మ్యాచ్ ఓడినా ఆ అభిమానులు మనసు గెలుచుకున్నారు!

Tue,July 3, 2018 11:03 AM

రొస్తోవ్ ఆన్ డాన్: సాధారణంగా ఏ ఆటయినా తమ టీమ్ ఓడిపోతే అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. అందులోనూ ఫుట్‌బాల్ అంటే ఈ అభిమానం కాస్త ఎక్కువే ఉంటుంది. ఒక్కోసారి హద్దులు కూడా దాటి ప్రత్యర్థులపై దాడులు కూడా చేసుకున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. అయితే రష్యాలో జరుగుతున్న వరల్డ్‌కప్‌లో మాత్రం జపాన్ అభిమానులు.. ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. సోమవారం బెల్జియంతో జరిగిన మ్యాచ్‌లో జపాన్ ఓడిపోయి ఇంటిదారి పట్టింది. ఈ ఓటమి ఆ టీమ్ అభిమానులను నిరాశకు గురిచేసినా.. వాళ్లు తమ బాధ్యతను మాత్రం మరచిపోలేదు. మ్యాచ్ ముగియగానే ఎప్పటిలాగే స్టేడియంలో ఉన్న చెత్తను మొత్తం శుభ్రం చేసి వెళ్లారు.
జపాన్ అభిమానులు తమ టీమ్ ఆడిన ప్రతి మ్యాచ్ తర్వాత ఇలా స్టేడియాలను శుభ్రం చేయడం చూసి చాలా మంది వాళ్లను అభినందించకుండా ఉండలేకపోతున్నారు. మిగతా వాళ్లు కూడా ఇలా ఎందుకు చేయకూడదు అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. తమ బాధ్యతను పక్కాగా నెరవేర్చడంలో మిగా దేశాల కంటే జపాన్ వాసులు ఎప్పుడూ ముందే ఉంటారు. జపాన్ పౌరుల క్రమశిక్షణ ప్రపంచాన్ని మెప్పిస్తున్నది. సోమవారం జరిగిన మ్యాచ్‌లోనూ 52 నిమిషాల వరకు 2-0తో ఆధిక్యంలో ఉన్నా.. చివరికి 2-3తో బెల్జియం చేతిలో జపాన్ ఓడిపోయింది. ఈ ఓటమి తాలూకు బాధ వేధిస్తున్నా.. అభిమానులు ఎప్పటిలాగే తమ బాధ్యతను నిర్వర్తించి అక్కడి నుంచి వెళ్లిపోవడం నెటిజన్ల మనసు గెలుచుకుంటున్నది.

2151
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles