ఛాంపియన్ల బిగ్‌ఫైట్‌..ప్లేఆఫ్స్‌కు రంగం సిద్ధం

Tue,May 7, 2019 04:16 PM

Mumbai eye ticket to final at happy hunting ground

చెన్నై: ఐపీఎల్‌-12 సీజ‌న్‌లో బిగ్‌ఫైట్‌కు వేళైంది. క్వాలిఫయర్‌-1లో మహేంద్ర సింగ్‌ ధోని సారథ్యంలోని చెన్నై సూపర్‌కింగ్స్‌.. రోహిత్‌ శర్మ నాయకత్వంలోని ముంబయి ఇండియన్స్ ఇవాళ రాత్రి అమీతుమీ తేల్చుకోనున్నాయి. లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్లుగా ముద్రపడ్డ ఈ రెండు టీమ్‌లు చెరో మూడుసార్లు ట్రోఫీని ముద్దాడాయి. సొంతగడ్డపై ఆడనుండటం చెన్నైకి అదనపు ప్రయోజనమైతే.. ఈ సీజన్‌లో చెన్నైతో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ పైచేయి సాధించడం ముంబైకి కొండంత బలం. ఆరంభం నుంచి ఒకే తరహా ఆటతీరుతో చెన్నై ప్లే ఆఫ్స్‌లో అడుగుపెడితే.. ప్రారంభంలో అరకోర విజయాలు సాధించినా.. రెండో సగంలో అదరగొట్టే ఆటతో రోహిత్ సేన టాప్ ప్లేస్‌తో నాకౌట్ చేరింది. ఈ సీజన్‌లో చెపాక్ స్టేడియంలో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో చెన్నై ఆరింట గెలిచిందంటే సొంతగడ్డపై సూపర్‌కింగ్స్ ఎంత బలమైన జట్టో ఊహించొచ్చు.

అన్నీ తానై..

ఈ సీజన్‌లో అన్నీ తానై నడిపిస్తున్న ధోనీనే చెన్నై ప్రధాన బలం. ప్రతీ ఆటగాడి నుంచి అత్యుత్తమ ప్రదర్శనను రాబడుతూ.. సరైన సమయాల్లో బౌలింగ్ మార్పులు, ఫీల్డింగ్ కూర్పులు, బ్యాటింగ్ మెరుపులతో క్వాలిఫయర్స్‌కు చేర్చిన మహీ ఈ మ్యాచ్‌లోనూ అదే జోరు కనబర్చాలని టీమ్ మేనేజ్‌మెంట్ ఆశిస్తున్నది. గాయం కారణంగా ధోనీ ఆడని రెండు మ్యాచ్‌ల్లోనూ చెన్నై ఓడిందంటే అతని అవసరం ఆ జట్టుకు ఎంత ఉందో అర్థమవుతున్నది. సీజన్‌లో 368 పరుగులు సాధించిన ధోనీ చెన్నై తరఫున అత్యధిక పరుగులు జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. ధోనీ మెరుస్తున్నా.. చెన్నై ప్రయాణం మాత్రం పడుతూ లేస్తూనే సాగింది. అప్పుడప్పుడు మెరుపులు తప్ప నిలకడ లోపించింది. ఓపెనర్లు వాట్సన్, డుప్లెసిస్ కొన్ని మంచి ఇన్నింగ్స్‌లు ఆడినా.. స్థిరమైన ప్రదర్శన చేయడంలో విఫలమవుతున్నారు. గత సీజన్‌లో పరుగుల వరద పారించిన తెలుగు తేజం అంబటి రాయుడు ఈ సారి అంతగా ఆకట్టుకోలేకపోతే.. ఐపీఎల్ స్టార్ సురేశ్ రైనాలో మునుపటి మెరుపులు కరువయ్యాయి. గత మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ కేదార్ జాదవ్ స్థానంలో మురళీ విజయ్, ధ్రువ్ షోరేలో ఎవరు చాన్స్ దక్కించుకుంటారో చూడాలి. బౌలింగ్ విషయంలో మాత్రం చెన్నైకి తిరుగులేదు. యువ పేసర్ దీపక్ చాహర్ (16 వికెట్లు) పవర్ ప్లేలోనే ప్రత్యర్థి నడ్డివిరిచి శుభారంభాలు అందిస్తుంటే.. తాహిర్ (21 వికెట్లు), హర్భజన్ (13 వికెట్లు), జడేజా (13 వికెట్లు) స్పిన్‌తో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఇక ఆఖరి ఓవర్లలో స్లోబాల్స్‌తో రెచ్చిపోయే బ్రేవో ఉండనే ఉన్నాడు.

ముంబయి ఇలా..

ఈ సీజన్‌లో చెన్నైతో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెల‌వ‌డం.. అందులో చెన్నైలో ఆడిన మ్యాచ్‌ కూడా ఉండడం ముంబయి ఆత్మ‌విశ్వాసాన్ని పెంచుతోంది. రోహిత్ సేన సాధించిన అత్యధిక విజయాల్లో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (380 పరుగులు)దే సింహభాగం. ఆరంభంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఓపెనర్లు రోహిత్ శర్మ (386 పరుగులు), డికాక్ (492 పరుగులు) ఫామ్ అందుకోవడం ముంబైకి సానుకూలాంశం. నిలకడగా రాణిస్తున్న సూర్యకుమార్‌తో పాటు కృనాల్ పాండ్యా, పొలార్డ్ కూడా బ్యాట్‌తో మెరిస్తే రోహిత్ సేనకు తిరుగుండదు. భారీ షాట్లు మాత్రమే కాదు భారీ ఇన్నింగ్స్‌లతోనూ అలరించగలనని నిరూపించుకున్న పాండ్యాను బ్యాటింగ్‌లో ముందుకు పంపే అవకాశాలను కొట్టిపారేయలేం. బౌలింగ్‌లో యార్కర్ కింగ్ బుమ్రా (17 వికెట్లు)తో పాటు వెటరన్ మలింగ (15 వికెట్లు) ఆకట్టుకుంటున్నారు. గతేడాది మయాంక్ మార్కండేలాగే ఈ సారి రాహుల్ చాహర్ (10 వికెట్లు) తనదైన ముద్రవేశాడు. హార్దిక్ (14 వికెట్లు)బంతితోనూ అదరగొడుతుంటే.. కృనాల్ పరుగులు నియంత్రించడంలో ముందుంటున్నాడు. వీరంతా సమిష్టిగా చెలరేగితే చెన్నైకి కష్టా లు తప్పకపోవచ్చు.

రాత్రి 7.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో..

1828
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles