ఇండియా, ఇంగ్లండ్ టీమ్స్‌కు ట్రాఫిక్ క‌ష్టాలు

Fri,January 20, 2017 03:49 PM

India, England cricket teams were stuck in Kolkata traffic for 30 minutes

కోల్‌క‌తా: ట‌్రాఫిక్ క‌ష్టాలు సామాన్యుడికే కాదు ఇండియా, ఇంగ్లండ్ క్రికెట్ టీమ్స్‌నూ వ‌ద‌ల్లేదు. మూడో వ‌న్డే జ‌రిగే కోల్‌క‌తాకు వెళ్లిన రెండు జ‌ట్లు క‌నీసం 30 నిమిషాలు పాటు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయి. రోడ్ల‌న్నీ ఎక్క‌డిక‌క్క‌డ జామ్ అవ‌డంతో రెండు బ‌స్సులు ముందుకు క‌ద‌ల్లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. శుక్రవార‌మంతా న‌గ‌రంలో వీవీఐపీల ప్రోగ్రామ్స్‌తో ట్రాఫిక్ క‌ష్టాలు సాధార‌ణం కంటే రెట్టింప‌య్యాయి. బెంగాల్ గ్లోబ‌ల్ బిజినెస్ స‌ద‌స్సు ఓవైపు.. రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్‌ముఖ‌ర్జీ మ‌రోవైపు.. మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ ఇంకోవైపు.. ఇలా న‌గ‌రంలో వీవీఐపీలు అటూ ఇటూ తిరుగుతుండ‌టంతో త‌ర‌చూ ట్రాఫిక్‌ను నిలిపేయాల్సి వ‌చ్చింది. రాష్ట్ర‌ప‌తి, మాజీ ప్ర‌ధాని ప్రెసిడెన్సీ యూనివ‌ర్సిటీ రెండు వంద‌ల ఏళ్ల సంబురాల్లో పాల్గొన‌డానికి వ‌చ్చారు.

అదే స‌మ‌యంలో రెండు క్రికెట్ టీమ్స్ కూడా కోల్‌క‌తాలో అడుగుపెట్టాయి. దీంతో సాధార‌ణ జ‌నంతోపాటు ట్రాఫిక్ పోలీసుల‌కు కూడా చుక్క‌లు క‌నిపించాయి. రెండు బ‌స్సులు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవ‌డంతో త‌మ అభిమాన క్రికెట‌ర్ల ఫొటోలు, బ‌స్‌తో సెల్ఫీలు దిగ‌డానికి ఫ్యాన్స్ పోటీ ప‌డ్డారు. దీంతో ట్రాఫిక్ జామ్ మ‌రింత పెరిగిపోయింది. బ‌స్సుల‌కు సెక్యూరిటీగా ఉన్న ర్యాపిడ్ యాక్ష‌న్ ఫోర్స్ సిబ్బంది అభిమానుల‌ను దూరంగా పెట్ట‌డానికి చాలా శ్ర‌మించాల్సి వ‌చ్చింది. మొత్తానికి 30 నిమిషాలు ట్రాఫిక్‌లో చిక్కుకున్న క్రికెట‌ర్లు అలీపూర్‌లోని హోట‌ల్‌కు చేరుకున్నారు. క‌ట‌క్ వ‌న్డేలోనూ గెలిచిన టీమిండియా ఇప్ప‌టికే మూడు వ‌న్డేల సిరీస్‌ను 2-0తో గెలుచుకుంది. చివ‌రి వ‌న్డే 22న ఈడెన్ గార్డెన్స్‌లో జ‌రుగుతుంది.

2271
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles