, రెండు సిక్స్‌లతో చెలరేగాడు.

తనదైన శైలిలో బ్యాటును ఝులిపిస్తూ కిషన్ కొట్టిన షాట్లకు వాంఖడే స్టేడియం హోరెత్తిపోయింది. ఇక తిరుగులేదనుకున్న తరుణంలో టై మళ్లీ ముంబైని ముంచాడు. తన రెండో ఓవర్లో కిషన్‌తో పాటు సూర్యకుమార్‌ను వరుస బంతుల్లో పెవిలియన్ పంపాడు. దీంతో పవర్‌ప్లే ముగిసే సరికి ముంబై 3 వికెట్లకు 60 పరుగులు చేసింది. పంజాబ్ సహచర బౌలర్లు 4 ఓవర్లు వేసి వికెట్లేమి తీయకుండా 55 పరుగులిస్తే..రెండు ఓవర్లు వేసిన టై కేవలం 5 పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు నేలకూల్చాడు. కష్టాల్లో ఉన్న ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతాడనుకున్న కెప్టెన్ రోహిత్‌శర్మ(6)ను రాజ్‌పుత్ ఔట్ చేశాడు. పుల్‌షాట్ ఆడటానికి ప్రయత్నించిన రోహిత్..మిడ్‌ఆన్‌లో యువరాజ్‌సింగ్ చేతికి చిక్కాడు. ఈ దశలో ముంబైకి పరుగుల రాక కష్టమైంది. 30 బంతుల వరకు కనీసం ఒక్క బౌండరీ లేకపోయింది.

పోటెత్తిన పొల్లార్డ్: పరుగుల రాక కష్టమైన దశలో ఇక లాభం లేదనుకున్న కృనాల్ పాండ్యా దూకుడు కనబరిచాడు. స్టోయినిస్ వేసిన 12వ ఓవర్లో వరుసగా రెండు సిక్స్‌లు, ఫోర్‌తో విజృంభించాడు. అక్షర్‌పటేల్ బౌలింగ్‌లో సిక్స్‌కొట్టి ఊపులోకొచ్చిన పొల్లార్డ్..రాజ్‌పుత్‌ను సిక్స్, రెండు ఫోర్లతో అరుసుకున్నాడు. ముంబై గేర్ మార్చిందనుకున్న క్రమంలో స్టోయినిస్(1/43) ఆఫ్‌కట్టర్‌ను షాట్ ఆడబోయినకృనాల్..షార్ట్‌ఫైన్ లెగ్‌లో రాజ్‌పుత్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో ఐదో వికెట్‌కు 65 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అయినా వెనుకకు తగ్గని పొల్లార్డ్ వరుస బౌండరీలతో 22 బంతుల్లోనే అర్ధసెంచరీ మార్క్ అందుకున్నాడు. ఈ సీజన్‌లో తొలిసారి స్థాయిమేరకు రాణించిన పొల్లార్డ్ అర్ధసెంచరీ తర్వాత గాల్లోకి పంచ్‌లు విసురుతూ అభివాదం చేశాడు. ఇలా 15 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్లకు 151 పరుగులు చేసింది. పొల్లార్డ్ ఊపు చూస్తే ముంబై 200 పరుగులు అలవోకగా సాధిస్తుందనిపించింది.

అశ్విన్ మాయ: సహచర బౌలర్లు ధారళంగా పరుగులు ఇస్తున్న క్రమంలో స్వయంగా బౌలింగ్‌కు దిగిన అశ్విన్(2/18) అప్పటికే ప్రమాదకరంగా పరిణమించిన పొల్లార్డ్‌ను ఊరించే బంతితో బోల్తా కొట్టించాడు. ఔట్‌సైడ్ ఆఫ్‌స్టంప్ వైపు వేసిన బంతిని ఆడబోయిన పొల్లార్డ్..ఫించ్ క్యాచ్‌తో నిష్క్రమించాడు. భారీ ఆశల మధ్య క్రీజులోకొచ్చిన బెన్ కట్టింగ్(4) అశ్విన్ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. మరోవైపు టై తన జోరును కొనసాగిస్తూ హార్దిక్(9)ను పెవిలియన్ పంపాడు. ఆఖర్లో మెక్‌క్లీగన్, మార్కండే తలో బౌండరీతో ముంబైకి పోరాడే స్కోరు దక్కింది. 71 పరుగులకు 4 వికెట్లు కోల్పోయిన ముంబై..పొల్లార్డ్, కృనాల్ బ్యాటింగ్‌తో 186 పరుగుల మార్క్ అందుకుంది.

స్కోరుబోర్డు:

ముంబై: సూర్యకుమార్(సి)రాహుల్(బి)టై 27, లెవిస్(బి) టై 9, ఇషాన్ కిషన్(సి)స్టోయినిస్(బి) టై 20, రోహిత్‌శర్మ(సి)యువరాజ్‌సింగ్(బి)రాజ్‌పుత్ 6, కృనాల్ (సి)రాజ్‌పుత్(బి)స్టోయినిస్ 32, పొల్లార్డ్ (సి)ఫించ్(బి)అశ్విన్ 50, హార్దిక్(సి)అశ్విన్(బి)టై 9, కట్టింగ్(సి)అక్షర్(బి)అశ్విన్ 4, మెక్‌క్లీగన్ 11 నాటౌట్, మార్కండే 7 నాటౌట్; ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 20 ఓవర్లలో 186/8; వికెట్ల పతనం: 1-37, 2-59, 3-59, 4-71, 5-136, 6-152, 7-160, 8-170; బౌలింగ్: రాజ్‌పుత్ 4-0-46-1, మోహిత్‌శర్మ 3-0-34-0, టై 4-0-16-4, అక్షర్‌పటేల్ 3-0-24-0, అశ్విన్ 3-0-18-2, స్టోయినిస్ 3-0-43-1.

పంజాబ్: రాహుల్ (సి)కట్టింగ్(బి)బుమ్రా 94, గేల్ (సి)కట్టింగ్(బి)మెక్‌క్లీగన్ 18, ఫించ్ (సి)హార్దిక్(బి)బుమ్రా 46, స్టోయినిస్(సి)కిషన్(బి)బుమ్రా 1, అక్షర్‌పటేల్ 10 నాటౌట్, యువరాజ్(సి)లెవిస్(బి)మెక్‌క్లీగన్ 1, తివారీ 4 నాటౌట్; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 20 ఓవర్లలో 183/5; వికెట్ల పతనం: 1-34, 2-145, 3-149, 4-167, 5-172; బౌలింగ్: మెక్‌క్లీగన్ 4-0-37-2, బుమ్రా 4-0-15-3, హార్దిక్ 4-0-42-0, కృనాల్ 4-0-36-0, మార్కండే 3-0-34-0, కట్టింగ్ 1-0-15-0.
ipl-table

3097
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles