పాపం.. యువరాజ్‌ని పట్టించుకోని ఫ్రాంఛైజీలు!

Tue,December 18, 2018 03:33 PM

IPL Auction 2019 Live Updates straight from Jaipur

జైపూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2019 క్రికెటర్ల వేలానికి రంగం సిద్ధమైంది. జైపూర్‌లో మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు వేలం ప్రారంభమైంది. 13దేశాలకు చెందిన ఆటగాళ్లు ఈ వేలంలో పాల్గొంటున్నారు. ఈసారి వేలం ప్రక్రియను హ్యూస్ ఎడ్ మెయిడాస్ నిర్వహిస్తున్నారు.ఆ ఇద్దరు కోట్లు కొల్లగొట్టారు..!

ఐపీఎల్ వేలంలో ఇద్దరు విదేశీ క్రికెటర్లు కోట్లు కొల్లగొట్టారు. తొలిసారి ఐపీఎల్ ఆడేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్న శామ్ కుర్రన్‌పై కనకవర్షం కురిసింది. రూ.7.2కోట్లకు పంజాబ్ దక్కించుకుంది. అత్యధిక ధర పలికి విదేశీ క్రికెటర్‌గా నిలిచాడు. కొలిన్ ఇంగ్రామ్ కోసం హైదరాబాద్ పోటీపడినప్పటికీ ఢిల్లీ రూ.6.4 కోట్లకు సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్స్ షాన్ మార్ష్, ఉస్మాన్ ఖవాజా కోసం ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపలేదు.

అమ్ముడుపోని ఆండ‌ర్స‌న్‌..!

అలాగే సౌతాఫ్రికా బ్యాట్స్‌మన్ హషీమ్ ఆమ్లా, భారత క్రికెటర్ సౌరభ్ తివారీకి నిరాశ తప్పలేదు. లంక ఏంజెలో మాథ్యూస్, కివీస్ ఆల్‌రౌండర్ కోరే ఆండర్సన్ అమ్ముడుపోలేదు. సౌతాఫ్రికా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ హెన్రిచ్ క్లాసెన్‌ను రూ.50లక్షలకు చేజిక్కించుకుంది. పేసర్ బరిందర్ సరన్(కనీస ధర రూ.50లక్షలు)ను ముంబయి రూ.3.4కోట్లకు కొనుగోలు చేసింది. ఇండియన్ సీనియర్ ఫాస్ట్‌బౌలర్ వినయ్‌కుమార్‌పై ఎవరూ ఆసక్తి ప్రదర్శించలేదు. కివీస్ ఫాస్ట్ బౌలర్ లూకీ ఫర్గూసన్‌ను కోల్‌కతా రూ.1.6కోట్లకు దక్కించుకుంది. సౌతాఫ్రికా స్పీడ్‌స్టర్ డేల్‌స్టెయిన్‌కు నిరాశ తప్పలేదు.

మిస్టరీ స్పిన్నర్ వరుణ్ @ 8.4కోట్లు

ఆల్‌రౌండర్ శివమ్ దుబే(కనీస ధర రూ.20లక్షలు) కోసం ఫ్రాంఛైజీలు పోటీ పడ్డాయి. ఇప్పటి వరకు ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడని శివమ్ కోసం బెంగళూరు రూ.5కోట్లకు చేజిక్కించుకుంది. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కోసం ఫ్రాంఛైజీలు తీవ్రంగా పోటీకి దిగాయి. కనీస ధర రూ.20లక్షలతో వేలంలోకి వచ్చిన వరుణ్ అనూహ్య ధర పలికాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్(టీఎన్‌పీఎల్)లో విశేషంగా రాణించడంతో అతడి కోసం ఫ్రాంఛైజీలు మొగ్గుచూపాయి. దేశవాళీ ఆటగాడిని ఆఖరికి పంజాబ్ రూ.8.4కోట్లకు దక్కించుకుంది.

వాళ్ల‌కు నిరాశే..!

దేవ్‌దత్ పడిక్కల్‌ను రూ.20లక్షలకు బెంగళూరు సొంతం చేసుకుంది. గత సీజన్లలో ఆడిన సచిన్ బేబీ, మనన్ వోహ్రా, అంకిత్ బవానేలపై ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపలేదు. అన్‌మోల్‌ప్రీత్ సింగ్‌ను ముంబయి రూ.80లక్షలకు దక్కించుకుంది. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో సత్తాచాటిన యువ క్రికెటర్ అర్మాన్ జాఫర్‌కు నిరాశే ఎదురైంది. చాలా ఏళ్ల పాటు బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించిన సర్ఫరాజ్ ఖాన్‌ను కేవలం రూ.25లక్షలకే ఈసారి పంజాబ్ సొంతం చేసుకుంది. ఆయూష్ బదానీ, అక్షదీప్ నాథ్, షెల్డన్ జాక్సన్ అమ్ముడు పోలేదు.

మలింగ మళ్లీ సొంతగూటికే..

శ్రీలంక స్పీడ్‌స్టర్ లసిత్ మలింగను ఈ ఏడాది వేలంలో మళ్లీ ముంబయి ఇండియన్స్ కొనుగోలు చేసింది. కనీస ధర రూ.2కోట్లతో అతడిని దక్కించుకుంది. సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ(కనీస ధర రూ.75ల‌క్ష‌లు)ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.1.1కోట్లకు దక్కించుకుంది. ఆస్ట్రేలియా పర్యటనలో కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన(6/56) చేసిన మహ్మద్ షమీ(కనీస ధర రూ.కోటి)ని రూ.4.8కోట్లకు పంజాబ్ కొనుగోలు చేసింది. మరోవైపు పేస్ బౌలర్ వరుణ్ అరోన్(రూ.50లక్షలు)ను రూ.2.40కోట్లకు రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకుంది.

మోహిత్ శర్మకు జాక్‌పాట్!

గతంలో చెన్నైకి ఆడిన మోహిత్ శర్మను మళ్లీ ఆ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది. ఫాస్ట్‌బౌలర్ మోహిత్ కోసం ముంబయి పోటీపడినప్పటికీ ధోనీ టీమ్ రూ.5కోట్లు కుమ్మరించింది. ఇప్పటి వరకు 84 ఐపీఎల్ మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. స్పిన్నర్లు రాహుల్ శర్మ, ఆడమ్ జంపాలను నిరాశే ఎదురైంది. ఖారీ పీరే, ఫవాద్ అహ్మద్‌లపై ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపలేదు.

జయదేవ్ ఉనద్కత్ @ రూ.8.4 కోట్లు

యువ పేసర్ ఉనద్కత్‌పై మళ్లీ కోట్ల వర్షం కురిసింది. గత సీజన్‌లో రూ.11.5కోట్లకు రాజస్థాన్ రాయల్స్ సొంతమైన ఉనద్కత్ ఈసారి రూ.1.5 కోట్ల కనీస ధరతో వేలానికి వచ్చాడు. లెఫ్టార్మ్ పేసర్ కోసం రాజస్థాన్, ఢిల్లీ పోటీ పడ్డాయి. మధ్యలో రూ.5కోట్ల బిడ్‌తో చెన్నై కూడా పోటీలోకి వచ్చింది. చివరికి రూ.8.4కోట్లకు మళ్లీ రాజస్థాన్ దక్కించుకుంది. ఇప్పటి ఈవేలంలో భారత్ నుంచి అత్యధిక ధర పలికింది ఉనద్కత్ కావడం విశేషం.

బెయిర్‌స్టో.. సాహా.. హైదరాబాద్‌కే!

ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బెయిర్‌స్టో(కనీస ధర రూ.1.5కోట్లు)ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.2.20కోట్లకు దక్కించుకుంది. అలాగే గాయం నుంచి కోలుకున్న భారత వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాను మళ్లీ హైదరాబాదే రూ.1.2 కోట్లకు కొనుగోలు చేసింది. భారత వికెట్ కీపర్ నమన్ ఓజాను ఏ ఫ్రాంఛైజీ కొనలేదు.

పంజాబ్ టీమ్‌లోకి నికోలస్ పూరన్

22ఏళ్ల నికోలస్ పూరన్ కలలో కూడా ఊహించని ధరకు అమ్ముడుపోయాడు. రూ.75లక్షలతో వేలంలోకి వచ్చిన అతడిని రూ.4.2కోట్లకు పంజాబ్ కొనుగోలు చేసింది. ఇటీవ‌ల భార‌త ప‌ర్య‌ట‌న‌లో చెలరేగి ఆడిన విండీస్‌ ఆటగాడు నికోలస్‌ పూరన్‌ 24 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేశాడు.

అక్షర్ పటేల్..రూ.5కోట్లు!

కనీస ధర రూ.1కోటితో వేలంలో పాల్గొన్న ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ భారీ ధర పలికాడు. యువ క్రికెటర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.5కోట్లకు దక్కించుకుంది. కనీస ధర రూ.1కోటితో వేలంలోకి వచ్చిన హెన్రిక్స్‌ను పంజాబ్ అదే ధరకు కొనుగోలు చేసింది. గుర్‌కీరత్ సింగ్‌ను కనీస ధర రూ.50లక్షలకు బెంగళూరు కొనుగోలు చేసింది.

యువీకి షాక్..!

రూ.1కోటితో వేలంలోకి వచ్చిన ఆల్‌రౌండర్ యువరాజ్‌సింగ్‌పై ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపలేదు. గత సీజన్లలో అతడి ప్రదర్శనతో పాటు ప్రస్తుత ఫామ్‌ను పరిగణనలోకి తీసుకున్న యాజమాన్యాలు అతడి కోసం పోటీపడలేదు.ఒకప్పుడు రూ.16 కోట్లు పలికిన స్టార్ లెఫ్ట్‌హ్యాండర్ యువరాజ్‌ను గతేడాది అతని కనీసధర రూ.2కోట్లకు కింగ్స్ పంజాబ్ కొనుగోలు చేయగా..ఇప్పుడు షాకిచ్చాయి.

బ్రాత్‌వైట్‌@ రూ.5కోట్లు!

ఆల్‌రౌండర్ల కోసం నిర్వహించిన వేలంలో ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ క్రిస్‌వోక్స్‌ను ఎవరూ కొనలేదు. ఆ తర్వాత వచ్చిన విండీస్ ఆల్‌రౌండర్ కార్లోస్ బ్రాత్‌వైట్ కోసం కోల్‌కతా, పంజాబ్ పోటీపడ్డాయి. రూ.75లక్షల కనీస ధరతో పాల్గొన్న బ్రాత్‌వైట్‌ను రూ.5కోట్లు వెచ్చించి కోల్‌కతా కొనుగోలు చేసింది.

తెలుగు క్రికెటర్ హనుమ విహారీ ఢిల్లీ జ‌ట్టులో..

కొద్దిరోజులుగా నిలకడగా రాణిస్తున్న హనుమ విహారిని కొనుగోలు చేసేందుకు ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి. కనీస ధర రూ.50లక్షలతో వేలంలో పాల్గొన్న ఆల్‌రౌండర్ కోసం ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీపడగా ఆఖరికి రూ.2కోట్లకు విహారిని ఢిల్లీ దక్కించుకుంది.

కనీస ధర రూ.50లక్షలతో వేలంలోకి వచ్చిన విండీస్ స్టార్ ప్లేయర్ హెట్‌మైర్ అనూహ్య ధర పలికాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ హెట్‌మైర్ కోసం పోటీపడ్డాయి. మధ్యలో పోటీకి వచ్చిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.4.20కోట్లకు కొనుగోలు చేసింది.

పుజారాకు నో ఛాన్స్‌..!

వేలంలో మనోజ్ తివారి, పుజారా, మార్టిన్ గప్తిల్, బ్రెండన్ మెక్‌కలమ్, అలెక్స్ హేల్స్(ఇంగ్లాండ్)లపై ఫ్రాంఛైజీలు ఆసక్తి కనబర్చలేదు.

వేలంలో అందరి దృష్టి సీనియర్ ఆల్‌రౌండర్ యువరాజ్‌సింగ్‌పైనే ఉంది. ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో ధనాధన్ ఇన్నింగ్స్‌తో మెరుపులు మెరిపించిన యువరాజ్.. ఇప్పుడు ఫామ్‌లేమీతో ఇబ్బందిపడుతున్నాడు. యువీని ఇప్పుడు ఏదైనా ఫ్రాంఛైజీ కొనుగోలు చేస్తుందా అన్న సందేహం అభిమానుల్లో ఉంది. 351 మంది క్రికెటర్ల నుంచి 70 మందిని లీగ్‌లోని 8 జట్లు ఎంపిక చేసుకునే వీలుంది. వేలంలో రూ. 2 కోట్ల కనీస ధరలో 9 మంది విదేశీ క్రికెటర్లుండగా భారత్‌ నుంచి ఎవరూ లేకపోవడం గమనార్హం.4111
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles