రఫ్పాడించిన రస్సెల్

Thu,May 24, 2018 12:44 AM

-క్వాలిఫయర్-2కు కోల్‌కతా
-ఎలిమినేటర్‌లో రాజస్థాన్‌పై గెలుపు
-శామ్సన్, రహానే శ్రమ వృథా

20 ఓవర్లు.. 170 పరుగుల లక్ష్యం.. ఓ దశలో రాజస్థాన్ జట్టు స్కోరు 109/1. గెలువాలంటే 35 బంతుల్లో 69 పరుగులు చేయాలి.. చేతిలో 9 వికెట్లు.. క్రీజులో రహానే, శామ్సన్.. కానీ ఏం లాభం. కోల్‌కతా బౌలర్ల నైపుణ్యం ముందు రాజస్థాన్ బడా హిట్టర్లందరూ దూది పింజల్లా తేలిపోయారు. అటు భారీ షాట్లు కొట్టలేక.. ఇటు పరుగులు తీయలేక చతికిలపడ్డారు. హైదరాబాద్, చెన్నై మ్యాచ్ ఆఖరి మూడు ఓవర్ల సీన్‌ను తలపించినట్లుగా సాగిన తుది అంకంలో రాజస్థాన్ 43 పరుగులు చేయలేకపోయింది. ఫలితంగా గెలుపు దరిదాపుల్లోకి వచ్చి ఎలిమినేట్ అయ్యింది. మరోవైపు బ్యాటింగ్‌లో టాప్ విఫలమైనా.. రస్సెల్ రఫ్పాడించడంతో కోల్‌కతా.. ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్నే నిర్దేశించింది. బౌలింగ్‌లో సమిష్టిగా రాణించి.. క్వాలిఫయర్-2లో సన్‌రైజర్స్‌తో అమీతుమీకి సిద్ధమైంది.

కోల్‌కతా: లీగ్ దశ నుంచి నిలకడైన విజయాలు సాధిస్తున్న కోల్‌కతా నాకౌట్‌లోనూ ఆకట్టుకుంది. ఆల్‌రౌండ్ షోతో అదురగొడుతూ కీలక మ్యాచ్‌లో సత్తా చూపెట్టింది. రస్సెల్ (25 బంతుల్లో 49 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) వీరవిహారానికి తోడు కెప్టెన్ దినేశ్ కార్తీక్ (38 బంతుల్లో 52; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో.. బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో 25 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌పై గెలిచింది. ముందుగా కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్లకు 169 పరుగులు చేసింది. తర్వాత రాజస్థాన్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 144 పరుగులకే పరిమితమైంది. శామ్సన్ (38 బంతుల్లో 50; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీ చేసినా.. రహానే (41 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగినా ప్రయోజనం లేకపోయింది. రస్సెల్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

టాప్ విఫలం

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు ఓపెనర్లు నరైన్ (4), లిన్ (18) శుభారంభాన్నివ్వలేకపోయారు. రాజస్థాన్ బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్‌కు కట్టుబడటంతో కేకేఆర్ టాప్ ఆర్డర్ పరుగులు చేయడంలో ఘోరంగా విఫలమైంది. తొలి బంతిని బౌండరీ లైన్ దాటించిన నరైన్.. రెండో బంతికి స్టంపౌటయ్యాడు. భారీ అంచనాలతో దిగిన ఉతప్ప (3) కూడా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దలేకపోయాడు. ఓవైపు స్పిన్నర్, మరోవైపు పేసర్ చేసిన ఎదురుదాడిలో 10 బంతుల వ్యవధిలో ఉతప్ప, రానా (3) పెవిలియన్‌కు చేరడంతో కోల్‌కతా 24 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. లిన్‌తో జతకలిసిన కార్తీక్ వచ్చిరావడంతో బౌండరీలు బాదడంతో పవర్‌ప్లేలో కోల్‌కతా స్కోరు 46/3కి చేరింది. ఈ దశలో స్పిన్నర్ గోపాల్ ఝలక్ ఇచ్చాడు. అవుట్‌సైడ్ ఆఫ్ బంతితో లిన్‌ను కాటన్ బౌల్డ్ చేశాడు. శుభ్‌మన్ గిల్ (17 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్), కార్తీక్ వికెట్లను కాపాడుకోవడానికి ప్రాధాన్యమివ్వడంతో 10 ఓవర్లలో కోల్‌కతా 4 వికెట్లకు 63 పరుగులు చేసింది. రన్‌రేట్ 6.3. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లకు తోడుగా అప్పుడప్పుడు పేసర్లను తీసుకొచ్చిన రహానే కొత్త వ్యూహాన్ని అమలు చేయడంతో రన్‌రేట్ బాగా మందగించింది. ఓవర్‌కు 9, 4, 6 పరుగులే రావడంతో ఒత్తిడి పెరిగింది.

దీని నుంచి బయటపడేందుకు గోపాల్ వేసిన 14వ ఓవర్‌లో గిల్.. ఓ ఫోర్, రెండు భారీ సిక్సర్లు కొట్టి ఉపశమనం పొందాడు. జట్టు స్కోరు 100 దాటింది. కానీ తర్వాతి ఓవర్‌లోనే ఆర్చర్ (2/33)కు వికెట్ సమర్పించుకున్నాడు. ఈ ఇద్దరి మధ్య 6.2 ఓవర్లలో 55 పరుగులు జతయ్యాయి. 106/5 స్కోరు వద్ద క్రీజులోకి వచ్చిన రస్సెల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఎదుర్కొన్న నాలుగో బంతినే స్టాండ్స్‌లోకి పంపి జోరు మొదలుపెట్టాడు. అప్పటివరకు నిలకడగా ఆడిన కార్తీక్ కూడా బ్యాట్ ఝుళిపించడంతో పరుగులు వేగంగా వచ్చా యి. 17వ ఓవర్‌లో చెరో సిక్సర్, ఫోర్ బాది 19 పరుగులు పిండుకున్నారు. కానీ 18వ ఓ వర్ తొలి బంతికి కార్తీక్ ఔట్‌కావడంతో ఆరో వికెట్‌కు 29 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాతి ఐదు బంతుల్లో రస్సెల్ రెండు సిక్సర్లు, తర్వాతి ఓవర్ ఆర్చర్‌కు మరో సిక్సర్ రుచి చూపెట్టాడు. ఏడో వికెట్‌కు సీరెల్స్ (2)తో 15 బంతుల్లో 29 పరుగులు జోడించడంతో కేకేఆర్ మంచి స్కోరు సాధించింది.

చెలరేగిన శామ్సన్: భారీ లక్ష్యం కండ్లముందున్నా.. రాజస్థాన్ ఓపెనర్లు రహానే, త్రిపాఠి (13 బంతుల్లో 20; 1 ఫోర్, 2 సిక్సర్లు) మెరుగైన ఆరంభాన్నిచ్చారు. ముఖ్యంగా ఉన్నంతసేపు వేగంగా ఆడిన త్రిపాఠి భారీ సిక్సర్లతో రెచ్చిపోయాడు. ఈ క్రమంలో 5 ఓవర్లలోనే జట్టు స్కోరును 47 పరుగులకు చేర్చాడు. కానీ దురదృష్టవశాత్తు ఆరో ఓవర్‌లో బంతిని డిఫెన్స్ చేయబోయి కాటన్ బౌల్డ్ అయ్యాడు. పవర్‌ప్లేలో రాజస్థాన్ 51/1 స్కోరు చేసింది. వన్‌డౌన్‌లో వచ్చిన శామ్సన్ .. రహానేకు చక్కని సహకారం అందించాడు. స్ట్రయిక్ రొటేట్ చేస్తూనే అడపాదడపా బౌండరీలు బాదుతూ రన్‌రేట్ తగ్గకుండా చూశారు. ఈ జోడీని విడదీసేందుకు కార్తీక్ బౌలర్లను మార్చిమార్చి ప్రయోగించినా ప్రయోజనం లేకపోయింది. 12.3 ఓవర్లలో రాజస్థాన్ 100 పరుగుల మైలురాయిని చేరింది. నిలకడగా సాగుతున్న రాజస్థాన్‌ను కుల్దీప్ దెబ్బకొట్టాడు. 15వ ఓవర్‌లో రహానేను ఔట్ చేసి రెండో వికెట్‌కు 62 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. ఇక క్లాసెన్ (18 నాటౌట్)తో కలిసి జట్టును గెలిపించే బాధ్యత తీసుకున్న శామ్సన్ భారీ షాట్లకు తెరలేపాడు. కానీ 37 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తయిన తర్వాత చావ్లా బంతికి భారీ షాట్ కొట్టే క్రమంలో సీరెల్స్ చేతికి చిక్కాడు. ఇక 18 బంతుల్లో 43 పరుగులు చేయాల్సిన దశలో బిన్నీ (0) ఔట్‌కావడంతో విజయసమీకరణం 12 బంతుల్లో 40 పరుగులుగా మారింది. కానీ రస్సెల్, కృష్ణ మెరుగ్గా బౌలింగ్ చేయడంతో చివరి రెండు ఓవర్లలో 14 పరుగులు మాత్రమే రావడంతో రాజస్థాన్‌కు ఓటమి తప్పలేదు.

స్కోరు బోర్డు

కోల్‌కతా నైట్‌రైడర్స్: నరైన్ (స్టంప్) క్లాసెన్ (బి) గౌతమ్ 4, లిన్ (సి అండ్ బి) గోపాల్ 18, ఉతప్ప (సి అండ్ బి) గౌతమ్ 3, రానా (సి) ఉనాద్కట్ (బి) ఆర్చర్ 3, కార్తీక్ (సి) రహానే (బి) లాగ్లిన్ 52, శుభ్‌మన్ గిల్ (సి) క్లాసెన్ (బి) ఆర్చర్ 28, రస్సెల్ నాటౌట్ 49, సీరెల్స్ (సి) ఆర్చర్ (బి) లాగ్లిన్ 2, చావ్లా నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు: 10, మొత్తం: 20 ఓవర్లలో 169/7. వికెట్లపతనం: 1-4, 2-17, 3-24, 4-51, 5-106, 6-135, 7-164. బౌలింగ్: గౌతమ్ 3-0-15-2, ఆర్చర్ 4-0-33-2, ఉనాద్కట్ 2-0-33-0, సోధీ 4-0-15-0, గోపాల్ 4-0-34-1, లాగ్లిన్ 3-0-35-2.

రాజస్థాన్ రాయల్స్: రహానే (సి అండ్ బి) కుల్దీప్ 46, త్రిపాఠి (సి అండ్ బి) చావ్లా 20, శామ్సన్ (సి) సీరెల్స్ (బి) చావ్లా 50, క్లాసెన్ నాటౌట్ 18, బిన్నీ (సి) లిన్ (బి) కృష్ణ 0, గౌతమ్ నాటౌట్ 9, ఎక్స్‌ట్రాలు: 1, మొత్తం: 20 ఓవర్లలో 144/4. వికెట్లపతనం: 1-47, 2-109, 3-126, 4-130. బౌలింగ్: రస్సెల్ 3-0-22-0, కృష్ణ 4-0-28-1, చావ్లా 4-0-24-2, నరైన్ 4-0-39-0, కుల్దీప్ 4-0-18-1, సీరెల్స్ 1-0-13-0.

2377
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles