నేను పాండ్యానే.. కపిల్‌దేవ్ కావాలనుకోవడం లేదు!

Mon,August 20, 2018 01:43 PM

I have never wanted to be Kapil Dev says Hardik Pandya on Micheal Holdings comments

నాటింగ్‌హామ్: వెస్టిండీస్ మాజీ పేసర్ మైకేల్ హోల్డింగ్‌కు గట్టి పంచ్ ఇచ్చాడు టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా. అతడు కపిల్ దేవ్ అయ్యే అవకాశమే లేదని హోల్డింగ్ అనడంపై పాండ్యా స్పందించాడు. తనను తనగానే చూడాలి తప్ప.. ఎవరితోనూ పోల్చొద్దని అతను స్పష్టంచేశాడు. మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను దెబ్బతీశాడు హార్దిక్ పాండ్యా. కండిషన్స్ స్వింగ్‌కు అనుకూలించడంతో అతడు చెలరేగిపోయాడు. అయితే మ్యాచ్ మొదలయ్యే రెండు రోజుల ముందు క్రికిన్ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హోల్డింగ్ మాట్లాడుతూ.. కపిల్‌దేవ్‌లాగా ప్రపంచస్థాయి ఆల్‌రౌండర్‌గా పాండ్యా ఎదగాలంటే ఇంకా చాలా చేయాల్సి ఉందని అన్నాడు. బంతితో పాండ్యా నిలకడగా రాణించడం లేదని, ఈ విషయంలో నిలకడగా రాణించే ప్లేయర్ టీమ్‌కు కావాలని హోల్డింగ్ చెప్పాడు. అయితే మ్యాచ్ మొదలైన రెండో రోజే పాండ్యా బౌలింగ్‌లో రాణించాడు. కెరీర్‌లో పదో టెస్ట్ ఆడుతున్న అతడు.. తొలిసారి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల మైలురాయిని అందుకున్నాడు.

రెండో రోజు ఆట ముగిసిన తర్వాత పాండ్యా మీడియాతో మాట్లాడాడు. నేనెప్పుడూ కపిల్ దేవ్ కావాలని అనుకోలేదు అని అతను స్పష్టంచేశాడు. నన్ను హార్దిక్ పాండ్యాగానే ఉండనివ్వండి. నేను పాండ్యాగానే బాగా ఆడుతా. నేను పాండ్యాగానే 41 వన్డేలు, పది టెస్టులు ఆడాను. కపిల్‌దేవ్‌లాగా కాదు అని అతను అన్నాడు. నాతో నా టీమ్ చాలా సంతోషంగా ఉంది. నాకు అంతకన్నా ఎక్కువ ఏమీ అవసరం లేదు అని పాండ్యా స్పష్టంచేశాడు. తాను సౌతాఫ్రికాలో ఉన్న సమయంలో పాండ్యా తర్వాతి కపిల్‌దేవ్ అని అనడం విన్నాను. కానీ అతడు కపిల్‌కు దరిదాపుల్లో కూడా లేడు అని హోల్డింగ్ అనడంపై పాండ్యా ఆగ్రహం వ్యక్తంచేశాడు. ఇక ఎవరూ తనను మరొకరితో పోల్చొద్దని, తనను తనగానే గుర్తించాలని అతను స్పష్టంచేశాడు.

2341
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles