టాప్ ర్యాంక్‌కు చేరువ‌లో రికార్డుల మిథాలీ

Mon,July 17, 2017 02:40 PM

Mithali Raj on verge of becoming number one Batswoman in ICC Rankings

లండ‌న్‌: ఇండియ‌న్ వుమెన్స్ క్రికెట్ టీమ్ కెప్టెన్ మిథాలీ రాజ్ ఐసీసీ వ‌న్డే ర్యాంకింగ్స్‌లో టాప్ ర్యాంక్‌కు మ‌రింత చేరువైంది. వ‌రల్డ్‌క‌ప్‌లో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్న ఆమె.. తాజా ర్యాంకింగ్స్‌లో 774 పాయింట్ల‌తో రెండోస్థానంలో ఉంది. టాప్ ప్లేస్‌లో ఉన్న ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్ కంటే కేవ‌లం ఐదు పాయింట్లు వెనుక‌బడి ఉంది. సెమీఫైన‌ల్లో ఇదే ఆస్ట్రేలియా టీమ్‌తో భార‌త్ త‌ల‌ప‌డనున్న విష‌యం తెలిసిందే. వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఇప్పటివ‌ర‌కు ఏడు మ్యాచ్‌లు ఆడిన మిథాలీ.. 365 ర‌న్స్ చేసింది. న్యూజిలాండ్‌తో జ‌రిగిన చివ‌రి లీగ్ మ్యాచ్‌లో సెంచ‌రీతో చెల‌రేగిన మిథాలీ.. టీమ్‌ను సెమీస్‌కు చేర్చ‌డంలో కీల‌క‌పాత్ర పోషించింది.

ఈ టోర్నీలోనే వ‌న్డేల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన రికార్డును కూడా మిథాలీ అందుకున్న విష‌యం తెలిసిందే. అటు వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో వెయ్యి ప‌రుగులు చేసిన తొలి భార‌త బ్యాట్స్‌వుమ‌న్ కూడా మిథాలీనే. దీంతో పాయింట్ల ప‌రంగా ఆమె చాలా మెరుగైంది. టాప్ టెన్‌లో ఉన్న‌ ఏకైక ఇండియ‌న్ బ్యాట్స్‌వుమ‌న్ ఆమె. ఇక బౌల‌ర్ల లిస్ట్‌లో ఝుల‌న్ గోస్వామి, ఏక్తా బిస్త్ ఒక్కో స్థానం కోల్పోయి ఆరు, ఏడు స్థానాల్లో ఉన్నారు. టీమ్ ర్యాంకింగ్స్‌లో ఇండియా నాలుగోస్థానంలోనే కొన‌సాగుతుండ‌గా.. ఆస్ట్రేలియా టాప్‌లో ఉంది. ఇంగ్లండ్‌, న్యూజిలాండ్ త‌ర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

1164
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS