వ‌ర‌ల్డ్ రికార్డు చేరువ‌లో ఇండియ‌న్ కెప్టెన్‌

Wed,July 12, 2017 11:49 AM

Mithali Raj nears another World Record in Womens Cricket

లండ‌న్‌: ఇండియ‌న్ వుమెన్స్ టీమ్ కెప్టెన్ మిథాలీ రాజ్ ప్ర‌పంచ రికార్డు చేరువ‌లో ఉంది. మ‌హిళ‌ల వ‌న్డే క్రికెట్‌లో అత్య‌ధిక ప‌రుగులు సాధించిన ప్లేయ‌ర్‌గా నిల‌వ‌డానికి మిథాలీ ఇంకా 34 ప‌రుగుల దూరంలో ఉంది. ప్ర‌స్తుతం 5992 ర‌న్స్‌తో వ‌న్డేల్లో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్‌ ఎడ్వ‌ర్డ్స్ పేరిట ఈ రికార్డు ఉంది. 5959 ప‌రుగుల‌తో రెండో స్థానంలో ఉన్న మిథాలీ.. వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఆస్ట్రేలియాతో జ‌ర‌గ‌బోయే మ్యాచ్‌లో ఈ రికార్డు అందుకోవాల‌ని చూస్తున్న‌ది. అదే జ‌రిగితే ఎడ్వ‌ర్డ్స్ కంటే త‌క్కువ మ్యాచుల్లో ఈ ఘ‌న‌త సాధించిన రికార్డు కూడా మిథాలీ సొంత‌మ‌వుతుంది. 16 ఏళ్ల వ‌య‌సులో 1999లో వ‌న్డేల్లో అరంగేట్రం చేసిన మిథాలీ.. ఐర్లాండ్‌తో తొలి మ్యాచ్‌లోనే సెంచ‌రీ చేసింది. ఇప్ప‌టికీ అత్యంత పిన్న వ‌య‌సులో సెంచరీ చేసిన రికార్డు మిథాలీ పేరిటే ఉంది.

వుమెన్ క్రికెట్ స‌చిన్ టెండూల్క‌ర్‌గా మిథాలీకి పేరుంది. దానిని నిల‌బెడుతూ.. ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్‌లోకి వ‌చ్చి 18 ఏళ్ల‌వుతున్నా ఇంకా రికార్డుల‌ను బ‌ద్ధ‌లు కొడుతూనే ఉంది. ఈ మ‌ధ్యే వ‌న్డేల్లో వ‌రుస‌గా ఏడు హాఫ్ సెంచ‌రీలు చేసిన తొలి క్రికెట‌ర్‌గానూ మిథాలీ నిలిచిన విష‌యం తెలిసిందే. అంతేకాదు వ‌న్డే అరంగేట్రం చేసిన త‌ర్వాత వ‌రుస‌గా 15 ఏళ్లు ఆమె స‌గ‌టు 40పైనే ఉంది. స‌చిన్ కూడా స‌రిగ్గా ఇన్నేళ్లే 40కి పైగా స‌గ‌టుతో ప‌రుగులు చేయ‌డం విశేషం. ఇక మ‌ధ్య‌లో ఐదేళ్లు (2008-12) మిన‌హాయిస్తే 2004 నుంచి టీమ్ కెప్టెన్‌గా కొన‌సాగుతున్న‌ది మిథాలీ. 105 వ‌న్డేల్లో మిథాలీ కెప్టెన్‌గా ఉన్న‌ది. త్వ‌ర‌లోనే కెప్టెన్‌గా ఎడ్వ‌ర్డ్స్ పేరిట ఉన్న 117 వ‌న్డేల రికార్డును కూడా మిథాలీ అధిగ‌మించ‌నుంది. మిథాలీ కెప్టెన్‌గా ఉన్న‌పుడు ఇండియా 61 శాతం మ్యాచ్‌లు గెల‌వ‌గా.. ప్లేయ‌ర్‌గా కేవ‌లం 53 శాత‌మే గెలిచింది.

2119
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles