నాలుగో టైటిల్ గెలిచిన రోహిత్‌సేన

Mon,May 13, 2019 01:36 AM

-ముంబై మహాన్
-ఫైనల్లో చెన్నైపై ఉత్కంఠ విజయం
బంతి బంతికి ఆధిక్యం చేతులు మారుతూ.. టీవీల ముందు కూర్చున్న వారి గుండెల్ని చేతుల్లోకి తెస్తూ.. అభిమానులను సీట్ల అంచుల నుంచి మునివేళ్లపైకి తీసుకొస్తూ.. నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన ఐపీఎల్ ఫైనల్లో చివరకు ముంబైనే విజయం వరించింది.పెద్ద మ్యాచ్‌ల్లో ఒత్తిడిని చిత్తు చేసే అనుభవానికి తోడు.. నాకౌట్స్‌లో చెన్నైపై ఉన్న అద్వితీయ రికార్డును కాపాడుకుంటూ రోహిత్ సేన నాలుగోసారి ట్రోఫీ అందుకుంది. అచ్చొచ్చిన భాగ్యనగరంలో రోహిత్ ట్రోఫీని ముద్దాడటం ఇది రెండోసారి. ఐపీఎల్ ఫైనల్స్‌లో అద్భుత రికార్డు ఉన్న పొలార్డ్ (25 బంతుల్లో 41 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) పుట్టిన రోజునాడు మరో అద్భుత ఇన్నింగ్స్‌తో ముంబైకి పోరాడే స్కోరు అందిస్తే.. బౌలింగ్‌లో యార్కర్ కింగ్ బుమ్రా (2/14), రాహుల్ చహర్ (1/14) కట్టుదిట్టమైన బంతులతో ప్రత్యర్థిని కట్టిపడేశారు. ఛేదనలో షేన్ వాట్సన్ (59 బంతుల్లో 80; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) తుదికంటా పోరాడినా.. కీలక దశలో అతను వెనుదిరగడం చెన్నై విజయావకాశాలను దెబ్బకొట్టింది.

హైదరాబాద్‌లో ఆదివారం స్థానిక ఉప్పల్ రాజీవ్‌గాంధీ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ ఫైనల్లో ముంబై ఇండియన్స్ ఒక పరుగు తేడాతో చెన్నై సూపర్‌కింగ్స్‌పై అద్భుత విజయం సాధించింది. ఐపీఎల్ టైటిల్ గెలువడం ముంబైకి ఇది నాలుగోసారి. రోహిత్‌సేన నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యఛేదనలో చెన్నై 148/7 స్కోరుకు పరిమితమైంది. వాట్సన్(80) ఒంటరి పోరాటం వృథా అయ్యింది. తొలుత పొలార్డ్(41 నాటౌట్) రాణింపుతో ముంబై 20 ఓవర్లలో 149/8 స్కోరు అందుకుంది.

హైదరాబాద్: ఐపీఎల్‌కు ఎలాంటి ముగింపునివ్వాలో అచ్చంగా అలాంటి మ్యాచ్‌తోనే సీజన్‌కు తెరపడింది. చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో చివరకు ముంబై ఇండియన్స్‌దే పైచేయి అయింది. సీజన్‌లో చెన్నైతో ఆడిన నాలుగో మ్యాచ్‌లో నూ ముంబై అదరగొట్టంది. ఆదివారం ఉప్పల్‌లో జరిగిన ఫైనలో ముంబై ఇండియన్స్ పరుగు తేడాతో చెన్నై సూపర్‌కింగ్స్‌పై విజ యం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు చేసింది. పొలార్డ్, డికాక్ (17 బంతుల్లో 29; 4 సిక్సర్లు) రాణించారు. చెన్నై బౌలర్లలో దీపక్ చహర్ (3/26), తాహిర్ (2/23), శార్దూల్ (2/37) ఆకట్టుకున్నారు. అనంతరం లక్ష్యఛేదనలో షేన్ వాట్సన్ ఒంటరి పోరాటంతో సూపర్‌కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 148 పరుగులు చేసింది. బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. భాగ్యనగరంలో జరిగిన ఈ మ్యాచ్‌కు 32,405 మంది ప్రేక్షకులు హాజరయ్యారు.

ఓపెనింగ్ అదుర్స్

లక్ష్య ఛేదనలో చెన్నైకి మెరుగైన ఆరంభమే లభించింది. డుప్లెసిస్ (13 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్), వాట్సన్ ధాటిగా ఆడటంతో సునాయాసంగా పరుగులు వచ్చాయి. కృనాల్ ఓవర్‌లో 4,6,4తో విరుచుకుపడిన డుప్లెసిస్ మరో షాట్ కొట్టేందుకు క్రీజు వదిలి బయటికొచ్చి స్టంపౌట్ అయ్యాడు. మలింగ ఓవర్‌లో వాట్సన్ 4,6,4 కొట్టడంతో పవర్ ప్లే ముగిసేసరికి చెన్నై 53/1తో నిలిచింది. ఈ దశలో ముంబై బౌలర్లు తిరిగి జోరు పెంచడంతో పరుగుల రాక కష్టమైంది. కొన్ని ఉత్కంఠ క్షణాలను ఎదుర్కొన్న రైనా (8) చివరకు రాహుల్ చహర్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. అప్పటికే ఓ సారి క్యాచ్ ఔట్ రూపంలో అంపైర్ ఔట్‌గా ప్రకటించినా.. రివ్యూ సాయంతో బతికిపోయిన రైనా.. ఈసారి కూడా రివ్యూ కోరినా.. ఫలితం ప్రతికూలంగా వచ్చింది.

watson

ధోనీ రనౌట్..

విజయానికి 10 ఓవర్లలో 78 పరుగులు కావాల్సిన దశలో.. బుమ్రా బౌన్సర్‌కు రాయుడు (1) పెవిలియన్ బాటపట్టాడు. మరికాసేపటికి చెన్నైకి కోలుకోలేని దెబ్బ పడింది. వాట్సన్ కొట్టిన బంతికి రెండో పరుగు తీసే క్రమంలో ధోనీ (2) రనౌటయ్యాడు. దీంతో 8 ఓవర్లలో 68గా ఉన్న సమీకరణం కాస్తా.. 30 బంతుల్లో 62కి చేరింది. మలింగ 16వ ఓవర్‌లో 20 పరుగులు ఇచ్చుకున్నాడు. బ్రేవో (15) భారీ సిక్సర్ బాదితే వాట్సన్ హ్యాట్రిక్ ఫోర్లతో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక 18 బంతులు 38 పరుగులు అవసరమైన దశలో రోహిత్ సీమర్‌లకు కాకుండా కృనాల్ చేతికి బంతినిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ నిర్ణయం తప్పని తేలేందుకు ఎక్కువ సేపు పట్టలేదు. తొలి బంతికి బ్రేవో సింగిల్ తీస్తే.. ఆ తర్వాత వాట్సన్ హ్యాట్రిక్ సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు.

చివర్లో హైడ్రామా

చెన్నై విజయానికి చివరి ఓవర్‌లో 9 పరుగులు చేయాల్సిన దశలో కెప్టెన్ రోహిత్ అప్పటివరకు భారీగా పరుగులిచ్చుకున్న మలింగకు మరోసారి బంతినివ్వడం ఆశ్చర్యానికి గురిచేసినా.. ఎన్నో ఉత్కంఠ మ్యాచ్‌ల్లో బౌలిం గ్ చేసిన అనుభవం ఉన్న మలింగ 7 పరుగులే ఇచ్చి ముం బైని గెలిపించాడు. తొలి రెండు బంతులకు సింగి ల్స్ రాగా.. మూడో బంతికి డబుల్ వచ్చింది. నాలు గో బంతికి రెండో రన్‌కు యత్నించిన వాట్సన్ రనౌట్ రూపంలో వెనుదిరిగితే.. ఐదో బంతికి శార్దుల్ 2 పరుగులు తీశాడు. చివరి బంతికి యార్కర్‌తో శార్దూల్‌ను ఔట్ చేయడంతో ముంబై సంబురాల్లో మునిగిపోయింది.
maling-over2

డికాక్ సిక్సర్ల జోరు

ఐపీఎల్ ఫైనల్లో టాస్ గెలిచిన జట్టే ఎక్కువ సార్లు టైటిళ్లు నెగ్గిన అంశాన్ని దృష్టిలోపెట్టుకొని రోహిత్ శర్మ టాస్ గెలవగానే మరో ఆలోచనకు తావులేకుండా మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రెండో ఓవర్‌లో సిక్సర్‌తో రోహిత్ పరుగుల వేగాన్ని పెంచితే.. ఆ తర్వాత డికాక్ ఒకే ఓవర్‌లో మూడు సిక్సర్లు దంచాడు. ఇదే ఊపులో ఫాబ్ షాట్‌తో మరో సిక్స్ కొట్టి మరుసటి బంతికి ఔటయ్యాడు. పవర్‌ప్లే చివరి ఓవర్‌లో ముంబైకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రోహిత్ శర్మ ( 14 బంతుల్లో 15; 1 ఫోర్, 1 సిక్స్) స్లో బంతిని తప్పుగా అంచనావేసి ధోనీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 6 ఓవర్లకు ముంబై 45/2తో నిలిచింది. ఓపెనర్లు వెనుదిరగడంతో ముంబై ఇన్నింగ్స్ డీలా పడింది. సూర్యకుమార్ యాదవ్ (15), ఇషాన్ కిషన్ (23; 3 ఫోర్లు) మరీ నెమ్మదిగా ఆడటంతో పరుగుల రాక గగనమైంది.

నాలుగు ఓవర్ల పాటు ఒక్క బౌండ్రీ కూడా నమోదు కాకపోవడంతో స్కోరు నత్తనడకను తలపించింది. హర్భజన్ ఓవర్‌లను త్వరగానే ముగించేసిన ధోనీ.. పవర్ హిట్టర్‌ల కోసం ఇమ్రాన్ తాహిర్‌ను అట్టిపెట్టి ఉంచాడు. 12వ ఓవర్లో బంతినందుకున్న తాహిర్ వచ్చి రావడంతోనే తన ప్రభావం చూపాడు. రెండో బంతికే సూర్యకుమార్‌ను ఔట్ చేశాడు. కృనాల్ పాండ్యా (7) ఇలా వచ్చి అలా వెళ్లాడు. శార్దూల్ ఠాకూర్ పట్టిన అద్భుత రిటర్న్‌క్యాచ్‌కు డగౌట్ చేరాడు. ఒకసారి చేతిలోనుంచి జారిపోయిన బంతిని శార్దూల్ ఒడిసి పట్టిన విధానం ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. మరో ఎండ్‌లో నిలకడగా ఆడుతున్న ఇషాన్‌ను కూడా తాహిర్ బుట్టలో వేసుకున్నాడు. దీంతో 15 ఓవర్లు పూర్తయ్యేసరికి ముంబై 102/5తో నిలిచింది.

పొలార్డ్ నిలిచినా..

పొలార్డ్, హార్దిక్ (10 బంతుల్లో 16; 1 ఫోర్, 1 సిక్స్) క్రీజులో ఉండటంతో భారీ స్కోరు ఖాయమే అనింపించినా.. చెన్నై బౌలర్లు కట్టుదిట్టమైన బంతులేయడంతో భారీ షాట్లు ఆడటం కష్టమైంది. 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పాండ్యా ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను రైనా వదిలేశాడు. ఈ అవకాశాన్ని అతడు పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. రెండు బౌండ్రీలు కొట్టి దీపక్ చహర్ వేసిన కచ్చితమైన యార్కర్‌కు వికెట్ల ముందు దొరికిపోయాడు. తమ్ముడి రాహుల్ చహర్ (0)ను కూడా దీపక్ చహర్ ఔట్ చేశాడు. చివరి ఓవర్‌లో పొలార్డ్ క్రీజులో ఉన్నా తొలి మూడు బంతులకు ఒక్క పరుగు కూడా రాలేదు. నాలుగో బంతికి రెండో రన్‌కోసం యత్నించిన మెక్లేనగన్ (0) ఔట్‌కాగా.. చివరి రెండు బంతులకు పొలార్డ్ బౌండ్రీలు బాదడంతో ముంబై పోరాడే స్కోరు చేయగలిగింది.

ipl-mumbai
-ఐపీఎల్‌లో అత్యధిక ఔట్లలో పాలుపంచుకున్న వికెట్ కీపర్‌గా మహేంద్రసింగ్ ధోనీ నిలిచాడు. ఈ మ్యాచ్‌తో ధోనీ 132 మందిని పెవిలియన్ పంపాడు. అందులో 94 క్యాచ్‌లు, 38 స్టంపింగ్‌లు ఉన్నాయి. దినేశ్ కార్తీక్ (131)రెండో స్థానానికి చేరాడు.

-ఐపీఎల్ ఫైనల్లో ఆడిన అతిపెద్ద వయస్కుడిగా ఇమ్రాన్ తాహిర్ నిలిచాడు. 40 ఏండ్ల వయసులో తాహిర్ చెన్నై సూపర్‌కింగ్స్ తరఫున బరిలో దిగాడు.

2

ఐపీఎల్ చరిత్రలో పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్న రెండో స్పిన్నర్‌గాఇమ్రాన్ తాహిర్ నిలిచాడు. గతంలో ప్రజ్ఞాన్ ఓజా (2010లో) ఈ ఘనత సాధించాడు.

స్కోరు బోర్డు

ముంబై ఇండియన్స్: డికాక్ (సి) ధోనీ (బి) శార్దూల్ 29, రోహిత్ (సి) ధోనీ (బి) దీపక్ 15, సూర్యకుమార్ (బి) తాహిర్ 15, ఇషాన్ (సి) రైనా (బి) తాహిర్ 23, కృనాల్ (సి అండ్ బి) శార్దూల్ 7, పొలార్డ్ (నాటౌట్) 41, హార్దిక్ (ఎల్బీ) దీపక్ 16, రాహుల్ చహర్ (సి) డుప్లెసిస్ (బి) దీపక్ చహర్ 0, మెక్లెనగన్ (రనౌట్) 0, బుమ్రా (నాటౌట్) 0, ఎక్స్‌ట్రాలు: 3, మొత్తం: 20 ఓవర్లలో 149/8. వికెట్ల పతనం: 1-45, 2-45, 3-82, 4-89, 5-101, 6-140, 7-140, 8-141, బౌలింగ్: చహర్ 4-1-26-3, శార్దూల్ 4-0-37-2, హర్భజన్ 4-0-27-0, బ్రేవో 3-0-24-0, తాహిర్ 3-0-23-2, జడేజా 2-0-12-0.

చెన్నై సూపర్‌కింగ్స్: డుప్లెసిస్ (స్టంప్డ్) డికాక్ (బి) కృనాల్ 26, వాట్సన్ (రనౌట్) 80, రైనా (ఎల్బీ) రాహుల్ 8, రాయుడు (సి) డికాక్ (బి) బుమ్రా 1, ధోనీ (రనౌట్/ఇషాన్) 2, బ్రేవో (సి) డికాక్ (బి) బుమ్రా 15, జడేజా (నాటౌట్) 5, శార్దూల్ (ఎల్బీ) మలింగ 2, ఎక్స్‌ట్రాలు: 9, మొత్తం: 20 ఓవర్లలో 148/7. వికెట్ల పతనం: 1-33, 2-70, 3-73, 4-82, 5-133, 6-146, 7-148, బౌలింగ్: మెక్లెనగన్ 4-0-24-0, కృనాల్ 3-0-39-1, మలింగ 4-0-49-1, బుమ్రా 4-0-14-2, రాహుల్ 4-0-14-1, హార్దిక్ 1-0-3-0.

prize-money

ipl-runs-wickets

awards

8125
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles