ఆక్లాండ్: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో అదిరిపోయే ఆటతో విమర్శలకు చెక్ పెట్టిన టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ.. న్యూజిలాండ్‌లో మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఇదే ఫామ్‌ను అతడు కొనసాగించగలిగితే ఐదు వన్డేల ఈ సిరీస్‌లో ఆ రికార్డును ధోనీ తిరగరాయడం ఖాయంగా కనిపిస్తున్నది. ఇన్నాళ్లూ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఆ రికార్డు ధోనీ వశమవుతుంది. న్యూజిలాండ్‌లో పది వన్డేలు ఆడిన ధోనీ.. 456 పరుగులు చేశాడు. కివీస్ గడ్డపై అత్యధిక పరుగులు చేసిన లిస్ట్‌లో ప్రస్తుతం అతడు మూడోస్థానంలో ఉన్నాడు. తొలి స్థానంలో సచిన్ టెండూల్కర్ (18 మ్యాచుల్లో 652 పరుగులు), రెండో స్థానంలో వీరేంద్ర సెహ్వాగ్ (12 మ్యాచుల్లో 598 పరుగులు) ఉన్నారు.
సచిన్‌ను అధిగమించడానికి ధోనీ మరో 197 పరుగుల దూరంలో ఉన్నాడు. 2018లో కెరీర్లోనే అత్యంత చెత్త ఫామ్‌లో ఉన్న ధోనీ.. 2019ని మాత్రం అద్భుతంగా ప్రారంభించాడు. గతేడాది 20 ఇన్నింగ్స్‌లో కేవలం 275 పరుగులు చేసిన మహి.. ఈ ఏడాది ఆడిన మూడు వన్డేల్లోనే 193 పరుగులు చేశాడు. వరుసగా మూడు హాఫ్ సెంచరీలతో అదరగొట్టాడు. రెండు మ్యాచ్‌లు గెలిపించాడు. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు న్యూజిలాండ్ సిరీస్‌లోనూ ధోనీ కీలకం కాబోతున్నాడు. బుధవారం నేపియర్‌లో ఇండియా, న్యూజిలాండ్ తొలి వన్డే జరగనుంది.