ధోనీ నుంచే కెప్టెన్సీ పాఠాలు నేర్చుకున్నా!

Tue,September 25, 2018 02:00 PM

Learned captaincy skills from MS Dhoni says Virat Kohli

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రస్తుతం జరుగుతున్న ఏషియాకప్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భార్య అనుష్క శర్మతో కలిసి షికార్లకు వెళ్తున్నాడు. పనిలోపనిగా విజ్డెన్ క్రికెట్‌కు అతడు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై అతడు స్పందించాడు. అసలు క్రికెట్ అంటే టెస్ట్ ఫార్మాటే అని కోహ్లి స్పష్టంచేశాడు. ఈ ఫార్మాట్‌ను ఐదు రోజుల నుంచి నాలుగు రోజులకు కుదించే ప్రతిపాదనను అతడు తీవ్రంగా వ్యతిరేకించాడు. టెస్ట్ క్రికెట్ బాగా ఆడితే దక్కే సంతృప్తి మరే ఇతర ఫార్మాట్‌లో ఉండదనీ విరాట్ అభిప్రాయపడ్డాడు. టెస్ట్ క్రికెట్ ఎక్కడికీ పోదని, అలాగే దానిని కుదించడం కూడా సాధ్యం కాదని కోహ్లి తేల్చి చెప్పాడు. నాలుగు రోజులకు టెస్టులను కుదించడం కూడా వెనుకడుగు వేసినట్లే అవుతుందని అతనన్నాడు. టీ20ల సంఖ్య పెరిగి పోతుండటం కొన్ని దేశాల్లో టెస్టు క్రికెట్ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయని కోహ్లి అన్నాడు.

అయితే సరైన అవగాహన ఉంటే టెస్ట్ క్రికెట్‌ను బాగా ఎంజాయ్ చేస్తారు. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లాంటి దేశాల్లో చూడండి.. టెస్టులకు భారీగా ప్రేక్షకులు వస్తారు. ఎందుకంటే అక్కడి జనాలకు గేమ్‌పై మంచి అవగాహన ఉంది అని కోహ్లి చెప్పాడు. ఇక టెస్ట్ చాంపియన్‌షిప్ రావడం కచ్చితంగా ఐదు రోజుల క్రికెట్‌కు మేలు చేస్తుందని అభిప్రాయపడ్డాడు. ఇక తన కెప్టెన్సీపై స్పందిస్తూ.. తాను కేవలం ధోనీ నుంచి మాత్రమే కెప్టెన్సీ నేర్చుకున్నానని కోహ్లి చెప్పాడు. ధోనీకి చాలా దగ్గరగా స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అతని నుంచి చాలా నేర్చుకున్నాను. ధోనీ కంటే ముందు ఎవరి నుంచీ కెప్టెన్సీ నేర్చుకోలేదు. నేను వైస్‌కెప్టెన్ కాక ముందు నుంచీ ధోనీకి నాకు తోచిన సలహాలు ఇస్తుండేవాడిని అని కోహ్లి చెప్పాడు.

4285
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles