వ‌ర‌ల్డ్‌ కప్ : ఇంగ్లాండ్‌ స్కోరు 386

Sat,June 8, 2019 07:03 PM

Jason Roy, Jos Buttler Power England To 386  Against Bangladesh

కార్డిఫ్: వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ బ్యాటింగ్ అంచనాలకు తగ్గట్లుగా సాగింది. ఊహించినట్లుగానే 350పైకి స్కోరు సాధించింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ మైదానంలో పరుగుల సునామీ సృష్టించారు. స్కోరు 350 దాటిందంటే అది జేసన్ రాయ్ పుణ్యమే. జేసన్ రాయ్(153: 121 బంతుల్లో 14ఫోర్లు, 5సిక్సర్లు), జానీ బెయిర్‌స్టో(51: 50 బంతుల్లో 6ఫోర్లు), జోస్ బట్లర్(64: 44 బంతుల్లో 2ఫోర్లు, 4సిక్సర్లు) తమదైన శైలిలో రెచ్చిపోవడంతో 50 ఓవర్లలో ఇంగ్లాండ్ 6 వికెట్లకు 386 పరుగులు చేసింది. రాయ్‌కి ఇది తొలి వరల్డ్ కప్ సెంచరీ కాగా.. వన్డేల్లో మొత్తంగా తొమ్మిదివది. బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన ఆతిథ్య జట్టును బంగ్లాదేశ్ బౌలర్లు ఏదశలోనూ కట్టడి చేయలేకపోయారు. వికెట్లు తీసినప్పటికీ కీలక సమయంలో భాగస్వామ్యాలు విడదీయకపోవడంతో భారీ మూల్యమే చెల్లించుకున్నారు. బ్యాట్స్‌మెన్ తలో చేయి వేసి వీరవిహారం చేయడంతో భారీ స్కోరు చేసింది. బంగ్లా బౌలర్లలో మెహిదీ హసన్, మహమ్మద్ సైఫుద్దీన్ చెరో రెండు వికెట్లు తీయగా.. మొర్తజా, ముస్తాఫిజుర్ రహీమ్ తలో వికెట్ దక్కించుకున్నారు. కెప్టెన్ మొర్తజా మినహా అందరూ ధారళoగా పరుగులిచ్చుకున్నారు.


టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌కు ఓపెనర్లు రాయ్, బెయిర్‌స్టో జట్టుకు అదిరే ఆరంభం ఇచ్చారు. తొలి 4 ఓవర్లకు ఇంగ్లాండ్ స్కోరు కేవలం 9 పరుగులే. కానీ క్రీజులో కుదురుకున్నాక స్కోరు బోర్డు జెట్‌వేగంతో దూసుకెళ్లింది. మొర్తజా వేసిన ఆరో ఓవర్‌లో రాయ్ రెండు ఫోర్లు బాది ఇన్నింగ్స్‌కు ఊపుతీసుకొచ్చాడు. తర్వాత వేగంగా బ్యాట్ ఝుళిపిస్తూ రన్‌రేట్ 6కు తగ్గకుండా జాగ్ర‌త్త‌గా ఆడారు. 12వ ఓవర్లో రాయ్ వరుసగా సిక్స్, ఫోర్ కొట్టి 11 పరుగులు రాబట్టాడు. ఇదే ఓవర్లో అర్థశతకం కూడా పూర్తి చేసుకున్నాడు. 12 ఓవర్లకు ఇంగ్లాండ్ స్కోరు 87.


మైదానం నలువైపులా బౌండరీలు బాదిన జోడీ వెనువెంటనే అర్ధశతకాలు పూర్తి చేసుకుంది. జట్టుకు బలమైన పునాది వేసిన ఈ జంటను 20వ ఓవర్లో మొర్తజా విడదీశాడు. ఆ ఓవర్ తొలి బంతిని బెయిర్‌స్టో షాట్ ఆడగా తక్కువ ఎత్తులో వెళ్లిన బంతిని మెహిదీ హసన్ అద్బుత క్యాచ్‌కు బెయిర్‌స్టో వెనుదిరిగాడు. ఒక వికెట్ దక్కడంతో బంగ్లా ఊరట లభించింది. అనంతరం ఏ దశలోనూ స్కోరు వేగం తగ్గలేదు. వరుస విరామాల్లో ఆతిథ్య బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్ పంపడంలో విఫలమయ్యారు. ముస్తాఫిజుర్ వేసిన 27వ ఓవర్‌లో ఫోర్ బాదిన రాయ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేవలం 92 బంతుల్లోనే 100 మార్క్ అందుకున్నాడు. సైఫుద్దీన్ బౌలింగ్‌లో రూట్ వెనుదిరగ్గా.. బట్లర్, రాయ్ స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. ఇంగ్లీష్ ఇన్నింగ్స్‌లో రాయ్ బ్యాటింగే హైలెట్. మెహిదీ హసన్ వేసిన 35వ ఓవర్లో వరుసగా మూడు సిక్సర్లు బాది ప్రేక్షకులను అలరించాడు. హ్యాట్రిక్ సిక్సర్లు బాదిన తర్వాతి బంతికే రాయ్ వెనుదిరిగాడు. ఆఖర్లో ఇయాన్ మోర్గాన్(35: 33 బంతుల్లో 1ఫోర్, 2సిక్సర్లు) వేగంగా ఆడే క్రమంలో వికెట్ చేజార్చుకున్నాడు. ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్(6) ఔటై నిరాశపరిచాడు. చివరి ఓవర్లలో టెయిలెండర్లు ప్లంకెట్(27 నాటౌట్), క్రిస్ వోక్స్(18) ఎడాపెడా బాది ఇన్నింగ్స్‌ను ఘ‌నంగా ముగించారు.

5957
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles