ఇంగ్లండ్ సిరీస్ జ‌రిగేనా?

Fri,November 4, 2016 11:34 AM

India, England series is in jeopardy as BCCI, Lodha Panel Stand off continues

ముంబై: ఇండియా, ఇంగ్లండ్ సిరీస్ జ‌రిగేది అనుమానంగా మారింది. లోధా ప్యానెల్‌, బీసీసీఐ మ‌ధ్య మ‌రోసారి వివాదం త‌లెత్తింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్ర‌కారం లోధా ప్యానెల సిఫార‌సుల‌ను అమ‌లుచేస్తామ‌ని బోర్డు అధ్య‌క్షుడు అనురాగ్ ఠాకూర్‌, కార్య‌ద‌ర్శి అజ‌య్ షిర్కే అఫిడ‌విట్స్ దాఖ‌లు చేయాల్సి ఉంది. ఈ అఫిడ‌విట్స్ దాఖ‌లు చేసిన త‌ర్వాతే ప్యానెల్‌.. నిధుల విడుద‌లకు అనుమ‌తి ఇస్తుంది. నిధుల విడుద‌ల కాక‌పోతే సిరీస్ నిర్వ‌హించ‌డం తమ వ‌ల్ల కాద‌ని బీసీసీఐ మ‌రోసారి త‌ప్పును లోధా ప్యానెల్‌పైకి తోసే ప్ర‌య‌త్నం చేస్తోంది. దీనిపై క‌మిటీ కూడా గ‌ట్టిగానే స్పందించింది. ఒక‌వేళ ఇంగ్లండ్ సిరీస్ ర‌ద్ద‌య్యే ప‌రిస్థితి వ‌స్తే దానికి బోర్డు అధ్య‌క్ష‌, కార్య‌ద‌ర్శులే కార‌ణ‌మ‌వుతార‌ని స్ప‌ష్టం చేసింది. ఇప్ప‌టివ‌ర‌కు ఆ ఇద్ద‌రూ అఫిడ‌విట్స్ దాఖ‌లు చేయ‌లేదు. సిఫార‌సులు ఎలా అమ‌లు చేస్తారో ఠాకూర్ కూడా హామీ ఇవ్వాల్సి ఉంది. కానీ ఇప్ప‌టివ‌ర‌కు అది జ‌ర‌గ‌లేదు. ఇంగ్లండ్ సిరీస్ ఈ ఇద్ద‌రి కార‌ణంగానే సందిగ్ధంలో ప‌డింది అని క‌మిటీ వ‌ర్గాలు చెప్పాయి.

అయితే బోర్డు మాత్రం క‌మిటీ వాద‌న‌ను ఖండిస్తోంది. అఫిడ‌విట్ దాఖ‌లుకు న‌వంబ‌ర్ ఐదో తేదీ వ‌ర‌కు స‌మ‌యం ఉంద‌ని వాదిస్తోంది. ఇండియా, ఇంగ్లండ్ బోర్డుల మ‌ధ్య మెమొరాండ‌మ్ ఆఫ్ అగ్రిమెంట్ (ఎంవోయూ) క‌మిటీ ప‌రిధిలోకి రాద‌ని, త‌మ‌కు కావాల్సిన వివ‌రాల‌న్నీ ఇచ్చే వ‌ర‌కు నిధుల విడుద‌ల సాధ్యం కాద‌ని గురువారం క‌మిటీ బోర్డుకు స్ప‌ష్టంచేసింది. అటు ఎంవోయూ చేసుకోవ‌డం కుద‌ర‌క‌పోవ‌డంతో ఇంగ్లండ్ బోర్డే త‌మ టీమ్ ఖ‌ర్చులు భ‌రించాల‌ని బీసీసీఐ ఈసీబీకి లేఖ రాసింది. టూర్‌ను కొన‌సాగించ‌డం లేక‌పోవ‌డం ఇక ఇంగ్లండ్ ఇష్ట‌మ‌ని బోర్డు స్ప‌ష్టంచేసింది. అయితే ఇంగ్లండ్ బోర్డు అధికార ప్ర‌తినిధి మాత్రం టూర్‌లో ఎలాంటి మార్పు లేద‌ని తెలిపారు. ఇప్ప‌టికే త‌మ టీమ్ ఇండియాలో ఉంద‌ని, భార‌త్‌తో సిరీస్ కోసం ఎదురు చూస్తున్నామ‌ని చెప్పారు. ఇంగ్లండ్ టీమ్ బుధ‌వార‌మే ముంబై చేరుకుంది. ఆదివారం తొలి టెస్ట్ జ‌రిగే రాజ్‌కోట్‌కు వెళ్ల‌నుంది. ఏ ద్వైపాక్షిక సిరీస్ జరిగినా రెండు బోర్డుల మ‌ధ్య ఒప్పందం జ‌రుగుతుంది. ప‌ర్యాట‌క జ‌ట్టుకు సంబంధించిన ఖ‌ర్చుల‌న్నీ ఆతిథ్య బోర్డు భ‌రించాల్సి ఉంటుంది.

అయితే లోధా ప్యానెల్‌, బీసీసీఐ మ‌ధ్య నెల‌కొన్న సంక్షోభం కార‌ణంగా నిధుల విడుద‌ల జ‌ర‌గ‌క‌పోవ‌డంతో రెండు బోర్డుల మ‌ధ్య ఇంకా ఎంవోయూ కుద‌ర‌లేదు. ఒక‌వేళ ఇంగ్లండ్ ఈ సిరీస్‌ను ర‌ద్దు చేసుకుంటే అది బీసీసీఐకి తీవ్ర న‌ష్టం మిగిల్చ‌నుంది. ఇండియ‌న్ బోర్డుకు ఒక్కో టెస్ట్‌కు సుమారు రూ.50 కోట్లు న‌ష్టం వాటిల్ల‌నుంది.

3337
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles