టీమిండియా 649.. వెస్టిండీస్ 94/6

Fri,October 5, 2018 05:08 PM

India eye on big lead in first innings as West Indies lose their top and Middle order

రాజ్‌కోట్: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ రెండో రోజే మ్యాచ్‌పై పూర్తిగా పట్టు బిగించేసింది టీమిండియా. తొలి ఇన్నింగ్స్‌లో 649 పరుగుల భారీ స్కోరు చేసిన కోహ్లి సేన.. తర్వాత విండీస్ టాప్, మిడిలార్డర్‌ను కుప్పకూల్చింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి కరీబియన్ టీమ్ 6 వికెట్లకు 94 పరుగులు మాత్రమే చేయగలగింది. ఇంకా తొలి ఇన్నింగ్స్‌లో 555 పరుగులు వెనుకబడింది. టీమిండియా బౌలర్లలో షమి 2, అశ్విన్, కుల్‌దీప్, జడేజా తలా ఒక వికెట్ తీసుకున్నారు. ప్రస్తుతం చేజ్ 27, పాల్ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్ల ధాటికి విండీస్ బ్యాట్స్‌మెన్ నిలవలేకపోయారు. ఆ టీమ్ బౌలర్లలాగే ఏమాత్రం అనుభవం లేని విండీస్ బ్యాట్స్‌మెన్ కనీస పోరాటం లేకుండానే చేతులెత్తేశారు. మూడో ఓవర్లో మొదలైన వికెట్ల పతనం.. వరుసగా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుత పరిస్థితి చూస్తే ఈ మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్ విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తున్నది. మూడో రోజే మ్యాచ్ ముగిసిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.


అంత‌కుముందు వెస్టిండీస్ బౌలర్లను ఆటాడుకున్నారు టీమిండియా బ్యాట్స్‌మన్. ఏకంగా ముగ్గురు బ్యాట్స్‌మెన్ సెంచరీలతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లకు 649 పరుగుల భారీ స్కోరు దగ్గర ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. లోకల్ బాయ్ రవీంద్ర జడేజా కూడా తన సొంత గడ్డపై కెరీర్‌లోనే తొలి సెంచరీ చేశాడు. 132 బంతుల్లో అతను మూడంకెల స్కోరు అందుకోగానే ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది టీమిండియా. అతని ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. అంతకుముందు విరాట్ కోహ్లి 139, పృథ్వీ షా 134, రిషబ్ పంత్ 92, పుజారా 86 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. విండీస్ బౌలర్లలో దేవేంద్ర బిషూ 4 వికెట్లతో రాణించాడు.

4 వికెట్లకు 364 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్.. ధాటిగా ఆడింది. ఇవాళ 60 ఓవర్లు ఆడి మరో 285 పరుగులు చేసింది. ముఖ్యంగా తొలి సెషన్‌లో కోహ్లి, పంత్ చెలరేగి ఆడారు. ఆ తర్వాత జడేజా టెయిలెండర్ల సాయంతో స్కోరును 600 దాటించడంతోపాటు తన కెరీర్‌లో తొలి సెంచరీని అందుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మూడు ట్రిపుల్ సెంచరీలు చేసిన జడేజాకు ఇంటర్నేషనల్ కెరీర్‌లో తొలి సెంచరీ చేయడానికి 169 ఇన్నింగ్స్ పట్టడం విశేషం. ఈ మూమెంట్‌ను తనదైన ైస్టెల్లో బ్యాట్‌ను కత్తిలా తిప్పుతూ సెలబ్రేట్ చేసుకున్నాడు.

3534
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles