ముంబయి మూడో‘సారీ..’ ఓటమి

Sat,April 14, 2018 07:59 PM

Jason Roy's carnage guides DD to first win in IPL 2018ముంబయి: ఐపీఎల్-11 సీజన్‌లో ముంబయి ఇండియన్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. శనివారం సొంతగడ్డపై ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లోనూ మరో ఓటమిని ఎదుర్కొంది. దీంతో సీజన్‌లో ముంబయికిది వరుసగా మూడో ఓటమి. ఛేద‌న‌లో గంభీర్ సేన మూడు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. రోహిత్ సేన‌పై 7 వికెట్ల తేడాతో గెలుపొందిన ఢిల్లీ బోణీ కొట్డింది. ఓపెనర్ జాసన్ రాయ్(91: నాటౌట్ 53 బంతుల్లో 6ఫోర్లు, 6సిక్సర్లు) అసాధారణ ఇన్నింగ్స్, యువ సంచలనం రిషబ్ పంత్(47: 25 బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సర్లు) రాణించడంతో ఢిల్లీ అలవోకగా విజయం సాధించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి ఢిల్లీకి 195 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. సూర్యకుమార్ యాదవ్(53: 32 బంతుల్లో 7ఫోర్లు సిక్స్), ఎవిన్ లెవిస్(48: 28 బంతుల్లో 4ఫోర్లు, 4సిక్సర్లు), యువ కెరటం ఇషాన్ కిషన్(44: 23 బంతుల్లో 5ఫోర్లు, 2సిక్సర్లు) దంచికొట్టడంతో 20 ఓవర్లలో 7వికెట్లకు ముంబయి 194 పరుగులు చేసింది. కానీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ బ్యాట్స్‌మెన్ ముందు ముంబయి బౌలర్లు తేలిపోయారు.

ముంబయి బౌలర్లలో కృనాల్ పాండ్య(2/21) మినహా మిగతా బౌలర్లంతా ఆకట్టుకోలేకపోయారు. ఢిల్లీ బ్యాట్స్‌మెన్ విధ్వంసాన్ని కట్టడిచేయలేక ధారళంగా పరుగులిచ్చారు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి ఢిల్లీ ఆటగాళ్లు విజృంభించి ఆడటంతో ఎలాంటి తడబాటు లేకుండానే లక్ష్యాన్ని ఛేదించారు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబయికి ఓపెనర్లు మంచి శుభారంభం అందించారు. తొలి ఓవర్ నుంచి వేగంగా ఆడటం ప్రారంభించారు. ఆరంభం నుంచి రన్‌రేట్ పడిపోకుండా జాగ్రత్తగా ఆడి లక్ష్యం వైపు దూసుకెళ్లింది. ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడుతూ ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఆరు ఓవర్లు ముగిసేసరికి 84 పరుగులు సాధించింది. రోహిత్ శర్మ స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన సూర్యకుమార్ యాదవ్ బౌండరీల వర్షం కురిపించాడు. ఐపీఎల్‌లో ఓపెనర్‌గా బరిలో దిగడం కుమార్‌కు ఇదో తొలిసారి.

మరో ఓపెనర్ ఎవిన్ లెవిస్ దూకుడుగా ఆడుతున్న లెవిస్ రాహుల్ తెవాటియా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అనంతరం కొద్దిసేపటికే మాక్స్‌వెల్ బౌలింగ్‌లో రెండు పరుగులు సాధించి సూర్యకుమార్ 29 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్ కెరీర్‌లో అతనికిది రెండో ఆఫ్‌సెంచరీ. తెవాటియా తరువాతి ఓవర్‌లో కుమార్ ఎల్బీగా వెనుదిరిగాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో ఢిల్లీకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ దశలో పుంజుకున్న బౌలర్లు ధాటిగా బౌలింగ్ చేశారు. ఇషాన్ కిషన్ మినహా కెప్టెన్ రోహిత్ శర్మ(18), పొలార్డ్(0), కృనాల్ పాండ్య(11) చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేకపోయారు. ఢిల్లీ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, డేనియల్ క్రిష్టియన్, రాహుల్ తెవాటియా తలో రెండు వికెట్లు పడగొట్టారు.

3651
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles