చెన్నై సూపర్

Thu,April 26, 2018 02:49 AM

MS Dhoni stars as CSK beat RCB by 5 wickets

-రాయుడు, ధోనీ వీరోచిత ఇన్నింగ్స్
-తేలిపోయిన బెంగళూరు బౌలింగ్
-భారీ లక్ష్యఛేదనలో చెన్నై అద్భుత విజయం
బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో పరుగులు పోటెత్తాయి. ఇరు జట్లు బౌండరీలే లక్ష్యంగా చెలరేగడంతో స్టేడియం హోరెత్తిపోయింది. కొడితే సిక్సరే అన్న తరహాలో బ్యాట్స్‌మెన్ చెలరేగిన తీరుకు బౌలర్లు బేజారయ్యారు. బెంగళూరు నిర్దేశించిన లక్ష్యఛేదనలో అంబటి రాయుడు, ధోనీ వీరోచిత ఇన్నింగ్స్‌తో కదంతొక్కిన వేళ చెన్నై చిరస్మరణీయ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. గెలుపు ఆశలను రేకెత్తిస్తూ రాయుడు మరో సూపర్ అర్ధసెంచరీతో అదరగొడితే ధోనీ మ్యాచ్‌ను తనదైన శైలిలో ముగించాడు. పసలేని బెంగళూరు బౌలింగ్‌ను తుత్తునియలు చేస్తూ వీరిద్దరు ఆడిన ఆటకు అభిమానులు ఫిదా అయ్యారు. డికాక్, డివిలీయర్స్ అర్ధసెంచరీలతో భారీ స్కోరు అందుకున్న బెంగళూరు..బౌలింగ్‌లో తేలిపోయి మరో ఓటమిని చవిచూసింది.

బెంగళూరు: చెన్నై మళ్లీ మాయ చేసింది. ప్రత్యర్థిని పడగొడుతూ మరో అద్భుత విజయాన్ని ఒడిసిపట్టుకుంది. బుధవారం పరుగుల వరద పారిన మ్యాచ్‌లో చెన్నై 5 వికెట్ల తేడాతో బెంగళూరుపై ఘనవిజయం సాధించింది. కోహ్లీసేన నిర్దేశించిన 206 పరుగుల లక్ష్యాన్ని చెన్నై మరో 2 బంతులు మిగిలుండగానే 5 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. రాయుడు(53 బంతుల్లో 82, 3ఫోర్లు, 8సిక్స్‌లు), ధోనీ(34 బంతుల్లో 70 నాటౌట్, ఫోర్, 7సిక్స్‌లు) అర్ధసెంచరీలతో జట్టు విజయంలో కీలకమయ్యారు. చాహల్(2/26)కు రెండు వికెట్లు దక్కాయి. తొలుత డికాక్(53), డివిలీయర్స్(68) అర్ధసెంచరీలతో బెంగళూరు 20 ఓవర్లలో 205/8 స్కోరు చేసింది. శార్దుల్(2/46), తాహీర్(2/35), బ్రావో(2/33)రెండెసి వికెట్లు తీశారు. ధోనీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.

dhoni
రాయుడు, ధోనీ ధమాకా: లక్ష్యఛేదనలో చెన్నైకి తొలి ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. పవన్‌నేగి(1/17) బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయిన వాట్సన్(7) మిడ్‌ఆన్‌లో సిరాజ్ క్యాచ్‌తో ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకొచ్చిన రైనా(11)..రాయుడు(82)కు జత కలిశాడు. లీగ్‌లో సూపర్‌ఫామ్‌తో అలరిస్తున్న రాయుడు..సుందర్ బౌలింగ్‌లో వరుస బంతుల్లో సిక్స్‌లతో అలరించాడు. ఇద్దరు బౌండరీలతో రాణించడంతో చెన్నైకి పరుగుల తాకిడి పెరిగింది. ఇన్నింగ్స్ గాడిలో పడిందనుకున్న తరుణంలో రైనా పేలవషాట్‌తో పెవిలియన్ చేరాడు.

వచ్చి రావడంతోనే బౌండరీతో దూకుడు మీద కనిపించిన బిల్లింగ్స్‌ను చాహల్(2/26) బోల్తా కొట్టించాడు. ఇక ఫామ్‌లేమితో నానా తంటాలు పడుతున్న జడేజా(3)ను చాహల్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా..తనదైన శైలిలో రాయుడు ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. కెప్టెన్ ధోనీ(70 నాటౌట్) జత కలిశాడు. వీరిద్దరు బెంగళూరు బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ స్కోరుబోర్డుకు పరుగులు జతచేశారు. ముఖ్యంగా ఫామ్‌మీదున్న రాయుడు చూడచక్కని షాట్లతో అలరించాడు. చిన్నస్వామి స్టేడియం హోరెత్తెలా సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు. అండర్సన్ 16వ ఓవర్లో ఉమేశ్ యాదవ్ క్యాచ్ మిస్ చేయడంతో దక్కిన చాన్స్‌ను రాయుడు రెండు భారీ సిక్స్‌లుగా మలిచాడు. మరోవైపు ధోనీ కూడా రెచ్చిపోవడంతో లక్ష్యం అంతకంతకు కరుగుతూపోయింది. అయితే ఇన్నింగ్స్ 18వ ఓవర్లో రెండో పరుగు కోసం ప్రయత్నించిన రాయుడు రనౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో చెన్నై శిబిరంలో ఆందోళన నెలకొన్నది. అయినా ఆఖర్లో ధోనీ జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. చివరి ఓవర్లో విజయానికి 16 పరుగులు అవసరమైన దశలో బ్రావో(14 నాటౌట్) ఓ ఫోర్, సిక్స్‌తో చెలరేగితే ధోనీ సిక్స్‌తో లాంఛనాన్ని పూర్తి చేశాడు. నెగీ(1/36), ఉమేశ్(1/23) ఒక్కో వికెట్ తీశారు.

డీ ద్వయం విజృంభణ: డికాక్(53), డివిలీయర్స్(68) అర్ధసెంచరీలతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 205/8 స్కోరు నమోదు చేసింది. డికాక్‌తో కలిసి ఓపెనింగ్‌కు దిగిన కెప్టెన్ కోహ్లీ(18) అంతగా ఆకట్టుకోలేకపోయాడు. చాహర్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో 15 పరుగులతో ఊపులోకి వచ్చినట్లు కనిపించింది. కానీ ఆ మరుసటి ఓవర్లోనే శార్దుల్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన కోహ్లీ..జడేజా సూపర్ క్యాచ్‌తో తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చి రావడంతోనే మిస్టర్ 360 ఏబీ డివిలీయర్స్..హర్భజన్‌సింగ్‌ను ఉతికి ఆరేశాడు. పవర్‌ప్లే ముగిసే సరికి బెంగళూరు వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. ఇక్కణ్నుంచి బెంగళూరు ఇన్నింగ్స్ మరింత జోరు అందుకుంది. డికాక్ అండగా చెన్నై బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ డివిలీయర్స్ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. తాహీర్ ఓవర్లోనైతే ఏబీ కొట్టిన సిక్సర్ స్టేడియం బయటికి రాకెట్‌లా దూసుకెళ్లింది. ఎక్కడా తన దూకుడును తగ్గించని బెంగళూరు విధ్వంసకారుడు డివిలీయర్స్..శార్దుల్ ఠాకూర్ హ్యాట్రిక్ సిక్స్‌లతో చీల్చిచెండాడు. ఈ క్రమంలో వీరి జోరు చూస్తే బెంగళూరు అలవోకగా భారీ స్కోరు సాధ్యమే అనిపించింది. 13 ఓవర్లు ముగిసేసరికి 1 వికెట్‌కు 138 పరుగులు చేసిన కోహ్లీసేనను బ్రావో దెబ్బతీశాడు. డికాక్‌ను ఔట్ చేసిన బ్రావో రెండో వికెట్‌కు 103 పరుగుల భాగస్వామ్యాన్ని విడగొట్టాడు. ఆ తర్వాతి ఓవర్లోనే తాహీర్ స్పిన్ మాయాజాలంతో డివిలీయర్స్, అండర్సన్(2) వరుస బంతుల్లో ఔట్ కావడంతో బెంగళూరు ఒత్తిడిలో కూరుకుపోయింది. అయితే మణ్‌దీప్‌సింగ్(17 బంతుల్లో 32, ఫోర్, 3సిక్స్‌లు)మెరుపులతో ఆర్‌సీబీ మళ్లీ ఊపందుకుంది. సిక్స్‌తో మంచి దూకుడు మీద కనిపించిన మణ్‌దీప్‌ను శార్దుల్ ఔట్ చేశాడు. ఇక్కణ్నుంచి కోహ్లీసేన వరుసగా వికెట్లు కోల్పోయింది.

స్కోరుబోర్డు:

బెంగళూరు: డీకాక్(సి&బి) బ్రావో 53, కోహ్లీ(సి)జడేజా(బి)శార్దుల్ 18, డివిలీయర్స్ (సి)బిల్లింగ్స్(బి)తాహీర్ 68, అండర్సన్(సి)హర్భజన్(బి)తాహీర్ 2, మణ్‌దీప్‌సింగ్(సి)జడేజా(బి)శార్దుల్ 32, గ్రాండ్‌హోమ్(రనౌట్) 11, నెగీ(రనౌట్)0, సుందర్ 13 నాటౌట్, ఉమేశ్(సి)బిల్లింగ్స్(బి)బ్రావో 0, సిరాజ్ 0 నాటౌట్; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 20ఓవర్లలో 205/8; వికెట్ల పతనం: 1-35, 2-138, 3-142, 4-142, 5-191, 6-191, 7-192, 8-193; బౌలింగ్: చాహర్ 2-0-20-0, శార్దుల్ 4-1-46-2, హర్భజన్‌సింగ్ 2-0-24-0, జడేజా 2-0-22-0, వాట్సన్ 2-0-21-0, తాహీర్ 4-0-35-2, బ్రావో 4-1-33-2.

చెన్నై: వాట్సన్(సి)సిరాజ్(బి)నెగీ 7, రాయుడు (రనౌట్) 82, రైనా(సి)మణ్‌దీప్(బి)ఉమేశ్ 11, బిల్లింగ్స్(స్టంప్/డికాక్)(బి)చాహల్ 9, జడేజా (బి)చాహల్ 3, ధోనీ 70 నాటౌట్, బ్రావో 14 నాటౌట్; ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం:19.4 ఓవర్లలో 207/5; వికెట్ల పతనం: 1-8, 2-50, 3-59, 4-74, 5-175; బౌలింగ్: నెగీ 3-0-36-1, ఉమేశ్ 4-0-23-1, సుందర్ 1-0-14-0, సిరాజ్ 4-0-48-0, చాహల్ 4-0-26-2, అండర్సన్ 3.4-0-58-0.
ipl-table

4908
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles