హైదరాబాద్‌పై కోల్‌కతా సూపర్ విక్టరీ

Mon,March 25, 2019 01:06 AM

IPL 2019: Russell Blitz Helps KKR Snatch Last-gasp Victory

- విధ్వంసక ఇన్నింగ్స్‌తో విజృంభణ
- గిల్‌తో కలిసి బౌండరీల మోత
- వార్నర్ అర్ధసెంచరీ వృథా


కోల్‌కతా నైట్‌రైడర్స్ కమాల్ చేసింది. ఓటమి ఖాయమనుకున్న వేళ వీరోచిత పోరాటంతో విజయాన్ని ముద్దాడింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 182 పరుగుల లక్ష్యఛేదనలో పడుతూ లేస్తూ సాగిన కోల్‌కతాను విధ్వంసక వీరుడు అండ్రూ రస్సెల్ గెలుపు తీరాలకు చేర్చాడు. అసాధ్యమనుకున్న లక్ష్యాన్ని అవలీలగా అధిగమిస్తూ అభిమానులను సంబురాల్లో ముంచెత్తాడు. చారిత్రక ఈడెన్ గార్డెన్స్‌లో రస్సెల్ సాగించిన విధ్వంసానికి వేదికైంది. విజయానికి ఆఖరి మూడోవర్లలో 53 పరుగులు అవసరమైన దశలో ఈ హార్డ్‌హిట్టర్ సన్‌రైజర్స్ బౌలింగ్‌ను చీల్చి చెండాడుతూ బౌండరీల వర్షం కురిపించాడు. శుభ్‌మన్ గిల్‌తో కలిసి రస్సెల్ కొట్టిన కొట్టుడుకు ఈడెన్ గార్డెన్స్ హోరెత్తిపోయింది. 19 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్స్‌లతో చెలరేగిన రస్సెల్ కోల్‌కతాకు అదిరిపోయే బోణీ అందించాడు. బౌలింగ్‌లో తామే మేటి అనుకున్న రైజర్స్ లోపాలను ఎత్తిచూపుతూ పరుగుల వరద పారించాడు. తొలుత వార్నర్ వీరోచిత అర్ధసెంచరీతో హైదరాబాద్ పోరాడే స్కోరు దక్కించుకుంది.

కోల్‌కతా: ఐపీఎల్‌లో అసలు మజా అభిమానులకు దక్కింది. చెన్నై, బెంగళూరు స్వల్ప స్కోరింగ్ ఫ్యాన్స్‌ను నిరాశపర్చుగా..ఆ లోటును హైదరాబాద్, కోల్‌కతా మ్యాచ్ తీర్చింది. పొట్టి ఫార్మాట్‌లో అసలు సిసలైన మజాను అందిస్తూ ఆఖరి వరకు ఆసక్తి కల్గించింది. పరుగుల హోరు పారిన మ్యాచ్‌లో హైదరాబాద్‌పై కోల్‌కతాదే పైచేయి అయ్యింది. లీగ్‌లో తమ బోణీ సంప్రదాయాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తూ హైదరాబాద్‌పై 6 వికెట్ల తేడాతో కార్తీక్‌సేన ఘనవిజయం సాధించింది. హైదరాబాద్ నిర్దేశించిన 182 పరుగుల లక్ష్యాన్ని..కోల్‌కతా 19.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. నితీశ్ రానా(47 బంతుల్లో 68, 8ఫోర్లు, 3సిక్స్‌లు) బాధ్యతాయుత అర్ధసెంచరీకి తోడు ఆఖర్లో రస్సెల్(19 బంతుల్లో 49 నాటౌట్, 4ఫోర్లు, 4సిక్స్‌లు), శుభ్‌మన్ గిల్(10 బంతుల్లో 18 నాటౌట్, 2సిక్స్‌లు) విజృంభణతో విజయాన్నందుకుంది. షకీబల్, సందీప్, కౌల్, రషీద్ ఒక్కో వికెట్ తీశారు. అంతకుముందు వార్నర్(53 బంతుల్లో 85, 9ఫోర్లు, 3సిక్స్‌లు), శంకర్(24 బంతుల్లో 40 నాటౌట్, 2ఫోర్లు, 2సిక్స్‌లు) రాణింపుతో హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 181/3 స్కోరు చేసింది. రస్సెల్(2/32)కు రెండు వికెట్లు దక్కాయి. రస్సెల్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.

కార్తీక్ మిస్: అప్పటికే మంచి జోరు మీదున్న వార్నర్‌ను ఔట్ చేసే అవకాశాన్ని కార్తీక్ వృథా చేశాడు. ఫెర్గుసన్ 12వ ఓవర్లో నాలుగో బంతికి వార్నర్ ఇచ్చిన క్యాచ్‌ను కార్తీక్ విడిచిపెట్టడం భారీ స్కోరుకు బాటలు వేసింది. ఆ మరుసటి ఓవర్లోనే చావ్లా..బెయిర్‌స్టో బౌల్డ్ చేయడంతో తొలి వికెట్‌కు 118 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

శంకర్ సూపర్: ప్రపంచకప్ బెర్తుపై కన్నేసిన విజయ్ శంకర్(40 నాటౌట్)..రైజర్స్ తరఫున తొలి మ్యాచ్‌లో అదరగొట్టాడు. నరైన్ బౌలింగ్‌లో భారీ సిక్స్‌తో తన ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పాడు. అయితే ఓవర్ తేడాతో వార్నర్‌ను రస్సెల్ పెవిలియన్ పంపాడు. కవర్స్‌లో ఉతప్ప అద్భుత క్యాచ్‌తో రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. ఓవైపు శంకర్ బౌండరీలతో చెలరేగే ప్రయత్నం చేసినా యూసుఫ్ పఠాన్(1) నిరాశపరుచగా, మనీశ్‌పాండే(8 నాటౌట్)తో కలిసి శంకర్ జట్టుకు పోరాడే స్కోరు కట్టబెట్టాడు.

కోల్‌కతా కమాల్

లక్ష్యఛేదనలో కోల్‌కతాకు మెరుగైన శుభారంభం దక్కలేదు. ఓపెనర్ క్రిస్‌లిన్(7) స్వల్ప స్కోరుకే ఔటయ్యాడు. ఆ తర్వాత రానా, ఉతప్ప(35) కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. అయితే కౌల్ బౌలింగ్‌లో ఉతప్ప ఔట్ కావడంతో రెండో వికెట్‌కు 80 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. కెప్టెన్ కార్తీక్(2) బ్యాటు ఝులిపించడంలో విఫలమయ్యాడు. ఉతప్పను కార్తీక్ అనుసరించి ఔట్ కావడంతో కోల్‌కతా తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయింది. ఈ తరుణంలో రస్సెల్, గిల్ అద్భుతం చేశారు. ఆఖరి మూడు ఓవర్లలో విజయానికి 53 పరుగులు కావాల్సిన దశలో రస్సెల్ సాగించిన విధ్వంసం మాటలకందనిది. కౌల్ 18వ ఓవర్లో రెండు భారీ సిక్స్‌లు, ఓ ఫోర్‌తో 19 పరుగులు పిండుకున్నాడు. అదే జోరులో భువనేశ్వర్‌ను లక్ష్యంగా చేసుకుంటూ 4,6, 4, 0, 6తో 21 పరుగులు కొల్లగొట్టి కోల్‌కతాకు గెలుపు ఖరారు చేశాడు. షకీబల్ ఆఖరి ఓవర్లో రస్సెల్ ఇచ్చిన స్ఫూర్తితో గిల్ రెండు భారీ సిక్స్‌లు కొట్టి కోల్‌కతా ఫ్యాన్స్‌ను సంబురాల్లో ముంచెత్తాడు.

వార్నర్ విజృంభణ

వార్నర్ రీఎంట్రీ అదిరిపోయింది. కసిదీరా బౌలర్లను బాదుతూ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. వార్న ర్(85) అర్ధసెంచరీతో సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 181 పరుగులు చేసింది. ప్రసిద్ధ్ క్రిష్ణ తొలి ఓవర్లోనే ఎక్స్‌ట్రాలతో నిరాశపరిచాడు. ఇదే అదునుగా వార్నర్ బ్యాటు ఝులిపించాడు. చావ్లా బౌలింగ్‌లో వరుస బౌండరీలు బాదిన ఈ హార్డ్‌హిట్టర్ వెనుదిరిగి చూడలేదు. కొత్తగా జట్టులోకొచ్చిన బెయిర్‌స్టో(39) వార్నర్‌కు చక్కని సహకారం అందించాడు. చావ్లా రెండో ఓవర్లో వార్నర్ ఎల్బీడబ్ల్యూ నుంచి బయటపడ్డాడు. ఔట్‌పై డీఆర్‌ఎస్‌కు వెళ్లిన కోల్‌కతాకు నిరాశే ఎదురైంది. నరైన్ బౌలింగ్‌లో వార్నర్ వరుసగా రెండు బౌండరీలు బాదడంతో పవర్‌ప్లే ముగిసే సరికి వికెట్ కోల్పోకుండా 54 పరుగులు చేసింది. బౌలింగ్ మార్పుగా వచ్చిన కుల్దీప్‌ను కూడా వార్నర్ వదల్లేదు. చూడచక్కని రివర్స్‌స్వీప్‌షాట్‌తో కుల్దీప్‌కు స్వాగతం పలికాడు. తన ఐపీఎల్ కెరీర్‌లో 37వ అర్ధసెంచరీని ఖాతాలో వేసుకున్నాడు.

ఫ్లడ్‌లైట్ల అంతరాయం

కోల్‌కతా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఫ్లడ్‌లైట్లు అర్ధంతరంగా వెలుగడం ఆగిపోయాయి. దీంతో ఫీల్డ్ అంపైర్లు మ్యాచ్‌ను 12 నిమిషాల పాటు ఆపివేసారు. ఆట మొదలైన వెంటనే తొలి బంతికే రానాను రషీద్‌ఖాన్ ఎల్బీడబ్ల్యూ చేసి హైదరాబాద్ శిబిరంలో ఆనందం నింపాడు.

స్కోరుబోర్డు

హైదరాబాద్: వార్నర్(సి)ఉతప్ప(బి)రస్సెల్ 85, బెయిర్‌స్టో(బి)చావ్లా 39, శంకర్ 40 నాటౌట్, యూసుఫ్ (బి)రస్సెల్ 1, మనీశ్ పాండే 8 నాటౌట్; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 20 ఓవర్లలో 181/3; వికెట్ల పతనం: 1-118, 2-144, 3-152; బౌలింగ్: ప్రసిద్ధ్ క్రిష్ణ 4-0-31-0, చావ్లా 3-0-23-1, ఫెర్గుసన్ 4-0-34-0, నరైన్ 3-0-29-0, కుల్దీప్ 2-0-18-0, రస్సెల్ 3-0-32-2, రానా 1-0-9-0.

కోల్‌కతా: లిన్(సి)రషీద్‌ఖాన్ (బి)షకీబల్ 7, రానా (ఎల్బీ) రషీద్‌ఖాన్, ఉతప్ప (బి) కౌల్ 35, కార్తీక్(సి)భువనేశ్వర్(బి)సందీప్‌శర్మ 2, రస్సెల్ 49 నాటౌట్, శుభ్‌మన్ గిల్ 18 నాటౌట్; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 19.4 ఓవర్లలో 183/4; వికెట్ల పతనం: 1-7, 2-87, 3-95, 4-118; బౌలింగ్: భువనేశ్వర్ 4-0-37-0, షకీబల్ 3.4-0-42-1, సందీప్‌శర్మ 4-0-42-1, సిద్దార్థ్ కౌల్ 4-0-35-1, రషీద్‌ఖాన్ 4-0-26-1.

2725
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles