
అడిలైడ్: టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీకి కెప్టెన్ కూల్ అనే పేరుంది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఏమాత్రం కంగారు పడకుండా ప్రశాంతంగా ఉంటాడన్న కారణంగా అతనికి ఆ పేరు వచ్చింది. అయితే అలాంటి ధోనీ కూడా ఈ మధ్య సహనం కోల్పోతున్నాడు. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో బౌలర్ ఖలీల్ అహ్మద్‌పై ధోనీ సీరియస్ అయ్యాడు. ధోనీ క్రీజులో ఉన్న సమయంలో ఖలీల్ డ్రింక్స్ తీసుకొచ్చాడు. అయితే అతడు తొందర్లో పిచ్‌పై పరుగెత్తుకుంటూ వచ్చాడు. అది చూసిన ధోనీ.. ఖలీల్‌పై అరిచాడు. పిచ్ బయటి నుంచి రావాలంటూ ధోనీ సూచించాడు. ఆ సమయంలో మ్యాచ్ రసవత్తరంగా ఉంది. ఇలాంటి సమయంలో పిచ్ ఎక్కడ పాడవుతుందోనన్న ఆందోళన చెందిన మిస్టర్ కూల్.. తన కూల్‌నెస్ కోల్పోయాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.