రాహుల్ ఫామ్‌పై ఆందోళన..టెస్టు ఓపెనర్‌గా రోహిత్!

Tue,September 10, 2019 02:24 PM

KL Rahuls Form a Concern, Rohit Sharma Will be Considered as Test Opener: MSK Prasad

ముంబయి: టెస్టు క్రికెట్‌లో కేఎల్ రాహుల్ ఫామ్ జట్టులో ఆందోళన కలిగిస్తోందని బీసీసీఐ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపారు. అతని స్థానంలో ఓపెనర్ రోహిత్ శర్మను తీసుకునే అవకాశాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేశారు. వెస్టిండీస్ పర్యటనలో ఆ జట్టుతో జరిగిన రెండు టెస్టులో రాహుల్ వరుసగా 44, 38, 13, 6 పరుగులతో తీవ్రంగా నిరాశపరిచాడు. ఆంటిగ్వాలో జరిగిన తొలి టెస్టులో మంచి ఆరంభం లభించినప్పటికీ వాటిని భారీ ఇన్నింగ్స్‌లుగా మలచడంలో చేతులెత్తేశాడు. జమైకా టెస్టులో దారుణంగా నిరాశపరిచాడు. రాహుల్ చివరిసారిగా ఓవల్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో సాధించిన 149 పరుగులే అత్యుత్తమం. తాను ఆడిన చివరి 12 ఇన్నింగ్స్‌ల్లో కనీసం ఒక్కసారి కూడా 50+ స్కోరు సాధించలేకపోయాడు.

'వెస్టిండీస్ టూర్ అనంతరం సెలక్షన్ కమిటీ సమావేశం కాలేదు. తర్వాత జరిగే టీమ్ సెలక్షన్ సమావేశాల్లో రోహిత్ శర్మను ఓపెనర్‌గా తీసుకోవాలనే ప్రతిపాదనను తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటాం. రాహుల్ ప్రతిభగల ఆటగాడు. ప్రస్తుతం టెస్టు క్రికెట్‌లో అతడు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. వికెట్‌పై ఎక్కువ సమయం కేటాయిస్తూ తిరిగి ఫామ్, టచ్‌లోకి రావాల్సిన అవసరం ఉంది' అని ప్రసాద్ పేర్కొన్నారు. 'టెస్టుల్లో ఓపెనర్‌గా రోహిత్‌ను తీసుకోవాలని నేను గతంలోనే సూచించాను. అతనికొక అవకాశం ఇవ్వాలని నేనిప్పటికీ గట్టిగా నమ్ముతున్నాను. టెస్టుల్లో ఓపెనర్‌గా అతడు సరిగ్గా సరిపోతాడని' భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే.

విండీస్ టూర్‌లో హైదరాబాదీ యువ క్రికెటర్ హనుమ విహారి తనకు వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కఠినమైన పిచ్‌లపై అద్భుత పోరాటం చేసి సెంచరీ, అర్ధశతకాలతో విజృంభించాడు. రాహుల్‌తో ఓపెనర్‌గా బరిలో దిగిన అంతగా అనుభవంలేని మయాంక్ అగర్వాల్ ఫర్వాలేదనిపించాడు. అతనికి మరికొన్ని అవకాశాలు ఇస్తే నిలదొక్కుకొని సత్తాచాటగలడని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. చాలా రోజుల నుంచి టెస్టు జట్టులో చోటు దక్కించుకుంటున్న రాహుల్ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలోనే పరిమిత ఓవర్ల క్రికెట్లో ఓపెనర్‌గా గొప్ప రికార్డుతో పాటు విశేషానుభవం కలిగిన హిట్‌మ్యాన్‌ను తీసుకోవాలని సూచిస్తున్నారు.

1179
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles