
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో లెగ్‌స్పిన్నర్ల హవా కొనసాగుతోందని భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నారు. లీగ్ ఆరంభం నుంచి వారే ఆధిపత్యం చెలాయిస్తున్నారని కపిల్ అభిప్రాయపడ్డారు. వారు ఆడుతున్న పిచ్ పరిస్థితులకు అనుగుణంగా ప్రతిఒక్కరు భిన్నమైన బౌలింగ్‌తో ప్రదర్శన చేస్తారు. లీగ్ ఆరంభం నుంచి ఇప్పటి వరకు అత్యంత విజయవంతమైన బౌలర్లు లెగ్ స్పిన్నర్లే అనే విషయం మనందరం తెలుసుకోగలిగాం. ప్రతి జట్టులో ఒక లెగ్‌స్పిన్నర్ ఉన్నాడు. ఆఖరికి సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఆఫ్ స్పిన్ కన్నా లెగ్ స్పిన్ వేయడానికే ఆసక్తి చూపిస్తున్నాడు. మిగతా వారి కన్నా లెగ్ స్పిన్నర్లే ఎక్కువ విజయవంతమయ్యారనే విషయాన్ని సూచిస్తోంది. లెగ్‌స్పిన్నర్లే ఎందుకు ఎక్కువ సక్సెస్ అవుతున్నారంటే మాత్రం కచ్చితంగా కారణమేంటో చెప్పలేం. కానీ, వాళ్లు వికెట్లు తీస్తారు. వాళ్లను అర్థంచేసుకోవడం అంత సులువైన విషయం కాదని, ప్రతి జట్టు ఒక లెగ్ స్పిన్నర్ కొనసాగించేందుకు ఇష్టపడతాయని కపిల్ పేర్కొన్నారు.