క్రికెట్‌లో ఇక టాస్ ఉండదా?

Thu,May 17, 2018 03:56 PM

ICC Cricket committee to debate on Toss

దుబాయ్: క్రికెట్‌లో టాస్‌కు ఉన్న ప్రాధాన్యత తెలుసు కదా. మొదట ఎవరు బ్యాటింగ్ లేదా బౌలింగ్ చేయాలన్నది టాస్ ద్వారానే నిర్ణయిస్తున్నారు. 1877లో తొలి టెస్ట్ జరిగినప్పటి నుంచీ క్రికెట్‌లో టాస్ ఉంది. అయితే ఈ మధ్య టాస్‌కు ప్రాధాన్యత పెరిగిపోతుండటంపై కూడా ఆందోళన వ్యక్తమవుతున్నది. చాలా వరకు ఆతిథ్య టీమ్స్‌కు టాస్ అనుకూలిస్తున్నదన్న విమర్శలు ఉన్నాయి. దీంతో అసలు క్రికెట్‌లో టాస్ అవసరమా అన్న చర్చ మొదలైంది.

దీనిపైనే ఐసీసీ క్రికెట్ కమిటీ సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశం మే 28, 29న ముంబైలో జరగనుంది. టెస్ట్ చాంపియన్‌షిప్ రానున్న నేపథ్యంలో హోంగ్రౌండ్ అడ్వాంటేజ్‌ను తగ్గించే యోచనలో భాగంగా టాస్‌ను రద్దు చేయాలని ఐసీసీ క్రికెట్ కమిటీ ఆలోచిస్తున్నది. సాధారణంగా హోమ్ టీమ్ కెప్టెన్ కాయిన్‌ను గాల్లోకి విసురుతాడు.. విజిటింగ్ కెప్టెన్ ఏది కావాలో చెబుతాడు. అయితే ఈ టాస్ హోంటీమ్‌కు కలిసొస్తున్నదని కొన్ని రోజులుగా విమర్శలు పెరిగిపోతున్నాయి.

ఇప్పటికే టెస్ట్ పిచ్ ప్రిపరేషన్‌ను ఆతిథ్య జట్టుకు అనుకూలంగా చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అందువల్ల టాస్‌ను ఆటోమేటిగ్గా విజిటింగ్ టీమ్‌కు ఇవ్వాలన్న ప్రతిపాదనకు కొందరు కమిటీ సభ్యులు ఓకే చెప్పారు. అయితే మరికొందరు మాత్రం దీనిని వ్యతిరేకిస్తున్నారు అని కమిటీ సభ్యులకు పంపిన లేఖలో ఐసీసీ పేర్కొన్నది. ఇప్పటికే 2016లో కౌంటీ చాంపియన్‌షిప్‌లో ప్రయోగాత్మకంగా టాస్‌ను రద్దు చేసి చూశారు. దీనివల్ల మ్యాచ్‌లు ఎక్కువ రోజులు మరింత ఆసక్తికరంగా సాగాయని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు వెల్లడించింది.

ఇండియాలోనూ దేశవాళీ క్రికెట్‌లో టాస్‌ను రద్దు చేయాలన్న ప్రతిపాదన వచ్చినా దానికి ఆమోదం లభించలేదు. ఐసీసీ క్రికెట్ కమిటీలో అనిల్‌కుంబ్లే, రాహుల్‌ద్రవిడ్‌లాంటి ఇండియన్ మాజీ క్రికెటర్లతోపాటు ఆండ్రూ స్ట్రాస్, మహేల జయవర్దనె, టిమ్ మే, న్యూజిలాండ్ క్రికెట్ సీఈవో డేవిడ్ వైట్, అంపైర్ రిచర్డ్ కేటిల్‌బరో, ఐసీసీ మ్యాచ్ రిఫరీలు రంజన్ మదుగలె, షాన్ పొలాక్, క్లేర్ కానర్ ఉన్నారు. క్రికెట్‌లో టాస్‌ను వ్యతిరేకిస్తున్న ప్రముఖ క్రికెటర్లలో వెస్టిండీస్ లెజెండ్ మైకేల్ హోల్డింగ్, ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ వా ఉన్నారు.

5330
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles