మరో రికార్డుపై కన్నేసిన కోహ్లి..!

Sun,August 11, 2019 12:29 PM

kohli eyes on another record in odis

ట్రినిడాడ్: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి మరొక అరుదైన రికార్డుకు అత్యంత దగ్గర్లో ఉన్నాడు. వన్డేలలో వెస్టిండీస్ జట్టుపై కోహ్లి మరొక 19 పరుగులు చేస్తే చాలు, ఆ జట్టుపై ఆ ఫార్మాట్‌లో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కుతాడు. కాగా ప్రస్తుతం ఈ రికార్డు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ జావేద్ మియాందాద్ పేరిట ఉంది. అతను వన్డేలలో వెస్టిండీస్‌పై 1930 పరుగులు చేశాడు. ఇక కోహ్లి అతని వెనుక 1912 పరుగుల వద్ద ఉన్నాడు. దీంతో మరొక 19 పరుగులు చేస్తే జావేద్ మియాందాద్‌ను దాటేసి కోహ్లి ఆ రికార్డును సొంతం చేసుకుంటాడు.

కాగా వెస్టిండీస్‌పై జావేద్ మియాందాద్ వన్డేలలో 64 ఇన్నింగ్స్ ఆడి 1930 పరుగులు చేశాడు. కానీ కోహ్లి కేవలం 33 ఇన్నింగ్స్‌లోనే 1912 పరుగులు చేయడం విశేషం. ఇక మియాందాద్ తన కెరీర్‌లో చివరిసారిగా విండీస్‌తో 1993లో వన్డే ఆడాడు. దీంతో గత 26 ఏళ్లుగా ఈ రికార్డు మియాందాద్ పేరిటే ఉంది. ఈ క్రమంలో ఇవాళ విండీస్‌తో జరగనున్న రెండో వన్డేలో కోహ్లి మరో 19 పరుగులు చేసి మియాందాద్ రికార్డును అధిగమించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక విండీస్ టూర్‌లో భాగంగా గయానాలో జరగాల్సిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దు కావడంతో ఈ సిరీస్‌లో మరో 2 వన్డేలు మిగిలాయి. అందులో ఒక వన్డే ఇవాళ ట్రినిడాడ్‌లోని పోర్ట్ ఆఫ్ స్పెయిన్ క్వీన్స్ పార్క్ ఓవల్‌లో జరగనుంది. ఇక 3వ వన్డే కూడా ఇదే మైదానంలో జరగనుంది.

1253
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles